Rs.10000 Fine For No PUC Certificate: దేశంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో వాతావరణంలో కాలుష్య తీవ్రత కూడా ఎక్కువవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నియమాలను అతిక్రమించిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే బీహార్ రాష్ట్రం ఓ కొత్త రూల్ ప్రవేశపెట్టింది, అతిక్రమిస్తే రూ. 10000 జరిమానా అంటూ ప్రకటించింది. దీంతో వాహనదారులు గుండెల్లో గుబులు పుట్టింది.
రూ.10000 జరిమానా
బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ లేకుంటే.. రూ. 10వేలు జరిమానా అంటూ వెల్లడించింది. కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి వాహనదారులు తప్పకుండా పీయూసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేకుంటే ఖచ్చితంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ జరిమానా కూడా మీరు టోల్ ప్లాజాల గుండా వెళ్ళేటప్పుడు విధించబడుతుంది.
టోల్ ప్లాజాల గుండా వెళ్ళేటప్పుడు ఎలా విధిస్తారు?
వాహనాలకు జరిమానా విధించడం అంటే? సాధారణంగా ట్రాఫిక్ సింగ్నెల్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధిస్తారు. అయితే బీహార్ రాష్ట్రం మాత్రం పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుండా వాహనదారుడు పట్టుబడితే.. టోల్ గేట్ వద్ద జరిమానా విధించనున్నట్లు సమాచారం. దీనికి ప్రత్యేకంగా ‘ఈ-డిటెక్షన్ సిస్టం’ రూపొందించారు. ఈ సిస్టం ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోని 32 టోల్ ప్లాజాలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఫాస్ట్‌ట్యాగ్ టెక్నాలజీతో అనుసంధానించబడుతుంది.
టోల్ బూత్ గుండా వేళ్ళ వాహనం పూర్తిగా తనిఖీ చేయబడుతుంది. వాహనం టోల్ గేట్ దాటిన తరువాత ఈ-డిటెక్షన్ సిస్టం వాహనానికి సంబంధించిన సమాచారాన్ని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (NIC) వాహన పోర్టల్‌తో క్రాస్ చెక్ చేస్తుంది. దీంతో వాహనానికి చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికెట్ ఉందా? లేదా? అనే విషయాన్ని మాత్రమే కాకుండా.. ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మరియు పర్మిట్ వంటి వాటిని చెక్ చేస్తుంది.
సరైన డాక్యుమెంట్స్ లేదని నిర్దారించిన తరువాత అక్కడికక్కడే ఆటోమాటిక్ ఈ-చలాన్ రూపొందిస్తుంది. దానిని వెంటనే వాహనదారుని యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు పంపుతుంది. పీయూసీ సర్టిఫికెట్ లేకుంటే అలాంటివారికి రూ. 10000 జరిమానా విధించబడుతుంది. ఈ జరిమానా సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్ కింద విధిస్తారు. ఇది కొత్త, పాత వాహనాలకు వర్తిస్తుంది.
వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ చాలా అవసరం. కానీ కొందరు దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలంటి వారిని సరైనదారిలో పెట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క వాహనదారుడు పీయూసీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అంతే కాకుండా ఇప్పుడు ఈ-డిటెక్షన్ సిస్టం ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (FC) కూడా తనిఖీ చేస్తుంది. ఇది లేకుంటే కూడా జరిమానా చెల్లించాల్సిందే.
ఇతర జరిమానాలు
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే రూ. 2000 జరిమానా మరియు మూడు నెలలు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే.. రూ. 2000 నుంచి రూ. 5000 వరకు (మొదటి నేరానికి) జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ఒకసారి జరిమానా విధించిన వారు మళ్ళీ అవసరమైన డాక్యుమెంట్స్ లేకుండా పట్టుబడితే.. రూ. 5000 నుంచి రూ. 10000 వరకు జరిమానా విధించబడుతుంది. జైలు శిక్ష కూడా పడుతుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన ప్రతి రోజుకు రూ. 50 జరిమానా విధించబడుతుందని తెలుస్తోంది.
రెండు రోజుల్లో 5000 కంటే ఎక్కువ చలాన్స్
బీహార్ ప్రభుత్వం కొత్త రూల్స్ ప్రవేశపెట్టే క్రమంలో భాగంగానే రెండు రోజులు ట్రయల్ రన్స్ చేపట్టి 5000 కంటే ఎక్కువ చలాన్లను జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా వాహనదారులు అప్రమత్తమయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో సరైన డాక్యుమెంట్స్ లేకుండా తిరిగే వాహనాల సంఖ్య బాగా తగ్గుతుందని అర్థమవుతోంది.
Don’t Miss: మాయం కానున్న టోల్ ప్లాజాలు!.. అంతా GNSS సిస్టం: ఇదెలా పనిచేస్తుందో తెలుసా?
ఈ-డిటెక్షన్ సిస్టం విస్తరణ
రాష్ట్రంలోని వాహనదారులు తప్పనిసరిగా అన్ని సరైన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలి అనే లక్ష్యంతో బీహార్ గవర్నమెంట్ ఈ కొత్త సిస్టం తీసుకురావడం జరిగింది. టోల్ ప్లాజాల వద్ద ఈ సిస్టం సక్సెస్ కావడంతో రాష్ట్రం మొత్తం ఈ సిస్టం అమలుచేయడానికి సన్నద్ధమైంది. దీంతో పాట్నా, ముజఫర్‌పూర్, భాగల్‌పూర్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ కొత్త సిస్టం అమలు చేయడానికి ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం ఈ నగరాల్లో హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ లేదా ఓవర్ స్పీడ్ వంటి వాటికి ట్రాఫిక్ చలాన్ విధించబడుతోంది. అయితే ఈ-డిటెక్షన్ సిస్టం అమలులోకి వచ్చిన తరువాత పీయూసీ, ఇన్సూరెన్స్ లేదా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని వాహనాలకు కూడా భారీ జరిమానా విధించనుంది.