కొత్త ఆడి కార్లు వచ్చేసాయి.. వీటి స్పెషాలిటీ ఏంటంటే?

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్, క్యూ5 సిగ్నేచర్ మోడల్స్ లాంచ్ చేసింది. ఇవి సాధారణ మోడల్స్ కంటే కొంత భిన్నంగా ఉంటాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్ గురించి పూర్తి వివరాలు.. ఈ కథనంలో తెలుసుకుందాం.

ధరలు

  • ఆడి క్యూ3: రూ. 52.31 లక్షలు
  • ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్: రూ. 53.55 లక్షలు
  • ఆడి క్యూ5: రూ. 69.86 లక్షలు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్)

ప్రత్యేకమైన డిజైన్

సాధారణ ఆడి కార్ల మాదిరిగా కాకుండా.. ఈ సిగ్నేచర్ ఎడిషన్స్ ఆడి లోగోకు ప్రొజెక్టర్ ఎల్ఈడీ వెల్కమ్ లాంప్ ఫిట్ చేశారు. ఇది కారులో చెప్పుకోదగ్గ స్పెషాలిటీ. అంతే కాకుండా క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ కార్లు ప్రత్యేకంగా కొత్త 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్, ప్రోగ్రెసివ్ రెడ్ కలర్ ఆప్షన్స్ పొందుతాయి. కాగా క్యూ5 మాత్రం గ్రాఫైట్ రంగులో పూర్తి చేయబడిన కొత్త 19 ఇంచెస్ అల్లాయ్స్ పొందుతుంది.

కలర్ ఆప్షన్స్ & ఇంటీరియర్

ఆడి కంపెనీ లాంచ్ చేసిన సిగ్నేచర్ ఎడిషన్స్.. డిస్ట్రిక్ట్ గ్రీన్, గ్లేసియర్ వైట్, మాన్‌హట్టన్ గ్రే, మైథోస్ బ్లాక్, నవర్రా బ్లూ అనే ఇది రంగుల్లో లభిస్తుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఆడి కంపెనీ ఇందులో విలాసవంతమైన క్యాబిన్ అందించింది. ఈ సిగ్నేచర్ మోడళ్లలో క్యాబిన్ సువాసన వెదజల్లే డిస్పెన్సర్, స్టెయిన్‌లెస్ స్టీల్ పెడల్ కవర్స్ చూడవచ్చు. క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మోడల్స్ పార్క్ అసిస్ట్ ప్లస్‌తో పాటు 12 వోల్ట్స్ అవుట్‌లెట్ మరియు వెనుక ప్రయాణికుల కోసం యూఎస్బీ పోర్ట్‌లు పొందుతాయి. కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషల్ ఎడిషన్.. దేశంలోని ఆడి డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఎన్ని యూనిట్లు అనేది సంస్థ వెల్లడించలేదు.

ఆడి ఇండియా హెడ్ ఏమన్నారంటే?

కంపెనీ భారతదేశంలో తన సిగ్నేచర్ ఎడిషన్స్ లాంచ్ చేసిన సందర్భంగా.. ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ మాట్లాడుతూ.. ఆడి క్యూ3, క్యూ5 మొదళ్లకు.. ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఇవే కంపెనీ అమ్మకలకు దోహదపడుతున్నాయి. ఈ కార్లు మంచి పనితీరును అందించడం వల్లనే మార్కెట్లో వీటికి ఆదరణ పెరుగుతోందని అన్నారు. కొత్తగా లాంచ్ అయిన ఈ సిగ్నేచర్ ఎడిషన్స్ కూడా తప్పకుండా.. మంచి అమ్మకాలు పొందుతాయని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు.

ఆడి కార్లకు ఇండియాలో డిమాండ్ ఇలా..

లగ్జరీ కార్లు అనగానే చాలామందికి గుర్తొచ్చేది.. ఆడి, బెంజ్ కంపెనీలు. దీన్నిబట్టి చూస్తే వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆడి కంపెనీ మన దేశంలో సుమారు 10 కంటే ఎక్కువ మోడల్స్ విక్రయిస్తోంది. ఇందులో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ఆడి కార్లను కొనుగోలు చేసేవారి జాబితాలో ఎక్కువగా సెలబ్రిటీలు, క్రికెటర్లు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. దీనికి కారణం ఆడి కార్ల ధరలు కొంత ఎక్కువగా ఉండటమే. అంతే కాకుండా ఆడి కార్లు ధరకు తగిన డిజైన్, ఫీచర్స్ మరియు లగ్జరీ అందిస్తుంది.