ఒక గుడి ఉందంటే.. చిన్న, పెద్ద, స్త్రీ & పురుష బేధం లేకుండా ఎవరైనా వెళ్లొచ్చు. కానీ కొన్ని ఆలయాలకు స్త్రీల ప్రవేశం నిషిద్ధం అని చాలా సందర్భాల్లో వినే ఉంటారు. కానీ పురుషులకు కూడా ప్రవేశం లేని దేవాలయాలు ఉన్నాయని బహుశా చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఈ కథనంలో మగవాళ్ల ప్రవేశం నిషేధించిన ప్రముఖ ఆలయాల గురించి తెలుసుకుందాం.
అట్టుకల్ భగవతి ఆలయం
కేరళలోని తిరువనంతపురంలో అట్టుకల్ భగవతి ఆలయం. దీనిని ఎక్కువమంది మహిళల శబరిమల అని పిలుస్తారు. ముఖ్యంగా పొంగల్ సమయంలో లక్షలాదిమంది మహిళలు.. ఇక్కడి దేవతలకు నైవేద్యం వండటానికి గుమికూడుతారు. ఈ సమయంలో వీధులన్నీ వంటశాలలుగా మారుతాయి. పూజ సమయంలో దేవతలు ఉగ్రరూపం దాలుస్తారని చెబుతారు. ఇది ప్రపంచంలోనే ఎక్కువమంది మహిళా భక్తులు గుమికూడే ప్రదేశం అని చెబుతారు. ప్రత్యేక సమయంలో మాత్రమే పురుషులు అక్కడ ఉండరని చెబుతారు.
చక్కలతుకవు దేవాలయం
ఈ దేవాలయం కూడా కేరళలోనే ఉంది. ప్రతి ఏటా ఇక్కడ నారీ పూజ జరుగుతుంది. ఆ సమయంలో మహిళలను దేవతలుగా భావించి పూజిస్తారు. పూజారులు మహిళల పాదాలను కడుగుతారు. ఇలాంటి సమయంలో పురుషుల ప్రవేశం నిషేధం. ఇక్కడ మహిళను పూజించడం అంటే.. వారిలోని దైవత్వాన్ని పూజించడం అన్నమాట. ఇదొక సంప్రదాయం మాత్రమే. ఇది లింగ వివక్ష వ్యతిరేఖం మాత్రం కాదు.
బ్రహ్మ దేవాలయం
రాజస్థాన్ రాష్ట్రంలోని ఈ దేవాలయానికి పురుష ప్రవేశం ఉంది. కానీ కొన్ని ప్రదేశాల్లో మాత్రం వివాహిత పురుషులు నివేద్యం సమర్పించకుండా నియంత్రిస్తారు. ఇది బ్రహ్మ దేవునికి కేటాయించిన అతి కొన్ని ఆలయాల్లో ఒకటి కావడం విశేషం. కొన్ని పురాణాల ప్రకారం.. ఇక్కడ బ్రహ్మ చేసిన యజ్ఞం సమయంలో సరస్వతి దేవికి కోపం వచ్చింది. ఈ కారణంగానే వివాహిత పురుషులు నైవేద్యం సమర్పించడంపై ఆంక్షలు విధించినట్లు చెబుతారు.
కామాఖ్య ఆలయం
అస్సాంలోని కామాఖ్య ఆలయం.. భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడ దేవతను సాధారణ మానవరూపంలో పూజించారు. స్త్రీ గర్భాన్ని సూచించే సహజరాతి నిర్మాణానికి పూజలు చేస్తారు. ప్రతి ఏటా అంబుబాచి మేళా సమయంలో ఒక్కడ ఆలయం మూడు రోజులపాటు మూసివేస్తారు. ఆ సమయంలో దేవత ఋతుచక్రాన్ని సూచిస్తుందని చెబుతారు. ఇక్కడికి కూడా పురుషుల ప్రవేశం పూర్తిగా నిషేధం కాదు. కొన్ని సందర్భాల్లో మాత్రమే.
సంతోషి మాత దేవాలయం
బృందావనంలోని సంతోషిమాత దేవాలయంలో జరిగే కొన్ని పూజలకు మహిళలే నాయకత్వం వహిస్తారు. కొన్ని నిర్దిష్ట రోజుల్లో మాత్రం ఇక్కడికి పురుషులు ప్రవేశించకూడదు. కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు శుక్రవారం ఉపవాసాలు ఉండి, సంతోషి మాటకు పూజలు చేస్తుంటారు.
భగవతి దేవాలయాలు
తమిళనాడులోని కొన్ని భగవతి దేవాలయాలు కొన్ని ఆచార, సాంప్రదాయాలను పాటిస్తారు. ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో.. పురుషులు గర్భ గుడిలోకి ప్రవేశించరు. అక్కడ దేవతను కన్యగా పూజిస్తారు. స్వచ్ఛతకు, స్వయం సమృద్ధికి దేవతను సూచికగా ఆరాధిస్తారు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మాత్రమే పురుషులకు ప్రవేశం నిషేధం.
నిజానికి భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలకు స్త్రీ, పురుషులు ఇద్దరూ వెళ్ళవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పురుషులకు ప్రవేశం ఉండదు. ఇందులో ఎలాంటి వివక్ష లేదు అనే విషయం అందరూ గమనించాలి. మన దేశంలో స్త్రీల ప్రవేశంపై కొన్ని సందర్భాల్లో / సమయాల్లో నిషేధం విధించే దేవాలయాలు కూడా ఉన్నాయి.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.