History Of Car Doors: ఎంత పెద్ద కారైనా, ఎంత చిన్న కారైనా.. ఖరీదైన కారైనా, ఆఖరికి చీప్ కారైనా డోర్స్ అనేవి చాలా ప్రధానం. కారు లోపలికి వెళ్లాలన్నా.. బయటకు రావాలన్న డోర్స్ ఓపెన్ చేసి రావాల్సి ఉంటుంది. ఆధునిక కాలంలో కార్ డోర్స్ (Car Doors) ఎలా ఉన్నాయో అందరికి తెలుసు, అయితే ఈ డోర్స్ పరిణామం ఎలా జరిగింది.. 19వ శతాబ్దం చివరిలో ఆటోమొబైల్ ప్రారంభమైనప్పటి నుంచి కారు డోర్లు ఎలా రూపాంతరం చెందాయని ఆసక్తికరమైన వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
సింపుల్ డోర్స్ (Simple Doors)
నిజానికి 19వ శతాబ్దం చివరలో మరియు 20వ శతాబ్దం ప్రారంభంలో కార్లు అభివృద్ధి చేయబడినప్పుడు అవి చాలా సింపుల్ డోర్స్ కలిగి ఉండేవి. వీటిని ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం వంటి ప్రక్రియ కూడా చాలా సులభంగా ఉండేది. అప్పట్లో డోర్స్ యొక్క ప్రధాన ఉపయోగం కారు లోపలికి దుమ్ము, ధూళి వంటివి లోపలికి రాకుండా చూడటమే.
సూసైడ్ డోర్స్ (Suicide Doors)
20వ శతాబ్దంలో సూసైడ్ డోర్స్ పేరిట కొన్ని డోర్స్ అందుబాటులో ఉండేవి. అప్పట్లో ఇలాంటి డోర్స్ ముఖ్యంగా ‘ఫోర్డ్ మోడల్ టీ’లో కనిపించేవి. కారులోకి వెళ్ళడానికి మరియు బయటకు రావడానికి సులభంగా ఉండటానికి ఇలాంటి డోర్స్ రేపాటు చేయడం జరిగింది. ఆ తరువాత కాలంలో ఇలాంటి డోర్లు లగ్జరీ కార్లలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రోల్స్ రాయిస్ కారులో ఇలాంటి డోర్స్ చూడవచ్చు.
స్లైడింగ్ డోర్స్ (Sliding Doors)
స్లైడింగ్ డోర్స్ అనగానే గుర్తోచింది మారుతి సుజుకి ఈకో. మినీ వ్యాన్ లాంటి కార్లలో ఇలాంటి డోర్లు కనిపించేవి. వీటిని ‘బార్న్ డోర్స్’ అని కూడా పిలిచేవారు. ఇలాంటి డోర్స్ వల్ల ప్రయాణికుడు లోపలికి సులభంగా రావచ్చు మరియు సులభంగా బయటకు వెళ్ళవచ్చు. ప్రస్తుతం కియా కార్నివాల్ MPVలో కూడా ఇలాంటి డోర్స్ చూడవచ్చు.
గుల్వింగ్ డోర్స్ (Gullwing Doors)
1950 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా అన్యదేశ్య కార్లలో ఇలాంటి డోర్స్ కనిపిస్తున్నాయి. ప్రారంభంలో మెర్సిడెస్ బెంజ్ 300ఎస్ఎల్ మరియు డెలోరియన్ DMC-12 వంటి కార్లలో ఈ డోర్స్ మొదలయ్యాయి. ఇవి సాధారణ కార్ల మాదిరిగా కాకుండా రెక్కల మాదిరిగా పైకి ఉంటాయి. ఇవి సాధారణంగా ఖరీదైన కార్లలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. నిజానికి సాధారణ కార్లలో ఇలాంటి డోర్స్ రూపొందించడం కొంత కష్టంతో కూడుకున్న పని.
సిజర్ డోర్స్ (Scissor Doors)
1960 నుంచి కత్తెర లాంటి డోర్స్ కలిగిన కార్లు వాడుకలో ఉండేవి. ఇలాంటి కార్లు ఎక్కువగా ఇటాలియన్ సూపర్ కార్లలో మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ఇవి బయటకు పైకి తెరుచుకుంటాయి. కాబట్టి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. లంబోర్ఘిని కార్లలో ఇలాంటి డోర్స్ ఉండేవి. ఇప్పటికి కూడా చాలా సూపర్ కార్లలో ఇలాంటి డోర్స్ ఉన్నాయి.
బటర్‌ఫ్లై డోర్స్ (Butterfly Doors)
మనం ఇప్పటి వరకు చెప్పుకున్న కార్లలో ‘బటర్‌ఫ్లై డోర్స్’ చాలా ప్రత్యేకమైనవి. ఇవి సీజర్ డోర్స్ మరియు గుల్వింగ్ డోర్స్ కలిగినట్లు అనిపిస్తాయి. ఈ డోర్స్ పైకి మరియు వెలుపలికి పైవట్ అవుతాయి. ఇలాంటి డోర్స్ హైపర్‌కార్ మెక్‌లారెన్ సూపర్ కార్లలో కనిపిస్తాయి. ఈ కార్లు మిగిలిన కార్లకంటే కూడా భిన్నంగా ఉంటాయి.
ఫ్రేమ్‌లెస్ డోర్స్ (Frameless Doors)
ఆధునిక కాలంలో కొన్ని హై ఎండ్ కార్లలో ఇలాంటి ఫ్రేమ్‌లెస్ డోర్స్ కనిపిస్తాయి. ఇవి సాధారణ డోర్స్ మాదిరిగానే ఉంటాయి. కాకుంటే వీటికి పైన విండో ప్రేమ్ ఉండదు. మెర్సిడెస్ బెంజ్ మరియు ఆడి కార్లలో ఇలాంటి డోర్స్ ఉంటాయి. వీటి ధరలు సాధారణ కార్లకంటే ఎక్కువ కావడం గమనార్హం.
ఎలక్ట్రిక్ మరియు సెన్సార్ ఆపరేటెడ్ డోర్స్
టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న రోజుల్లో కార్లు మాత్రమే కాదు, కారు డోర్స్ కూడా కొత్త రూపాలను పొందుతున్నాయి. సాధారణ కార్లతో మొదలైన డోర్స్ పరిణామం ప్రస్తుతం సెన్సార్ ఆపరేటెడ్ డోర్స్ దాకా వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తీ డోర్లు ఎన్ని కొత్త డిజైన్స్ పొందాయనేది ఇట్టే అర్థమైపోతుంది.
Don’t Miss: Prabhas Car Collection: పాన్ ఇండియా స్టార్ ఇక్కడ.. కార్ల జాబితా పెద్దదే!
ఎలక్ట్రిక్ మరియు సెన్సార్ ఆపరేటెడ్ డోర్స్ అనేవి ఒక బటన్ నొక్కగానే వాటంతట అవే ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. టెస్లా వంటి కార్లలో ఇలాంటి డోర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతానికి భారతదేశంలో ఇలాంటి కార్లు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో లేదు.