అమిత్ షా ప్రారంభించిన భారత్ ట్యాక్సీ.. దీని గురించి తెలుసా?

కేంద్రమంత్రి అమిత్ షా.. భారతదేశంలో భారత్ ట్యాక్సీని అధికారికంగా ప్రారంభించారు. ఇది యాప్. ఇప్పటికే ఈ తరహా యాప్స్ చాలానే అందుబాటులో ఉన్నప్పటికీ.. భారత్ ట్యాక్సీ అనేది వీటికి కొంత భిన్నంగా.. మహిళలకు భద్రతను కూడా ఇస్తుంది.

రెండు నగరాల్లో..

భారత్ ట్యాక్సీ సేవలు ప్రస్తుతం ఢిల్లీ (ఎన్‌సీఆర్), గుజరాత్ ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే మరో మూడేళ్లలో ఇది దేశం మొత్తం మీద అందుబాటులోకి వస్తుందని.. దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

అందుబాటులోకి వచ్చిన భారత్ ట్యాక్సీ ప్లాట్‌ఫామ్ ద్వారా.. వినియోదాగారులు కార్లు, ఆటోలు, బైకులు, స్కూటర్లను బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ఏకంగా ఎనిమిది సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. దీని ద్వారా డ్రైవర్లు తమ ఆదాయం పెంచుకోవడం మాత్రమే కాకుండా.. సేవలకు తగిన గుర్తింపు (యాజమాన్యం) కూడా ఉంటుంది.

భారత్ ట్యాక్సీ సేవలను ప్రారంభించే కార్యక్రమంలో.. అమిత్ షా డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ఇప్పుడున్న ఇతర రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌ల కంటే ఎలా భిన్నంగా ఉందో వివరించారు. మీరు ”కేవలం డ్రైవర్ మాత్రమే కాదు, భారత్ ట్యాక్సీ ప్లాట్‌ఫామ్ ఓనర్ అవుతారు” అని అన్నారు. సాధారణ అగ్రిగేటర్స్ మాదిరిగా కాకుండా.. ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని డ్రైవర్లతో పంచుకుంటామని ఆయన పేర్కొన్నారు.

సారథి దీదీ ఫీచర్

మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని సారథి దీదీ ఫీచర్ ద్వారా.. భారత్ ట్యాక్సీలో వారికి భద్రత కల్పించనున్నారు. అంటే.. మహిళా ప్రయాణికులు కేవలం మహిళా డ్రైవర్లను ఎంచుకునే వెసులుబాటు కల్పిస్తారన్న మాట.

కమిషన్ లేదు

భారత్ ట్యాక్సీ జీరో కమిషన్. ఇది సర్జ్ ఫ్రీ ధరల నమూనాను అనుసరిస్తుంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వచ్చిన ఆదాయంలో 80 శాతం నేరుగా డ్రైవర్లకు అందుతుంది. అంటే 100 రూపాయలు వస్తే.. 20 రూపాయలు ప్రభుత్వానికి, మిగిలిన 80 రూపాయలు డ్రైవర్లకు అన్నమాట. ఈ విషయాన్ని అమిత్ షా స్పష్టం చేశారు. దీన్నిబట్టి చూస్తే.. ఇతర ప్లాట్‌ఫామ్లతో పోలిస్తే.. భారత్ ట్యాక్సీ ద్వారా డ్రైవర్లు కొంత ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది.

మూడేళ్లలో దేశం మొత్తం..

ఇప్పుడు భారత్ ట్యాక్సీ సేవలు.. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. మరో మూడేళ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. ద్వారక నుంచి కామాఖ్య వరకు విస్తరించనుంది. అమిత్ షా భారత్ ట్యాక్సీ గురించి వివరిస్తూనే.. యాజమాన్యం, సేఫ్టీ కవరేజ్, గౌరవం, ఆదాయం న్యాయంగా పంపిణీ చేయడం వంటి వాటిని గురించి కూడా వెల్లడించారు.

ముందస్తు రెస్పాన్స్

అధికారిక ప్రకటన వెలువడగానే.. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఇప్పటికే 2.5 లక్షల కంటే ఎక్కువ మంది డ్రైవర్లు భారత్ ట్యాక్సీలో చేరారు. 8.5 లక్షల కంటే ఎక్కువ ప్రయాణికులు ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్నారు. ఇందులో డ్రైవర్లు ఇప్కో టోకియో అనే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వంటివి పొందుతారు. భారత్ ట్యాక్సీ అనేది కంపెనీ కాదు.. ట్యాక్సీ నడిపే వ్యక్తే సారథి అని అమిత్ షా పేర్కొన్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోకి కూడా రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఎప్పుడొస్తుందనే విషయం తెలియాల్సి ఉంది.