జూనియర్‌ ఎన్టీఆర్‌ డ్యాన్స్‌ చూశాక మైండ్‌లో ఫిక్సయ్యా.. శ్రీలీల తల్లి

జీవితంలో ఎదగాలంటే ఎవరో ఒకరిని తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడే అనుకున్న గమ్యాన్ని, సరైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సాధ్యమవుతుంది. ఈ రోజు లైఫ్‌లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికీ ఒక రోల్ మోడల్ తప్పకుండా ఉండే ఉంటారు. నటి శ్రీలీల డ్యాన్స్ బాగా నేర్చుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ కారణమని స్వయంగా శ్రీలీల తల్లి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కూతురు పుడితే..

తాతకు తగ్గ మనవడుగా, సింగిల్ టేక్ ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్న తారక్.. చిన్నప్పటి నుంచే నటనపై అమితమైన ఆసక్తిని కనపరిచేవారు. దీంతో నేడు చిత్ర సీమలో తిరుగులేని నటుడుగా స్థానం సంపాదించుకున్నారు. డైలాగ్ డెలివరీలో, డ్యాన్స్ వేయడంలో తనకు తానే సాటిగా నిరూపించుకున్న ఈయన.. శ్రీలీల డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆదర్శం. 1997లో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన తానా సభలో జూనియర్ ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం చేశారు.

ఎన్టీఆర్ కూచిపూడి నాట్యం చూసి ముగ్దురాలైన డాక్టర్ స్వర్ణలత (శ్రీలీల తల్లి).. తనకు ఆడపిల్ల పుడితే డ్యాన్స్ నేర్పించాలని అప్పుడే ఫిక్స్ అయినట్లు.. నటుడు జగపతి బాబు హోస్టుగా నిర్వహిస్తున్న జయమ్ము నిర్ఛయమ్ము షోలో వెల్లడించారు. ఆ సమయంలో తానూ ఎన్టీఆర్‌తో మాట్లాడినట్లు కూడా చెప్పింది. అనుకున్నట్లుగానే నాకు ఆడపిల్ల పుట్టింది. ఇప్పుడు మంచి డ్యాన్సర్ అయిందని స్వర్ణలత చెప్పారు.

శ్రీలీల గురించి

తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంగా బాగా పాపులర్ అయిన నటీమణులలో శ్రీలీల ఒకరు. తెలుగు సినిమాలలోకి రాకముందే శ్రీలీల కన్నడ సినిమాలలో నటించారు. అయితే పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి సినిమాల్లో కథానాయకిగా నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తరువాత వచ్చిన పుష్ప 2 సినిమాలో కిస్ కిస్ కిస్సిక్ అనే పాటకు డ్యాన్స్ వేసి.. మరింత మందిని ఆకట్టుకుంది. కాగా ఈమె ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా కనిపించనున్నట్లు సమాచారం.

నటి శ్రీలీల అమెరికాలో పుట్టినప్పటికీ.. తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. ఈమె తల్లి గైనకాలజీ డాక్టర్ స్వర్ణలత. చిన్నపాటి నుంచే శ్రీలీల భరతనాట్యం నేర్చుకుంది. డాక్టర్ కావాలనే కోరికతోనే ఈమె ఎంబీబీఎస్ చేస్తోంది. ప్రస్తుతం ఎంబీబీఎస్ చివరి సంవత్సరంలో ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద అమెరికాలో పుట్టి, బెంగళూరులో పెరిగి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో తిరుగు లేకుండా దూసుకెళ్తోంది.

శ్రీలీల రెమ్యునరేషన్

హీరోయిన్ శ్రీలీల పుష్ప 2 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. గుంటూరు కారం సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అయితే పాత్రను బట్టి, సినిమాను బట్టి ఒక్కో సినిమాకు దాదాపు రూ. 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శ్రీలీల గురు, శోభిత అనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకుంది.

Leave a Comment