Gautham Menon court verdict: గౌతమ్ మీనన్‌కు షాక్.. వడ్డీతో సహా రూ.4.25 కోట్లు కట్టాలంటూ తీర్పు!

Gautham Menon court verdict: దాదాపు రెండు దశాబ్దాలుగా సాగుతున్న సినిమా ఒప్పంద వివాదానికి చివరకు మద్రాస్ హైకోర్టు ఫుల్‌స్టాప్ పెట్టింది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు ఇది పెద్ద న్యాయ పరమైన దెబ్బగా మారింది. కోర్టు తీర్పు ప్రకారం.. ఆయన రూ.4.25 కోట్లు 12 శాతం వార్షిక వడ్డీతో కలిసి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

మార్చి 23, 2026న వెలువడిన ఈ తీర్పుతో.. గతంలో ఇచ్చిన ఆదేశాలను కోర్టు సమర్థించింది. దీంతో ఈ కేసు పూర్తిగా ముగిసినట్టే అయింది. దర్శకుడు దాఖలు చేసిన అప్పీల్‌ను డివిజన్ బెంచ్ తిరస్కరించడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా నిలిచింది.

ఎలా మొదలైంది ఈ వివాదం?

ఈ వివాదం 2008లో ప్రారంభమైంది. అప్పట్లో ఆర్.ఎస్. ఇన్ఫోటైన్‌మెంట్ సంస్థ, గౌతమ్ మీనన్ నిర్మాణ సంస్థతో కలిసి ఒక తమిళ సినిమా తీసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు వారు ‘ప్రొడక్షన్ నెం.6’ అనే పేరును సూచించారు. సినిమా పనులు 2008 డిసెంబర్‌లో ప్రారంభమై, 2009 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. మొత్తం రూ.13.5 కోట్ల బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. అయితే ప్రారంభ దశలోనే నిర్మాతలు రూ.4.25 కోట్లు విడతలుగా విడుదల చేశారు.

కానీ.. ఆశించిన విధంగా సినిమా ముందుకు వెళ్లలేదు. షూటింగ్ ప్రారంభం కాలేదు, నటీనటుల ఎంపిక కూడా జరగలేదు. ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయింది. ఒప్పందం ప్రకారం.. గడువు దాటితే మొత్తం డబ్బును వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉండగా, నిర్మాతలు మొదట సహనం పాటించారు.

కోర్టులో తేలిన నిజాలు

2010లో నిర్మాతలు మరోసారి గడువు ఇచ్చినా.. పరిస్థితి మారలేదు. దీంతో 2013లో వారు కోర్టును ఆశ్రయించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వాలని, నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరారు. విచారణలో గౌతమ్ మీనన్ వర్గం, పూర్తి మొత్తాన్ని నిర్మాతలు చెల్లించలేదని వాదించింది. అలాగే మొదట సింబు నటించాల్సిన సినిమా తర్వాత జీవాతో తీసిన “నీతానే ఎన్ పొన్ వసంతం” సినిమానే ఆ ప్రాజెక్ట్ అని చెప్పింది.

అయితే.. కోర్టు ఈ వాదనను ఖండించింది. ఆ సినిమా పూర్తిగా వేరే ఒప్పందంతో తెరకెక్కిందని స్పష్టం చేసింది. 2008 ఒప్పందానికి సంబంధించి తీసుకున్న రూ.4.25 కోట్ల వినియోగంపై సరైన ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది.

ఈ అంశాలన్నింటిని పరిశీలించిన తర్వాత, గౌతమ్ మీనన్ ఒప్పందాన్ని పాటించలేదని కోర్టు తేల్చింది. అందుకే డబ్బును వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అదనంగా సుమారు రూ.12 లక్షల న్యాయ ఖర్చులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ తీర్పుతో గౌతమ్ మీనన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలినప్పటికీ, సినీ రంగంలో ఆయన కార్యకలాపాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఆయన ప్రాజెక్ట్ “డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్” ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.

Also read:Dhurandhar 2: ధురంధర్-2 సినిమాపై రజినీ ట్వీట్.. డైరెక్టర్ భావోద్వేగం!