Hyundai Creta Facelift Crossed One Lakh Unit Sales: దేశంలో అందరికి సుపరిచయమైన వాహన తయారీ సంస్థ ‘హ్యుందాయ్’ (Hyundai) మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వాహన ప్రియులకు దగ్గరవుతున్న విషయం విదితమే. ఎంతలా ప్రజలకు దగ్గరవుతోందంటే.. కొన్ని రోజులకు ముందు భారతీయ విఫణిలో అడుగుపెట్టిన క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఏకంగా 1 మందికి చేరువయ్యంది. దీన్ని బట్టి చూస్తే హ్యుందాయ్ కంపెనీకి ఉన్న ఆదరణ స్పష్టంగా అర్థమైపోతోంది.
ఆరు నెలల్లో 1 లక్ష యూనిట్ల సేల్స్
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కేవలం 6 నెలల్లో లక్ష యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. ఇది అమ్మకాల్లో కంపెనీ సాధించిన అరుదైన రికార్డ్ అనే చెప్పాలి. సంస్థ నెలకు సగటున 15000 క్రెటా కార్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024 మార్చి నెలలో కంపెనీ గరిష్టంగా 16458 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది. జూన్ నెలలో కూడా హ్యుందాయ్ ఏకంగా 16293 యూనిట్ల క్రెటాలను విక్రయించింది.
కంపెనీ రోజుకు సగటున 550 యూనిట్ల హ్యుందాయ్ క్రెటా కార్లను విక్రయించింది. ఇప్పటికి కూడా క్రెటా కారు కోసం 10 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలను పొందుతున్న మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ వంటి కార్లకు ప్రత్యర్థిగా ఉంటూనే.. క్రెటా అమ్మకాల్లో గణనీయంగా వృద్ధి చెందింది అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి.
మొత్తం 11 లక్షల యూనిట్లు
భారతదేశంలో హ్యుందాయ్ కంపెనీ మొత్తం 11 లక్షల క్రెటా కార్లను విక్రయించింది. ఇందులో సాధారణ క్రెటా కార్ల అమ్మకాలు 10 లక్షలు కాగా.. ఫేస్‌లిఫ్ట్ అమ్మకాలు 1 లక్ష యూనిట్లు. గత ఫిబ్రవరిలో క్రెటా 10 లక్షల యూనిట్ల అమ్మకాలను చేరుకున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కాగా క్రెటా ఫేస్‌లిఫ్ట్ అమ్మకాలు ఇప్పుడు 1 లక్ష యూనిట్లకు చేరుకుంది. మొత్తం మీద క్రెటా 11 లక్షల సేల్స్ సాధించగలిగింది.
క్రెటా మాత్రమే కాదు
హ్యుందాయ్ క్రెటా మాత్రమే కాకుండా.. ఎక్స్‌టర్ మరియు మారుతి ఫ్రాంక్స్ వంటివి కూడా అమ్మకాల్లో లక్ష మైలురాయిని చేరుకున్నాయి. ఎక్స్‌టర్ లక్ష యూనిట్ల అమ్మకాలను పొందటానికి 12 నెలలు, ఫ్రాంక్స్ లక్ష యూనిట్ల అమ్మకాలు పొందటానికి 10 నెలల సమయం పట్టింది. దీన్ని బట్టి చూస్తుంటే.. ఇండియన్ మార్కెట్లో కార్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
క్రెటా విజయానికి కారణం
భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రియులకు ఇష్టమైన కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ హ్యుందాయ్ యొక్క క్రెటా. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. క్రెటా కారు పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, పెద్ద డిజిటల్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా మరియు ఏడీఏఎస్ (అడ్వాన్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటివి పొందుతుంది. ఇవన్నీ ప్రయాణాన్ని మరింత హుందాగా మారుస్తుంది.
హ్యుందాయ్ క్రెటా ధరలు రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్య ఉంటుంది. ఇది కూడా క్రెటా అమ్మకాలు పెరగటానికి పెద్ద కారణామనే చెప్పాలి. ఈ కారు మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. ఇది 1.5 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను పొందుతుంది.
Don’t Miss: రూ.5.49 లక్షలకే మారుతి ఇగ్నీస్ కొత్త ఎడిషన్.. పూర్తి వివరాలు ఇక్కడ
క్రెటాలోని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ మరియు సీవీటీ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇక 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది 160 పీఎస్ పవర్, 253 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్మిషన్ పొందుతుంది. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ 116 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది.
హ్యుందాయ్ కంపెనీ యొక్క క్రెటా అద్భుతమైన డిజైన్ కలిగి, వాహనదారులకు అవసరమైన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలను పొందుతోంది. ఇప్పటికి కూడా క్రెటా యొక్క 33000 ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారును డెలివరీ చేసుకోవడానికి కనీసం 10 వారాలు ఎదురు చూడాల్సి ఉంటుందని కంపెనీ చెబుతోంది.