నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో మరో డీఎస్సీ!

చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగం కోసం వేచి చూస్తారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా వేలాదిమందికి టీచర్ ఉద్యోగాలు కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరోమారు డీఎస్సీ నిరవహించడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.

మరో 3000 జాబ్స్!

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందులో భాగంగానే త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. బహుశా ఉగాది నాటికి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈసారి 3000 కంటే ఎక్కువ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.

ఖాళీలు ఇలా..

సంక్షేమ శాఖకు సంబంధించిన పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్ వంటి వాటిలో సుమారు 1200 ఖాళీలు, మున్సిపల్, పంచాయితీరాజ్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మరో 1700 పోస్టులు ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కూడా 700 వరకు భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తం 3600 పోస్టులకు ఈసారి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

గతంలో 16వేల జాబ్స్!

ఇదిలా ఉండగా.. కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చిన తరువాత 2025 ఏప్రిల్ నెలలో 16,347 డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసి.. 15,941 పోస్టులను భర్తీ చేసింది. అయితే రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు మిగిలిపోయాయి. కాబట్టి ఆ మిగిలిన పోస్టులను కూడా రాబోయే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది.

సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు!

డీఎస్సీ సిలబస్‌లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని గతంలో కొన్ని వార్తలు తెరమీదికి వచ్చినప్పటికీ, ఈసారి మాత్రం ఎలాంటి మార్పులు లేవని చెబుతున్నారు. అంటే గత డీఎస్సీకి ఇచ్చిన అదే సిలబస్ ఉంటుందన్న మాట. అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ సిలబస్‌కు సంబంధించిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. అయితే రాబోయే డీఎస్సీలో ఇంగ్లీష్, కంప్యూటర్ వంటి వాటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించాలనుకున్నప్పటికీ.. తగినంత సమయం లేకపోవడం వల్ల, ఈ నిర్ణయం కూడా ప్రస్తుతానికి వాయిదా పడింది.

800 మందికి మినిమం టైంస్కేల్!

డీఎస్సీ మాత్రమే మాత్రమే కాకుండా.. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 2600 మంది స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లలో సుమారు 800మందికి మినిమం టైమ్ స్కేల్ అమలు చేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోంది. ఒకవేళా వీరిలో ఎవరికైనా పర్మినెంట్ ఉద్యోగం కావాలనుకుంటే.. అలాంటివారు డీఎస్సీ రాయాల్సి ఉంటుంది. అయితే త్వరలో రాబోయే నోటిఫికేషన్స్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన (డేట్, ఇతర వివరాలు) వెలువడాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తన మ్యానిఫెస్టో ప్రకారం.. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసింది. ఉద్యోగులకు కూడా సరైన సమయానికి నోటిఫికెషన్స్ జారీ చేస్తోంది. అయితే కేవలం డీఎస్సీ మాత్రమే కాకుండా.. జెఎల్ (జూనియర్ లెక్చరర్స్), డీఎల్ (డిగ్రీ లెక్చరర్స్) వంటి వాటికి కూడా నోటిఫికేషన్ జారీ చేసి, ఉద్యోగాలు భర్తీ చేస్తే మరింత బాగుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.