ఎస్‌ఆర్‌హెచ్: 300 కొడతారా.. కప్ గెలుస్తారా?

ఐపీల్ 2026కు సంబందించిన మినీ వేలం ముగిసింది. దీంతో ఏ ప్రాంచైజీ ఏ ఆటగాళ్ళను కొనుగోలు చేసింది. ఎవరెవరి కోసం ఎంత ఖర్చు చేసింది అనే విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొత్త వాళ్లు ఎంతమందిని తమ టీమ్‌లోకి తీసుకున్నారు.  పాత వాళ్లు ఎవరెవరు ఉన్నారు అనే అంశాలు ఒక ముగింపుకి వచ్చాయి. పది ఐపీల్ ప్రాంచైజీలు వాటివాటి పూర్తి లెక్కలు అన్నీ బయటపెట్టాయి. ఇందులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టు విశేషాలు ఇలా ఉన్నాయి.

ఫైనల్‌కు మూడుసార్లు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఐపీఎల్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన జట్టు. ఒక్క హైదరాబాద్ వాళ్లే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు కూడా టీమ్‌ను సొంతం చేసుకున్నారు. మూడు సార్లు 2016, 2018, 2024లో ఫైనల్‌కు వెళ్లింది. అందులో ఒకసారి 2016 సంవత్సరంలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌ను ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. 2024లో మొదటి నుంచి ఆడిన ఆట తీరుగానీ, పరుగులు కొట్టిన విధానంగానీ చూస్తే అందరూ.. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ టీమ్ ఫైనల్ కప్ గెలిచి తీరుతుందని తీర్పులు ఇచ్చేశారు. అయితే బాగా ఆడిన వాళ్లు ఆడాల్సిన చివరి ఆటలో మాత్రం గొప్ప ప్రదర్శన కాకపోయినా కనీస ఆట కూడా ఆడకుండా దారుణంగా బ్యాటింగ్, బోలింగ్ ఇలా అన్ని విభాగాల్లోను విఫలమైంది.

ఎస్‌ఆర్‌హెచ్ హైదరాబాద్ తన క్రికెట్ అభిమానుల ఆశలని నిరాశపరిచింది. అయితే ఐపీల్ చరిత్రలో ఎప్పుడు లేని రికార్డుల మోత మోగించింది. 2025లో అయినా కప్ కొట్టి తీరాలానే కసితో బరిలోకి దిగింది. అప్పుడు కూడా రికార్డులు నెలకొల్పింది గానీ కనీసం ప్లేఆఫ్స్‌కు వెళ్లలేకపోయింది. 300 టార్గెట్ అని అభిమానులు కోరుకున్నారు, అది కూడా నెరవేరలేదు. బలమైన ఆటగాళ్లు ఉన్నా ఎక్కడో ఏదో మిస్ అవుతున్నదనేది మాత్రం అర్థమవుతున్నది. మరి ఈసారైనా కప్ గేలవాలనే ధీమాతో మంచి బ్యాటింగ్ & బౌలింగ్‌తో బరిలోకి దిగుతోంది మరి ఆట ఎలా ఉండబోతుందో చూడాలి.

కొత్తగా టీమ్‌లోకి వచ్చిన ఆటగాళ్లు

లైమ్ లివింగ్ స్టోన్ (రూ.13 కోట్లు), జాక్ ఎడ్వర్డ్స్ (రూ.3 కోట్లు), సలీల్ అరోరా (రూ.1 కోటి 50 లక్షలు), శివమ్ మవి (రూ.75 లక్షలు ), ఒంకల్ తర్మేల్ (రూ.30 లక్షలు ), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు), శివంగ్ కుమార్ (రూ.30 లక్షలు ),  క్రైన్స్ ఫులెట్రా (రూ.30 లక్షలు ), సఖీబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే (రూ.30 లక్షలు).

పై జాబితాలో విదేశి ఆటగాడైనా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్ కోసం కావ్య మారన్ ఏకంగా 13 కోట్ల రూపాయల అత్యంత ధరకి కొనుగోలు చేసింది. మరో ఫారినర్ జాక్ ఎడ్వర్డ్స్ను మూడు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. పది మందిలో మిగిలిన ఆటగాళ్ళని ఒక్కరిని మినహాయించి ఒక్కొక్కరిని రూ.30 లక్షలకే దక్కించుకున్నారు.

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు

ఈ సంవత్సరం దాదాపు అన్ని టీమ్‌లు కూడా ఎక్కువ మంది ప్లేయర్లను రిటెన్షన్ చేసుకోవడం జరిగింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ అయితే ఏకంగా 15 మంది ఆటగాళ్లనుఅలాగే అంటిపెట్టుకుంది.

ప్యాట్ కమ్మిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ.11 కోట్లు), నితీష్ కుమార్ రెడ్డి (రూ.6 కోట్లు), కమిందు మెండీస్ (రూ.75 లక్షలు), అనికేత్ వర్మ (రూ.30 లక్షలు), హర్ష్ దుబే (రూ.30 లక్షలు), ఇషాన్ మలింగ (రూ.1.20 లక్షలు), హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు), జయదేవ్ ఉనద్కట్ (రూ.1 కోటి), జీషాన్ అన్సారీ (రూ.40 లక్షలు), బ్రైడోన్ కార్సే (రూ.1 కోటి), ఆర్. స్మారన్ (రూ.30 లక్షలు).

తదుపరి ఆటకు సిద్ధం

మొత్తం 25 మందితో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తమ తదుపరి ఆటకు సిద్ధం అయింది. ఈ జట్టులో 8 మంది విదేశి ఆటగాళ్లు ఉన్నారు. వీరికోసం కావ్య మారన్ 73 కోట్ల 95 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. స్వదేశి ఆటగాళ్ల కోసం రూ.45 కోట్ల 55 లక్షలు ఖర్చు చేసింది. 125 కోట్ల రూపాయలలో 119 కోట్ల 55 లక్షల రూపాయలు.. 25 మంది కోసం వెచ్చించిగా ఇంకా 5 కోట్ల 45 లక్షలు రూపాయలను హైదరాబాద్ ప్రాంచైజీ తన ఖాతాలో నిలుపుకుంది. పది స్లాట్స్ కోసం రూ.25 కోట్ల 50 లక్షలతో మినీ వేలానికి వెళ్లిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ప్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఇంకా 5 కోట్ల 45 లక్షలు ఖర్చు చేయకుండానే తనకు కావాల్సిన ప్లేయర్లను దక్కించుకుంది.

గత సీజన్స్ మాదిరిగానే ఈసారి కూడా బ్యాటింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. మరి బోలింగ్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. అభిమానులు కోరుకున్న 300 స్కోర్ కొడతారా లేదా ఏకంగా ఫైనల్‌కు వెళ్లి కప్ గెలుస్తారా అనే దానికోసం ఆసక్తి నెలకొనింది. మరి కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఎటువంటి ప్లాన్‌తో ముందుకోస్తాడో, తన టీమ్‌ను ఎలా నడిపిస్తాడో చూడాలి.