తెలుగు సినిమాలలో దాదాపు కలిగినోళ్ల కథలు, జీవితాలానే సినిమాలుగా, సీరియల్స్‌గా, వెబ్ సిరీస్‌లుగా తీశారు, తీస్తారు, తీస్తున్నారు. అటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడో ఎక్కడో ఒకటి.. అర, అంతకంటే ఇంకా చాలా తక్కువ కథలు మాత్రమే సామాన్య ప్రజల వేదనలను, ఆర్తనాదాలని, అవమానాలని, అణచివేతలని చూపించే సినిమాలు వచ్చాయి. కానీ వారి బాధలను, బాధితుల కోణం నుంచి కాక బాధించబడ్డ వారి ఆలోచనల నుంచి చెప్పిన కథలే ఎక్కువ.
వాస్తవాలను చూపించిన కొందరు
తెలుగు చలనచిత్ర రంగంలో దాసరి నారాయణరావు, ఆర్. నారాయణ మూర్తి, ప్రేమ్ రాజ్ ఏనుముల, కరుణ కుమార్, వేణు ఊడుగుల లాంటి సినిమా దర్శకులు మాత్రమే అణగారిన జనాల భావాలని, భావజాలాలని, వారి జీవన స్థితిగతులని అర్థంచేసుకుని దానిని అంతే వాస్తవికంగా తెరపైన చూపించగలిగారు. గొప్పవాళ్లుగా, పెద్దవాళ్లుగా, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్లుగా చలామణి అవుతున్న ఏ ఒక్క దర్శకుడు కూడా అటువంటి సాహసం చేయడం కాదు కదా.. కనీసం ప్రయత్నం కూడా చేయలేదు అంటే అశ్చర్యపోనక్కరలేదు అనే చెప్పొచ్చు.
టాలీవుడ్ సినిమా రంగంలో ప్యూడల్, భూస్వామ్య, రాచరిక, మనువాద భావజాలం వారి బుర్రల్లో నాటుకుపోయింది. అయితే ఇప్పుడు వస్తున్న కొంతమంది కొత్త రచయితలు, దర్శకులు మరుగున పడిన కథలను తెరపై సమాజానికి చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే దండోరా అనే సినిమాలో పాట వింటుంటే అణచివేయబడిన వర్గాల ఆర్తనాదాలనే కథగా చెబుతున్నట్టుగా అనిస్తున్నది.
గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లిరిక్స్
బ్లాక్ అండ్ వైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో చాలాబాగా వచ్చింది. ఆయుధాలు, నేలపై తెగిపడిన అనేకమంది శరీరాలు, డబ్బులు కొట్టే మనుషులు & సింగర్ పాటలో కనిపిస్తున్నాయి. లిరిక్స్ వింటుంటే గూస్‌బంప్స్ రావడం ఖాయం.
”నిను మోసినా నను మోసినా అమ్మపేగు ఒకటేనన్నా
నిను కోసినా నను కోసినా రాలే రగతం ఎరుపేనన్నా
చిన్న పెద్ద తేడా ఎట్లొచ్చేరా
నన్ను తొక్కే హక్కు ఎవడిచ్చేరా
ముట్టుకుంటే మైల యెట్లయ్యేరా
కొట్టి కొట్టి గుండె డప్పయ్యేరా
దండోరా ధన్ ధన్ ధన్ ధన్ దండోరా..”
అంటూ పాటలోని పల్లవితో మొదలయ్యే ఈ తిరుగుబాటు & వేదనతో కూడిన సాహిత్యం, మానవత్వం కలిగిన ప్రతి మనిషి మనసును అయినా సరే ఉన్నపలంగా ధ్రవింపజేస్తుంది. వీడియో పాట మొత్తం ఆర్థత నిండిన గొంతుతో పాడుతుంటే కన్నీళ్లు రాక మానవు. కొన్ని యేండ్లనాటి గాదలని, మనసులో ఎప్పటినుంచో పేరుకుపోయి, చెప్పడానికి వీలులేని గాయాలను ఇందులో పాట రచయిత కాసర్ల శ్యామ్ చెప్పుకొచ్చాడు.
క్రిస్మస్ రోజున రిలీజ్!
దండోరా అనే సినిమాను మురళి కాంత్ దేవోస్త్ డైరెక్ట్ చేస్తున్నారు. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ముప్పనేని రవీంద్ర బెనర్జీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ రోజున.. థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి మంచి సంగీతం అందించాడు. శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి, రాహుల్ రామకృష్ణ, మోనిక, మురళీధర్ గౌడ్ లాంటివారు అనేకమంది ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాట, ట్రైలర్ అద్భుతంగా ఉన్నాయి.
జీవిత అనుభవాలు కొన్ని
సమాజం, సమాజంలో మనుషుల మధ్య ఉన్న అసమానతలు, కుల వివక్ష, కులం ఆధారిత అణచివేతలు, హత్యలు & డైరెక్టర్ జీవిత అనుభవం నుంచి కొన్ని అంశాలను జోడించి కమర్షియల్ చెప్పదలచుకున్నటుగా తెలుస్తోంది. పాట, అందులోని భావాలు బాగున్నాయి. కానీ సినిమాను యధావిధిగా పాత తెలుగు సినిమాల మాదిరిగా వక్రీకరించి చూపిస్తారా? లేకుంటే వాస్తవాలను వాస్తవంగా చెబుతారా? అనేది సినిమా చూస్తే గానీ తెలియదు. ఏదేమైనా పాట మాత్రం గుండె పొరలను తాకుతుంది అని కచ్చితంగా చెప్పొచ్చు.
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.