చాలామందికి తెలియని FASTag రూల్స్.. ఇవి చాలా యూస్‌ఫుల్ గురూ!

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ చెల్లింపులను సులభతరం చేయడానికి FASTag వ్యవస్థను ప్రవేశపెట్టారు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ ట్యాగ్ వాహనాల ముందు గాజుపై అమర్చబడుతుంది. వాహనం టోల్ ప్లాజా గుండా వెళ్లే సమయంలో స్కానర్ ద్వారా టోల్ ఫీజు ఆటోమేటిక్‌గా బ్యాంక్ ఖాతా లేదా ప్రీపెయిడ్ వాలెట్ నుంచి కట్ అవుతుంది.

ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ తగ్గడంతో పాటు నగదు లావాదేవీలు కూడా తగ్గాయి. ప్రయాణికులకు ప్రతి టోల్ లావాదేవీ తర్వాత SMS ద్వారా సమాచారం అందుతుంది. అయితే చాలా మందికి తెలియని కొన్ని ముఖ్యమైన నిబంధనలు FASTag వ్యవస్థలో ఉన్నాయి. ముఖ్యంగా వార్షిక పాస్ ధరలు, టోల్ చెల్లింపుల విధానం, నిర్మాణ పనుల సమయంలో టోల్ తగ్గింపు వంటి అంశాలు ప్రయాణికులకు ఉపయోగపడే సమాచారం.

FASTag వార్షిక పాస్ ధర పెంపు

National Highways Authority of India (NHAI) 2026–27 ఆర్థిక సంవత్సరానికి FASTag వార్షిక పాస్ ధరను పెంచింది. గతంలో ఉన్న ధరపై రూ.75 పెంచి రూ.3,075గా నిర్ణయించారు. ఈ వార్షిక పాస్ తీసుకుంటే వినియోగదారులు తరచుగా FASTag రీచార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి చెల్లించిన ఫీజుతో ఒక సంవత్సరం లేదా 200 టోల్ క్రాసింగ్‌లు వరకు ఉపయోగించుకోవచ్చు.

ఈ పాస్ కేవలం నాన్ కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. చెల్లింపు చేసిన తర్వాత రెండు గంటలలోపే వాహనానికి లింక్ అయిన FASTagలో యాక్టివేట్ అవుతుంది. వినియోగదారులు Rajmarg Yatra App లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా ఈ పాస్ తీసుకోవచ్చు.

FASTag సరిగ్గా లేకపోతే డబుల్ టోల్

కొంతమంది వాహనదారులు FASTag ఉన్నప్పటికీ విండ్షీల్డ్‌పై సరిగ్గా అమర్చకుండా టోల్ ప్లాజా వద్ద సమస్యలు సృష్టిస్తుంటారు. దీనివల్ల ఇతర వాహనదారులకు ఆలస్యం జరుగుతుంది. ఈ పరిస్థితిని నివారించడానికి NHAI కఠిన చర్యలు తీసుకుంది. వాహనం ముందుభాగంలోని గాజుపై FASTag సరిగ్గా అమర్చకుండా టోల్ లేన్‌లోకి వచ్చినట్లయితే రెట్టు టోల్ ఫీజు వసూలు చేస్తారు. ఇది టోల్ ప్లాజాల వద్ద క్యూలను తగ్గించేందుకు తీసుకున్న చర్యగా అధికారులు చెబుతున్నారు.

హైవే నిర్మాణ పనుల సమయంలో టోల్ తగ్గింపు

జాతీయ రహదారుల విస్తరణ లేదా మరమ్మత్తు పనులు జరుగుతున్న సమయంలో ప్రయాణికులకు తాత్కాలిక ఇబ్బందులు ఏర్పడుతాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని Ministry of Road Transport and Highways ప్రత్యేక నిబంధనను అమలు చేస్తోంది. రెండు లేన్ల రహదారిని నాలుగు లేదా ఆరు లేన్లుగా విస్తరించే పనులు జరుగుతున్న సమయంలో వినియోగదారులు ముందుగా ఉన్న టోల్ రేటులో 50 శాతం మాత్రమే చెల్లించాలి. ఉదాహరణకు ఒక టోల్ రూ.50 ఉంటే నిర్మాణ కాలంలో ప్రయాణికులు రూ.25 మాత్రమే చెల్లించాలి.

FASTag లేకుండా చెల్లింపులపై అదనపు ఫీజు

వాహనంలో FASTag లేకుండా టోల్ ప్లాజాకు వచ్చినట్లయితే సాధారణంగా రెట్టు టోల్ ఫీజు వసూలు చేస్తారు. అయితే ప్రయాణికులు UPI ద్వారా చెల్లిస్తే కొంత సడలింపు ఉంటుంది. అటువంటి సందర్భంలో నగదు చెల్లింపులకు బదులుగా UPI ద్వారా చెల్లిస్తే 1.25 రెట్లు మాత్రమే టోల్ వసూలు చేస్తారు. ఇది డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యగా అధికారులు తెలిపారు.

సమస్యలు ఉంటే ఫిర్యాదు చేసే మార్గాలు

FASTag వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంది. వినియోగదారులు 1033 హెల్ప్‌లైన్ నంబర్కు కాల్ చేసి సమస్యలను తెలియజేయవచ్చు. అలాగే Rajmarg Yatra App ద్వారా హైవేల సమాచారం, టోల్ ప్లాజాల వివరాలు, సమీపంలోని పెట్రోల్ బంకులు, ఆస్పత్రులు, EV చార్జింగ్ స్టేషన్లు, వాతావరణ సమాచారం వంటి అనేక సేవలు అందుబాటులో ఉంటాయి.

Also Read: ఉందిగా BaaS.. కోనేయండి రూ. 50వేలతో టీవీఎస్ స్కూటర్!