భారతదేశంలో చాలామందికి ఇష్టమైన పండుగలలో ‘గణేష్ చతుర్థి‘ లేదా ‘వినాయక చవితి‘ ఒకటి. ఈ పండుగను కుల, మత బేధం లేకుండా.. ఎంతో సరదాగా ప్రజలంతా కలిసి జరుపుకుంటారు. యువత మొత్తం వినాయక ప్రతిమలను వీధుల్లో నిలిపి అంగరంగ వైభాగంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటే.. కుటుంబంలో ఉన్నవారు చిన్న విగ్రహాలకు పూజలు చేసుకుని.. భక్తితో ప్రార్థనలు చేసి, నైవేద్యాలు సమర్పించి నిమజ్జనం చేస్తారు. ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు?, పూజ ఎలా చేయాలి?, నిమజ్జనం ఎప్పుడు?, అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
2025 గణేష్ చతుర్థి (వినాయక చవితి) ఎప్పుడు?
వినాయక చవితి 2025 ఆగస్టు 17 బుధవారం (భాద్రపద మాసం శుక్లపక్ష చతుర్థి) నాడు జరుపుకుంటారు. ఈ పండుగను 10 నుంచి 11 రోజులు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కరోజు, మూడు రోజులు కూడా జరుపుకుంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ రోజుల సంఖ్య అనేది మారుతుంది.
ఆగస్టు 26 మధ్యాహ్నం 1.54 గంటలకు చతుర్థి తిథి ప్రారంభమై.. ఆగస్టు 27 మధ్యాహ్నం 3.44 గంటలకు ముగుస్తుంది. అయితే వినాయకుడికి పూజ చేయడానికి మంచి ముహూర్తం ”ఆగస్టు 27 ఉదయం 11.12 నుంచి మధ్యాహ్నం 1.44 నిమిషాల” వరకు. అయితే చాలామంది సెప్టెంబర్ 6 శనివారం నిమజ్జనం చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో అంతంకంటే ముందుకు కూడా నిమజ్జనం చేసే అవకాశం ఉంది.
వినాయకుడి జనన కథ
హిందూ పురాణాల ప్రకారం.. పార్వతీదేవి స్నానం చేసే ముందు, తనకు కాపలాగా ఉంచడానికి పసుపుతో వినాయకుణ్ణి తయారుచేసి ప్రాణం పోసింది. కాపలా ఉన్న వినాయకుడు శివుని ప్రవేశానికి కూడా నిరాకరిస్తాడు. వీరిమధ్య జరిగిన చిన్నపాటి యుద్ధంలో పరమశివుడు వినాయకుని తల తీసేసాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఏడుస్తూ.. వినాయకుడిని బతికించమని కోరుతుంది. శివుడు తన గణాలకు చెప్పి, మీకు కనిపించిన మొదటి జీవి తలను తీసుకురావాలని ఆదేశిస్తాడు. గణాలు తమకు మొదట కనిపించిన ఏనుగు తలను తీసుకు వస్తారు. ఆ తలను వినాయకుడి మొండెం మీద పెట్టి, ప్రాణం పోసిన బోళాశంకరుడు.. అందరూ పూజించవలసిన మొదటి దేవుడు వినాయకుడు అని ప్రకటించాడు.
గణేష్ చతుర్థి ఆచారాలు & వేడుకలు
పండగ అంటేనే ఇంట్లో వాతావరణం మొత్తం చాలా ఆహ్లాదంగా.. ఉత్సాహంగా ఉంటుంది. పువ్వులతో అలంకారాలు, రంగులతో ముగ్గులు ఇలా చాలానే ఉంటాయి. వినాయక చవితి నాడు.. కుటుంబ సభ్యులంతా స్నానాలు ఆచరించి, ఉపవాసాలతో పూజా కార్యక్రమాలు చేస్తారు. పిండివంటలతో, కజ్జికాయలతో దేవునికి నైవేద్యం సమర్పించి ఆనందిస్తారు. 11 రోజులు.. రోజువారీ కార్యక్రమాలు కూడా ఇలాగే సాగిస్తారు. నిమజ్జనం రోజు మేళతాళాలతో.. దేవుణ్ణి ఊరేగింపు చేసి, మళ్లీ వచ్చే ఏడాది తిరిగి వస్తాడని ఎదురు చూస్తూ నదులు, సముద్రాల్లో నిమజ్జనం చేసి వీడ్కోలు పలుకుతారు.
పూజా విధానం
వినాయక చవితి అంటేనే భక్తి శ్రద్దలతో పూజ. ఆ పూజ ఎలా చేయాలి అని చాలామంది కొంత కంగారుపడుతుంటారు. ముందుగా పూజా స్థలాన్ని రంగులు, పువ్వులతో.. ఇతర అలంకరణ వస్తువులతో అలంకరించుకోవాలి. గణేశుని విగ్రహాన్ని బలిపీఠం మీద నిలిపి.. దాని కింద పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని ఉంచాలి. విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనే, చక్కర కలిపిన పంచామృత స్నానం చేయించాలి. విగ్రహాన్ని కొత్త బట్టలు, ఇతర అలంకరణ వస్తువులతో అలంకరించి.. కుడుములు లేదా కజ్జికాయలు, లడ్డూల వంటి స్వీట్లు సమర్పించాలి. చివరిగా దేవుని ముందు కొబ్బరికాయ కొట్టి, హారతి ఇచ్చి పూజను ముగించాలి.