టీ20 విన్నింగ్.. ఆర్సీబీ ఉమెన్స్ టీమ్‌కు ఎలక్ట్రిక్ స్కూటర్స్!

టీమిండియా క్రికెట్ ట్రోఫీ గెలిస్తే.. కార్లు లేదా బైకులు గిఫ్ట్‌గా ఇవ్వడం గతంలో కూడా చాలా సందర్భాల్లో జరిగింది. ఇప్పుడు తాజాగా బజాజ్ ఆటో ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ సీజన్ విజేతలైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ గిఫ్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

బజాజ్ ఆటో తన కొత్త చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను.. ఆర్సీబీ జట్టులోని ప్రతి మహిళా ప్లేయర్‌కు (ఒకొక్కరికి ఒక్కొక్క స్కూటర్) గిఫ్ట్‌గా ఇవ్వండుంది. అసోసియేషన్‌లో కంపెనీ కొనసాగింపుకు నిదర్శనంగా సంస్థ ఈ ప్రకటన చేసింది.

బజాజ్ చేతక్ సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్‌

ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న బజాజ్ చేతక్ లైనప్‌లో అత్యంత సరసమైనదిగా సీ25 ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ అయింది. ఇది సీ30, సీ35 మోడళ్లకు కింద ఉంటుంది. రూ.91,399 (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) ధర వద్ద లభించే ఈ స్కూటర్.. 2.5 కిలోవాట్ బ్యాటరీతో 113 కిమీ రేంజ్ అందిస్తుంది.

2:25 గంటల్లో ఛార్జ్!

బజాజ్ చేతక్ సీ25 స్కూటర్ 2 గంటల 25 నిమిషాల్లో 750 వాట్స్ ఆఫ్ బోర్డ్ ఛార్జర్ ద్వారా.. 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. దీని టాప్ స్పీడ్ 55 కిమీ / గం. రెట్రో డిజైన్ కలిగిన ఈ స్కూటర్ మెటల్ బాడీ, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ వంటి వాటితో పాటు.. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్, ఎల్సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి పొందుతుంది.

ఐపీ67 రేటెడ్ బ్యాటరీ 

చేతక్ సీ25 బరువు 108 కేజీలు. అంటే ఈ శ్రేణిలోని ఇతర మోడల్స్ కంటే కూడా దీని బరువు 22 కేజీలు తక్కువ. అండర్ సీట్ స్టోరేజ్ 25 లీటర్లు మాత్రమే. అయితే ఇందులో ఎకో, స్పోర్ట్స్ రైడ్ మోడ్స్.. రివర్స్ అసిస్ట్, హిల్ హోల్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ బ్యాటరీ ఐపీ67 రేటెడ్ పొందుతుంది.

మహిళా క్రికెట్ జట్టుకు స్కూటర్స్ గిఫ్ట్‌గా ఇస్తున్న సందర్భంగా.. బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ మాట్లాడుతూ, 2026 చారిత్రాత్మక విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టుకు అభినందనలు తెలిపారు. ఈ విజయం వారి దృఢత్వం, విశ్వాసం వల్ల సాధ్యమైంది. టీమ్ సాధించిన విజయానికి ప్రోత్సాహకంగా చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నామని అన్నారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఓఓ రాజేష్ మీనన్ మాట్లాడుతూ.. చేతక్ మా సీజన్‌కు బలమైన విలువను జోడించింది. మా విశ్వాసం మరింత పెంచింది. సంస్థ అందిస్తున్న ఈ స్కూటర్లు.. చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు.

క్రికెట్ ప్రేయర్లకు గిఫ్ట్స్ ఇదే మొదటిసారి కాదు!

మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. గతంలో కూడా టీమిండియా ప్లేయర్లకు కార్లు గిఫ్ట్ ఇచ్చారు. అంతే కాకుండా ఒలంపిక్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన వారికి కూడా కార్లు అందించారు. ఆనంద్ మహీంద్రా ఇలాంటివి తరచుగా చేస్తున్నప్పటికీ.. బజాజ్ ఆటో మొదటి సారి ప్లేయర్లకు ఎలక్ట్రిక్ స్కూటర్లను అందించింది.