లగ్జరీ కారు కొన్న ఫేమస్ సింగర్.. డీలర్‌షిప్‌లోనే పాట పాడేశారు

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేసి.. వినియోగిస్తారనే విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ప్రముఖ మలయాళీ సింగర్ ఎంజీ శ్రీకుమార్.. మెర్సిడెస్ బెంజ్ కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

కారు వివరాలు

సింగర్ ఎంజీ శ్రీకుమార్.. కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ సెడాన్. ఈయన తెలుపురంగు కారును కొనుగోలు చేసిన తరువాత.. డీలర్షిప్ సిబ్బందిలోని ఒక మహిళతో కలిసి స్వయంగా ఒక పాటపాడి అలరించారు. కారును కొనుగోలు చేయడానికి ఆయన, తన భార్యతో కలిసి వచ్చారు. కారును డెలివరీ తీసుకున్న తరువాత శ్రీకుమార్.. ఆయన భార్య అనంత పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసినట్లు సమాచారం. ఈ ఫోటోలను వారు ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఇందులో కారుకు పూజ చేసి పువ్వులు వేసి ఉండటం కూడా కనిపిస్తుంది.

మెర్సిడెస్ బెన్ ఈ-క్లాస్ గురించి

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెర్సిడెస్ బెంజ్.. 2024లో ఈ-క్లాస్ కారును లాంచ్ చేసింది. ఈ సెడాన్ అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందింది. దీని ప్రారంభ ధర రూ. 78.5 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఈ200, ఈ220డీ, ఈ450 అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ కారు.. ఈక్యూ మాదిరిగా ఉండే స్టైలింగ్ పొందుతుంది. కాబట్టి ఇది కొత్త ఫ్రంట్ ఫాసియా, బ్రాండ్ లోగో, ప్లస్ టైప్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ వీల్స్, ఎల్ఈడీ లైటింగ్, కొత్త బంపర్లు పొందుతుంది. ఇవన్నీ కారును అద్భుతమైన లుక్ అందిస్తాయి.

బెంజ్ ఈ-క్లాస్ కారు ఇంటీరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సీట్లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. ఇందులో మూడు స్క్రీన్స్ ఉంటాయి. అవి 14.4 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్, 12.3 ఇంచెస్ ప్యాసింజర్ స్క్రీన్, 12.3 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్. ఇవి కాకుండా 4డీ సరౌండ్ సౌండ్ సిస్టం, లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఈ కారులో ఉన్నాయి.

మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ200 వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ220డీ వేరియంట్ 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఈ450 మోడల్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఈ మూడు వేరియంట్లు అత్యుత్తమ పనితీరును అందిస్తాయి.

ఎంజీ శ్రీకుమార్ గురించి

కేవలం మలయాళంలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో పాటలు పాడిన ఎంజీ శ్రీకుమార్.. పాడిన పాటలు చాలానే ఉన్నాయి. 1960 జూన్ 2న కేరళలోని కోజికోడ్ నగరంలో జన్మించిన ఈయన 1980లో పాటలు పాడటం మొదలు పెట్టారని సమాచారం. అప్పటి నుంచి పలు భాషల్లో వందలాది పాటలు పాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈయన ఒక ఆటోమొబైల్ ఔత్సాహికుడు కూడా. ఈ కారణంగానే అప్పుడప్పుడు తనకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారు.