మల్లెపూల వల్ల.. నటికి రూ.1.14 లక్షల జరిమానా!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మల్లె పూలు ట్రెండ్ అవుతున్నాయి. కారణం ఏమిటంటే.. మలయాళీ భామ ‘నవ్య నాయర్‘ మూర మల్లెపూలు తీసుకెళ్ళినందుకు ఆస్ట్రేలియా అధికారులు ఏకంగా 1980 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 1.14 లక్షలు) జరిమానా విధించారు. దీంతో భారతదేశంలోని చాలామంది మహిళలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మల్లె పూలకు ఎందుకు ఇంత జరిమానా విధించారు?, ఇంకా నిషేధిత వస్తువులు ఏమైనా ఉన్నాయా? అనే చాలా వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

రూ.1.14 లక్షల జరిమానా..

విక్టోరియాలోని మలయాళీ అసోసియేషన్ నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి.. నవ్య నాయర్ ఆస్ట్రేలియా వెళ్లారు. మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు ఈమె మల్లెపూలు బ్యాగులు పెట్టుకుంది. ఇది గమనించిన అక్కడ సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి అధికారులు మల్లె పూలు తీసుకెళ్ళినందుకు గానూ.. నటికి రూ. 1.14 లక్షలు జరిమానా విధించారు. జరిమానా 28 రోజుల్లో చెల్లించాలని, దీనిని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేసేదేమీ లేక నటి ఊరుకుంది.

మల్లె పూలు తీసుకెళ్లకూడదని నటి నవ్య నాయర్‌కు తెలియదు. ఈ కారణంగానే ఈమె భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఈ సంఘటన జరిగిన తరువాత.. 15 సెంటీమీటర్ల మల్లె పూలు రూ. 1.14 లక్షలు అని నవ్య నాయర్ కామెంట్ చేశారు. పలువు నెటిజన్లు ఈ సంఘటనకు ఖంగుతినడమే కాదు.. ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోతున్నారు.

మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిషేధిత వస్తువులు

మెల్‌బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కేవలం మల్లెపూలు మాత్రమే కాకుండా, కొన్ని విత్తనాలు, మొక్కలు, పండ్లు, పాల ఉత్పత్తులు, స్వీట్స్, టీ, ఇంటి భోజనం, పెంపుడు జంతువులు, ఈకలు మొదలైనవి నిషేధం. కొన్ని అంటువ్యాధులు ఇలాంటి వాటి నుంచే వ్యాప్తి చెందుతాయని భావించి.. అక్కడి అధికారులు వీటిని నిషేధించడం జరిగింది. నిషేధిత వస్తువులతో పట్టుబడితే.. అది ఎంతటివారైనా జరిమానా చెల్లించక తప్పదు. కానీ మాపుల్ చెట్ల నుంచి తయారు చేసిన షుగర్ సిరప్ మాత్రం ఇక్కడ నిషిద్ధం కాదు.

నవ్య నాయర్ గురించి

బహుశా తెలుగు వారికి నవ్య నాయర్ పేరు కొత్త అయినప్పటికీ.. ఈమె మలయాళీ, కన్నడ సినిమాల ద్వారా బాగా ఫేమస్ అయింది. కేరళ రాష్ట్ర ఉత్తమ నటిగా రెండుసార్లు చలన చిత్ర అవార్డులు గెలుచుకున్న నవ్య నాయర్.. 2001లో సీబీ మలైల్ దర్శకత్వం వహించిన ఇష్టా సినిమాతోనే సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత మజతుల్లిక్కిలుక్కం, కుంజికూనన్, కల్యాణరామన్, వెళ్లితీర, అమ్మకిలిక్కూడు, గ్రామోఫోన్, పట్టణతిల్ సందరన్ దృశ్య 2, ఒరుతీ, జానకి జానే అనే సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోగలిగింది.

నవ్య నాయర్ అసలు పేరు ధన్య వీణ. ఈమె 1985 అక్టోబర్ 14న కేరళలోని అలప్పుజలోని హరిపాడ్ సమీపంలోని ముత్తుకులం అనే గ్రామంలో జన్మించారు. చిన్న వయసులోనే శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందింది. 2010లో సంతోష్ మీనన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి సాయి కృష్ణ అనే కుమారుడు ఉన్నాడు. ధన్య పేరును సీబీ మలైల్ నవ్యగా మార్చేశారు. ఆ పేరుతోనే సినిమాల్లో ఈమె పాపులర్ అయింది.

Leave a Comment