హ్యూమన్ వాషింగ్ మెషీన్.. ఇదెలా పని చేస్తుందంటే?

బట్టలు ఉతికే వాషింగ్ మెషీన్ గురించి విన్నారు. ఎప్పుడైనా మనిషిని వాష్ (శుభ్రం చేసే) మెషీన్ గురించి విన్నారా?, అయితే ఇప్పుడు వినండి. మరిన్ని వివరాల కోసం ఈ ప్రత్యేక కథనం..

హ్యూమన్ వాషింగ్ మెషీన్

స్నానం చేయడానికి కూడా బద్దకించే మనుషులు కొందరు ఉండే ఉంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకునే.. జపాన్ కంపెనీ ‘సైన్స్’ అద్భుతమైన హ్యూమన్ వాషింగ్ మెషీన్ తీసుకొచ్చింది. దీనిని కంపెనీ ఒసాకాలో జరిగిన.. వరల్డ్ ఎక్స్‌పోలో అధికారికంగా ఆవిష్కరించింది. ఈ మెషీన్ కేవలం ఆవిష్కరణ కోసం మాత్రమే అనుకున్న కంపెనీ.. ఇప్పుడు విక్రయానికి కూడా సిద్ధమైంది.

సుమారు రూ.3 కోట్లు!

జపనీస్ సైన్స్ కంపెనీ.. ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ తయారు చేయడానికి ఆరేళ్లు కృషి చేసినట్లు తెలుస్తోంది. కాగా సంస్థ ఇలాంటి మెషీన్స్ 50 మాత్రమే విక్రయించాలని నిర్ణయించుకుంది. దీని ధర 60 మిలియన్ యెన్స్ (దాదాపు రూ. 3 కోట్ల కంటే ఎక్కువ). ఈ మెషీన్ మనిషి శరీరాన్ని ఇట్టే శుభ్రం చేసేస్తోంది.

ఇదెలా పనిచేస్తుందంటే?

సైన్స్ సంస్థ రూపొందించిన హ్యూమన్ వాషింగ్ మెషీన్‌లో ఆరడుగుల మనిషి కూడా పడుకోవచ్చు. దీనికోసం ఇందులో 2.3 మీటర్ల పొడవున్న పాడ్ ఉంటుంది. మనిషి దీనిపై పడుకోగానే.. పైనున్న క్లోజర్ క్లోజ్ చేస్తుంది. ఆ తరువాత నీరు చిరుజల్లులు రూపంలో వారిపై పడుతుంది. దీనికోసం ఈ యంత్రం ప్రత్యేకంగా తయారైంది.

15 నిమిషాల్లో శుభ్రం!

హ్యూమన్ వాషింగ్ మెషీన్ లోపల.. మనిషికి సేఫ్టీ ఏ మాత్రం లోటు లేదు. మెషీన్ లోపల సెన్సార్లు ఉన్నాయి. వాష్ జరుగుతున్న సమయంలో.. లోపల ప్రశాంతమైన విజువల్స్, మ్యూజిక్ ప్లే అవుతుంది. వాష్ పూర్తయిన తరువాత ఇదే ఆరబెడుతుంది కూడా. ఇదంతా కేవలం 15 నిమిషాల్లో జరిగిపోతుంది.

జపాన్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ నుంచి బయటకు వచ్చిన తరువాత.. శరీరం మొత్తం శుభ్రమవుతుంది. కాగా తుడుచుకోవడానికి టవల్ వంటివి ఏమాత్రం అవసరం లేదు. ఇవి చాలా అద్భుతంగా ఉండటంతో.. దీనిని కొనుగోలు చేయడానికి అక్కడి జనం ఎగబడుతున్నారు.

భవిష్యత్తులో భారత్‌లోకి?

ఇప్పటివరకు రకరకాల వాషింగ్ మెషీన్స్ అందుబాటులోకి వచ్చాయి, కానీ.. హ్యూమన్ వాషింగ్ మెషీన్ రావడం బహుశా ఇదే మొదటిసారి. టెక్నాలజీ రోజురోజుకు.. అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి అద్భుతాలు జరగడం కొత్తేమీ కాదు. అయితే ఇలాంటి యంత్రం ప్రస్తుతం మన దేశంలో లేదు. బహుశా భవిష్యత్తులో అందుబాటులోకి వస్తుందేమో చెప్పలేము. వచ్చినా.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

నెటిజన్ల అభిప్రాయం ఇలా..

కొత్త టెక్నాలజీని ఆస్వాదించేవారు కొందరుంటే.. విమర్శించేవారు కూడా కొందరు ఉంటారు. స్నానం చేయడానికి ఇబ్బందిపడేవాళ్లు కూడా ఉంటారా?, ఇలాంటి యంత్రాలు అవసరమా?, అని అంటున్నారు. నిజానికి ఎవరైనా.. ఎప్పుడైనా.. కొత్త టెక్నాలజీలని ఆస్వాదిస్తే అద్భుతంగా ఉంటుంది. అయితే దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా?, లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఒక మంచి జరిగే చోట.. ఒక చెడు కూడా జరుగుతుందనే విధంగా.. ఈ హ్యూమన్ వాషింగ్ మెషీన్ వల్ల బహుశా.. నష్టాలు ఉండొచ్చు. ఎలాంటి నష్టాలు అనేది వెల్లడికాలేదు.