గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్!

హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో.. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ గోదావరి పుష్కరాలు 2027 (Godavari Pushkaralu 2027) ఏర్పాట్లపై తొలి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు & సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు, మౌలిక సదుపాయాలపై ప్రాథమిక చర్చ జరిగింది.

గోదావరి పుష్కరాలు 2027

తెలంగాణ ప్రభుత్వం రాబోయే గోదావరి పుష్కరాలు 2027ను భక్తులకు సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ తరుణంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ.. పుష్కరాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలు, భద్రతా చర్యలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి & వివిధ శాఖల అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు.. కేవలం రాష్ట్రానికి ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా పర్యాటకపరంగా కూడా ఎంతో ముఖ్యమైనవి. లక్షలాది భక్తులు తెలంగాణలోని గోదావరి నదీ తీర ప్రాంతాలకు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ప్రత్యేక కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం.. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణ కోసం తొమ్మిది మంది సభ్యులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షత వహిస్తున్నారు. పుష్కరాల నిర్వహణకు అవసరమైన ప్రణాళికలను రూపొందించడం, అమలు విధానాలను ఖరారు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.

ఈ కమిటీ పుష్కరాల నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని కల్పించడమే కాకుండా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకునేలా నిర్ణయాలు తీసుకోనుంది. ప్రత్యేకంగా రవాణా, తాగునీరు, పారిశుధ్యం, భద్రత & వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

అదే విధంగా గోదావరి నది తీర ప్రాంతాలకు సమీపంలోని నియోజకవర్గాలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు & ఎమ్మెల్సీలను కూడా సమావేశాలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి సూచనలు పుష్కరాల నిర్వహణలో కీలకంగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలు జరిగే సమయంలో.. లక్షలాది మంది భక్తులు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఘాట్ల వద్ద పవిత్ర స్నానం చేస్తారు. అందువల్ల ఘాట్ల అభివృద్ధి, తాత్కాలిక వసతి కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ప్రభుత్వం ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తోంది.

ప్రత్యేకంగా గోదావరి నది తీర ప్రాంతాలలోని దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, పుష్కర ఘాట్ల వద్ద మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సమావేశంలో చర్చించారు. భక్తుల భద్రత కోసం పోలీసు, విపత్తు నిర్వహణ, ఆరోగ్య శాఖల మధ్య సమన్వయంతో చర్యలు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. అంతే కాకుండా.. భక్తులకు ఆన్‌లైన్ సమాచారం, మార్గదర్శకాలు అందించేందుకు డిజిటల్ సేవలను కూడా అభివృద్ధి చేసే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

గోదావరి పుష్కరాల ప్రాముఖ్యత

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలు మహా ఆధ్యాత్మిక ఉత్సవం. నదులను ఆరాధించే ఈ పండుగ భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. గ్రహాల చలనం ఆధారంగా ఈ పండుగను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో గురుగ్రహం సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరాలు ప్రారంభమవుతాయి. సిద్ధాంతపరంగా ఈ ఉత్సవం గురుడు ఆ రాశిలో ఉన్నంత కాలం, అంటే సుమారు 12 నెలలు కొనసాగుతుందని చెబుతారు. అయితే మొదటి 12 రోజులు అత్యంత పవిత్రంగా భావిస్తారు.

మొదటి 12 రోజులను ఆది పుష్కరాలుగా పిలుస్తారు. చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పేర్కొంటారు. ఈ సమయంలో పవిత్ర నదిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. గోదావరి పుష్కరాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా గోదావరి ప్రవహించే రాష్ట్రాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడతాయి. లక్షలాది భక్తులు ఈ ఉత్సవానికి హాజరై నదిలో స్నానం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Also Read: కాలేజీ విద్యార్థినులకు EV స్కూటీలు – సీఎం కీలక నిర్ణయం!