మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ vs ఎక్స్‌యూవీ700: ధర & ఇతర పూర్తి వివరాలు

చాలా రోజుల నిరీక్షణ తరువాత.. మహీంద్రా తన ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారును లాంచ్ చేసింది. దీనిని ఎక్స్‌యూవీ700 ఫేస్‌లిఫ్ట్ అని కూడా పిలుస్తున్నారు. కాబట్టి మనం ఈ కథనంలో.. ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ & ఎక్స్‌యూవీ700 మధ్య ఉన్న తేడాలు ఏమిటనేది చూసేద్దాం.

ముందుగా డిజైన్ విషయానికి వస్తే..

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారులో అప్డేటెడ్ గ్రిల్, కొత్త హెడ్‌లైట్ ఉండటం చూడవచ్చు. గ్లోస్ బ్లాక్ థీమ్‌లో పూర్తి చేసిన బోల్డ్ గ్రిల్ కూడా కనిపిస్తుంది. ఇది కాకుండా.. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, స్కార్పియో ఎన్, బొలెరో వంటి సిల్వర్ స్లాట్ కనిపిస్తుంది. బంపర్ మీద రీడిజైన్ చేసిన ఎయిర్ ఇన్‌టేక్‌లు, ఫ్యాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. 19 ఇంచెస్ డ్యూయెల్ టోల్ అల్లాయ్ వీల్స్ కనిపిస్తాయి. ప్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్, విండో లైన్ వెంట క్రోమ్ వంటికి ఉన్నాయి.

ఇక ఎక్స్‌యూవీ700 విషయానికి వస్తే.. ఇది రెండు పిక్సెల్ షేప్ ఫాగ్ ల్యాంప్స్ పొందుతుంది. టర్న్ ఇండికేటర్స్ డీఆర్‌ఎల్‌లోకి ఉంటాయి. ప్రొజెక్టర్ హెడ్‌లైట్ యూనిట్ కింద ఉంటుంది. ఇది 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఇందులో కూడా ప్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్ డిజైన్ గురించి

ఎక్స్‌యూవీ700 కారు తెలుపు, నలుపు థీమ్‌ను కలిగి ఉంటే.. ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ బ్లాక్, బేజ్, ట్యాన్ కలర్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం లుక్ ఇస్తుంది. అంతే కాకుండా.. ఇది గ్లా బ్లాక్ ఫినిషింగ్‌తో కొత్త 2 స్పోక్ స్టీరింగ్ వీల్ పొందుతుంది. 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ఈ కారులోని రెండో వరుసలో కెప్టెన్ సీట్లు లభిస్తాయి. ఇందులోని డాష్‌బోర్డ్, ముందు డోర్స్ మీద మాత్రమే కాకుండా.. వెనుక డోర్స్ మీద కూడా మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్ కూడా ఉన్నాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే..

ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్ కార్లలో మాదిరిగానే.. ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కూడా ట్రిపుల్ స్క్రీన్ పొందుతుంది. ఇందులో ఒక్కొక్క స్క్రీన్ 12.3 అంగుళాలు. కొత్త ఫీచర్స్ విషయానికి వస్తే.. పవర్డ్ బాస్ మోడ్‌తో 6వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ కో-డ్రైవర్ సీటు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, రెండు వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్లు, 540 డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ కూడా జాబితాలో ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ ఎంపికలు

ఇప్పుడు లాంచ్ అయిన మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు, సాధారణ ఎక్స్‌యూవీ700 కారు ఒకే విధమైన ఇంజిన్ ఎంపికలను పొందుతాయి. కాబట్టి అదే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇంజిన్స్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో లభిస్తుంది.

ధరల వ్యత్యాసం

మహీంద్రా ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ కారు ధరలు రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.92 లక్షల మధ్య ఉన్నాయి. ఈ ధరలు మొదటి 40వేలమంది కొనుగోలుదారులకు మాత్రమే అని కంపెనీ వెల్లడించింది. అయితే సాధారణ ఎక్స్‌యూవీ700 ప్రారంభ ధర కూడా రూ. 13.66 లక్షలే (ఎక్స్ షోరూమ్), టాప్ వేరియంట్ ధర రూ. 22.95 లక్షలు (ఎక్స్ షోరూమ్).