అమ్మకాల్లో సరికొత్త రికార్డ్.. ఒక్కనెలలో 4 లక్షల వెహికల్స్: కారణం ఇదే!

భారతదేశంలో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఎస్ఐఏఎం (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్) వెల్లడించింది. ప్యాసింజర్ వెహికల్స్ అమ్మకాలు 2025 అక్టోబర్ నెలలో 4,60,739 యూనిట్లు అని నివేదికలో వెల్లడించింది. అక్టోబర్ 2024లో ఈ సేల్స్ 393238 యూనిట్లు మాత్రమే. దీన్నిబట్టి చూస్తే గత నెల అమ్మకాలు 17.2 శాతం పెరిగాయని స్పష్టమవుతోంది.

వాహన అమ్మకాలు ఇలా..

టూ వీలర్ అమ్మకాలు 2025 అక్టోబర్‌లో 2.1 శాతం పెరిగి 22,10,727 యూనిట్లుగా నమోదయ్యాయి. 2024 అక్టోబర్‌లో ఈ సేల్స్ 21,64,276 యూనిట్లు కావడం గమనార్హం. ఈ విభాగంలో స్కూటర్ అమ్మకాలు 14.3 శాతం పెరిగి 824003 యూనిట్లు కాగా.. మోటార్‌సైకిల్ సేల్స్ 4 శాతం తగ్గి.. 13,35,468 యూనిట్లకు చేరుకున్నాయి.

త్రీ వీలర్ అమ్మకాల విషయానికి వస్తే.. గత నెలలో మొత్తం సేల్స్ 81,288 యూనిట్లు. అక్టోబర్ 2024లో ఈ సేల్స్ 5.9 శాతం ఎక్కువని సమాచారం. అయితే అక్టోబర్ 2025లో ప్యాసింజర్ క్యారియర్స్ 7.6 శాతం పెరిగాయి. గూడ్స్ క్యారియర్స్ 2.8 పెరుగుదలను నమోదు చేశాయి. అయితే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ సేల్స్ మాత్రం తగ్గుదలను నమోదు చేశాయి. అంటే దేశీయ విఫణిలో కార్లు, టూవీలర్స్ అమ్మకాలు పెరిగినప్పటికీ.. త్రీ వీలర్స్ అమ్మకాలు తగ్గాయని స్పష్టంగా అర్థమవుతోంది.

వాహనాల ఉత్పత్తి ఇలా..

అక్టోబర్ 2025లో ప్యాసింజర్ వాహనాలు, త్రీ వీలర్స్, టూ వీలర్స్ మరియు క్వాడ్రి సైకిల్స్ మొత్తం ఉత్పత్తి 28,01,412 యూనిట్లు అని ఎస్ఐఏఎం నివేదిందింది. దీన్ని బట్టి చూస్తే దేశంలో వాహనాల ఉత్పత్తి కూడా భారీగా పెరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే రానున్న రోజుల్లో ఈ ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం ఉందని ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అవగతం అవుతోంది.

వాహనాల అమ్మకాలు పెరగడానికి కారణం

ఇండియన్ మార్కెట్లో వాహనాల అమ్మకాలు పెరగడానికి.. పండుగ సీజన్, 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ తగ్గింపు లేదా కొత్త జీఎస్టీ అమలు ప్రధాన కారణం అని ఎస్ఐఏఎం డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ పేర్కొన్నారు. అక్టోబర్ నెలలో డీలర్లకు ప్యాసింజర్ వెహికల్, త్రీవీలర్, టూవీలర్ విభాగాలు అత్యధిక వాహనాలను పంపించినట్లు వెల్లడించారు.

జీఎస్టీ రేటు తగ్గడం వల్ల వాహనాల రిజిస్ట్రేషన్ గణనీయంగా పెరిగింది. ఇది హోల్‌సేల్స్‌ను మించి రిటైల్ బలాన్ని భారీగా పెంచేసింది. సాధారణంగా పండుగ సీజన్ సమయంలో.. వాహనాల అమ్మకాలు పెరుగుతాయి. ఈసారి పండుగ సీజన్, జీఎస్టీ తగ్గింపు వంటివి బాగా కలిసి రావడంతో సేల్స్ పెరిగాయి.

టాప్ 10 కార్ సేల్స్ – అక్టోబర్ 2025

గత నెలలో (2025 అక్టోబర్) ఎక్కువ మంది కొనుగోలు చేసిన లేదా అత్యధిక అమ్మకాలు పొందిన కారుగా టాటా నెక్సాన్ (22,083 యూనిట్లు) మొదటి స్థానంలో నిలిచింది. తరువాత జాబితాలో వరుసగా మారుతి డిజైర్ (20,791 యూనిట్లు), మారుతి ఎర్టిగా (20,087 యూనిట్లు), మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ (18,970 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా (18,381 యూనిట్లు), మహీంద్రా స్కార్పియో (17,880 యూనిట్లు), మారుతి ఫ్రాంక్స్ (17,003 యూనిట్లు), మారుతి బాలెనొ (16,873 యూనిట్లు), టాటా పంచ్ (16,810 యూనిట్లు), మారుతి స్విఫ్ట్ (15,542 యూనిట్లు) ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. గత నెలలో వాహనాల అమ్మకాలు పెరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.