జీఎస్‌టీలో కీలక మార్పులు: ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే!

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి.. భారత ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్రం.. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)లో కీలక మార్పులు చేసింది. దీంతో కేవలం రెండు స్లాబులు (5 శాతం, 18 శాతం) మాత్రమే మిగిలాయి. వస్తువుల రేట్లు చాలా వరకు తగ్గుతాయి. ఈ కొత్త రేట్లు లేదా కొత్త జీఎస్‌టీ నిర్మాణం సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో పేర్కొన్నారు.

ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే

ఆహార పదార్థాలు (వెన్న, నెయ్యి, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు & భుజియా, మిక్చర్, వంట సామాగ్రి), నిత్యావసర వస్తువులు (తల నూనె, షాంపు, సబ్బులు, షేవింగ్ క్రీమ్ , టూత్ బ్రెష్, టూత్ పేస్ట్ మొదలైనవి)లు అన్నీ 12 శాతం స్లాబ్ నుంచి 5 శాతం స్లాబ్‌లోకి చేర్చారు. ధర్మా మీటర్, కళ్లజోళ్లు, మెడికల్ గ్రిడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ గ్రిడ్, గ్లూకోమీటర్ వంటివి కూడా ఇప్పుడు 5 శాతం స్లాబ్‌లోకి చేరాయి. వ్యక్తిగత భీమా, జీవిత భీమా, ఆరోగ్య భీమా వంటివాటిపై ఎలాంటి జీఎస్‌టీ లేదు. వ్యవసాయ ఉత్పత్తులు, గ్రీన్ ఎనర్జీ, చిన్న కార్లు, బైకులపై కూడా జీఎస్‌టీ తగ్గింది.

టీవీలు, ఏసీలు, 350 సీసీ కంటే తక్కువ సామర్థ్యం కలిగిన టూ వీలర్స్ అన్నీ కూడా 28 శాతం స్లాబ్ నుంచి 18 శాతం స్లాబ్ కిందికి వస్తాయి. 1200 సీసీ కెపాసిటీ కలిగిన చిన్న కార్లు, 1500 సీసీ సామర్థ్యం కలిగిన డీజిన్ కార్లు కూడా 18 శాతం స్లాబ్ కిందకే వస్తాయి. దీన్నిబట్టి చూస్తే.. కొంత తక్కువ సామర్థ్యం ఉన్న వాహనాల ధరలు తగ్గుతాయని స్పష్టం అవుతోంది.

లగ్జరీ వాహనాలు, పొగాకు లేదా పొగాకు సంబంధిత ఉత్పత్తులు, కార్బోనేటేడ్ పానీయాలు, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బైకులపైన 40 శాతం పన్ను వర్తిస్తుందని సమాచారం. రాష్ట్రాల ఆదాయాలు పెంచుకోవడానికి.. కేంద్రం నుంచి తీసుకున్న అప్పులను చెల్లించడానికి ప్రభుత్వం ఈ ఉత్పత్తులపై జీఎస్‌టీ కొంత పెంచినట్లు తెలుస్తోంది.

రూ. 48,000 కోట్ల నష్టం

కేంద్రం జీఎస్‌టీ స్లాబులను తగ్గించడంవల్ల.. ప్రభుత్వం రూ. 48,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాత్సవ తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినప్పటికీ.. ప్రజలకు ఉపశమనం కలిగించాలని, అమెరికా టారిఫ్స్ ప్రభావం నుంచి కొంత కోలుకోవాలని కేంద్రం ఈ కీలక చర్యలు తీసుకుంది.

జీఎస్‌టీ సవరణపై మోదీ వ్యాఖ్యలు

నేను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో జీఎస్‌టీ సంస్కరణలను తీసుకురావాలనే ఉద్దేశాన్ని వెల్లడించాను. ఈ నేపథ్యంలో.. కేంద్రం సమర్పించిన.. ప్రతిపాదనలకు రాష్ట్రాలు కూడా అంగీకరించాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం, ఇది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

ఎనిమిదేళ్ల క్రితం జీఎస్‌టీ

నిజానికి ఈ జీఎస్‌టీ అనేది.. 2017 జులై 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పార్లమెంటులో ప్రారంభించారు. ”ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్” అనే సూత్రంపై జీఎస్‌టీ ప్రవేశపెట్టారు. ప్రారంభంలో జీఎస్‌టీ ఐదు స్లాబులలో ఉండేది. ఆ తరువాత దీనిని నాలుగుకు చేర్చారు. ప్రస్తుతం రెండుకు వచ్చింది.

Leave a Comment