ఇండియాలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. దీని గురించే తెలిస్తే షాకవుతారు!

Most Expensive Electric Scooter BMW CE 04 Launched: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సీఈ 04’ దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటి వరకు భారతదేశంలో విక్రయించబడుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్లలో ఖరీదైనది కావడం గమనార్హం. ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది.

ధర, బుకింగ్స్ & డెలివరీలు

భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 14.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ఇప్పటికే ప్రారంభించింది. కాగా డెలివరీలు 2024 సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతాయని సమాచారం.

డిజైన్ & కలర్ ఆప్షన్స్

డిసెంబర్ 2022లో మొదటిసారి ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది నీలం మరియు తెలుగు రంగులలో మాత్రమే విక్రయానికి రానుంది.

మ్యాక్సీ స్టైల్ డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విశాలంగా ఉన్న ఫ్రంట్ ఎండ్, బెంచ్ మాదిరిగా ఉండే సీటు, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ వంటివి పొందుతుంది. 1675 మిమీ వీల్‌బేస్ కలిగిన ఈ స్కూటర్ పొడవు 2285 మిమీ వరకు ఉంటుంది. ఎత్తు 1150 మిమీ కాగా.. వెడల్పు 855 మిమీ మాత్రమే. సీటు ఎత్తు 780 మిమీ వరకు ఉంటుంది.

ఫీచర్స్

కొత్త బీఎండబ్ల్యూ సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 10.25 ఇంచెస్ టీఎఫ్‌టీ కలర్ స్క్రీన్ పొందుతుంది. ఇది నావిగేషన్, పర్ఫామెన్స్ డేటా, రేంజ్, ఛార్జింగ్ టైమ్ వంటి వాటితో పాటు ట్రాక్షన్ కంట్రోల్, 12 వోల్ట్స్ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్ మరియు ఎలక్ట్రానిక్ రివర్స్ ఫంక్షన్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

బ్యాటరీ & రేంజ్

బీఎండబ్ల్యూ సీఈ 04 స్కూటర్ లిక్విడ్ కూల్డ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుతుంది. ఇది 41 బీహెచ్‌పీ పవర్, 62 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ 2.6 సెకన్లలో 0 నుంచి 50 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 120 కిమీ. ఇందులో ఎకో, రెయిన్ మరియు రోడ్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.

సీఈ 04 స్కూటర్ 8.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 2.3 కిలోవాట్ హోమ్ ఛార్జర్‌తో అందించబడుతుంది. కాబట్టి 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి 3 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ స్కూటర్ ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 130 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో.. ఈ రేంజ్ కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము.

సస్పెన్షన్ అండ్ బ్రేకింగ్ సిస్టం

బీఎండబ్ల్యూ మోటోరాడ్ యొక్క సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి భిన్నంగా ఉన్నప్పటికీ తప్పకుండా ఎక్కువమందిని ఆకర్షిస్తుందని భావిస్తున్నాము. ఇది స్టీల్ డబుల్ లూప్ ఫ్రేమ్ మీద నిర్మించబడి ఉంటుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో సింగిల్ బ్రిడ్జ్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు స్వింగార్మ్ ఉంటుంది. 15 ఇంచెస్ వీల్స్ పొందిన ఈ స్కూటర్ ముందు, వెనుక 265 మిమీ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది.

ఇప్పటికే కంపెనీ ఖరీదైన స్కూటర్ల విభాగంలో సీ400 జీటీని కలిగి ఉంది. దీని ధర రూ. 11 లక్షల కంటే ఎక్కువ. అయితే ఇప్పుడు కంపెనీ ఇదే విభాగంలో సీఈ 04 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కాబట్టి ప్రస్తుతం ఈ స్కూటర్ (సీఈ 04) ఖరీదైన స్కూటర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.

Don’t Miss: భారత్‌లో ఇలాంటి కారు మరొకటి లేదు!.. అనంత్ అంబానీకి అరుదైన కారు గిఫ్ట్

నిజానికి భారతదేశంలో ఖరీదైన బైకులకు, కార్లకు ఆదరణ కొంత తక్కువే. అయితే బీఎండబ్ల్యూ మోటొరాడ్ ఏకంగా రూ. 14.90 లక్షల ధర వద్ద స్కూటర్ లాంచ్ చేసింది. ఇంత ఖరీదైన స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఎలాంటి అమ్మకాలను పొందుతుందనే విషయం తెలియాల్సి ఉంది. ఈ విభాగంలో ఈ కొత్త సీఈ 04 స్కూటర్‌కు ప్రధాన ప్రత్యర్థి కూడా ఏదీ లేకపోవడం గమనార్హం.