మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇదే.. ధర రూ.10.99 లక్షలు!

మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కంపెనీ.. ఇండియన్ మార్కెట్లో చెప్పినట్లుగానే తన తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఈ విటారా‘ను లాంచ్ చేసింది. ఈ కథనంలో దీని ధరలు, బ్యాటరీ, రేంజ్, ప్రత్యర్థులు మొదలైన చాలా విషయాలను వివరంగా తెలుసుకుందాం.

కంపెనీ లాంచ్ చేసిన మారుతి ఈవిటారా కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధరలు మార్చి 31 వరకు మాత్రమే. అంటే ఆ తరువాత కారు ధరలు మారే అవకాశం ఉంది. అయితే కంపెనీ ఈ కారును బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ కింద కూడా విక్రయిస్తోంది. దీని ప్రకారం.. ధరలు ఇంకా తగ్గుతాయి. ఈ కారు కోసం రూ.21 వేలు చెల్లించి బుక్ చేసుకునే అవకాశాన్ని సంస్థ కల్పించింది.

బ్యాటరీ & రేంజ్

కొత్త మారుతి సుజుకి ఈవిటారా ఎలక్ట్రిక్ కారు హార్టెక్ట్ ఈ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా నిర్మితమైంది. ఇది 49 కిలోవాట్ బ్యాటరీ, 61 కిలోవాట్ బ్యాటరీ అనే రెండు బ్యాటరీ ఎంపికలలో లభిస్తుంది.

49 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈవిటారా 144 హార్స్ పవర్ అందిస్తుంది. సింగిల్ మోటార్ పొందుతుంది. 61 కిలోవాట్ బ్యాటరీ కూడా ఒకే మోటారును కలిగి 174 హార్స్ పవర్ అందిస్తుంది. ఈ రెండూ 189 ఎన్ఎమ్ టార్క్ అందిస్తాయి. రేంజ్ విషయానికి వస్తే.. చిన్న బ్యాటరీ 440 కిమీ రేంజ్ అందిస్తుంది. పెద్ద బ్యాటరీ 543 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఈవిటారా ఈవీ డిజైన్

మారుతి సుజుకి ఈవిటారా కారు ట్రై-ఎల్ఈడీ డీఆర్ఎల్, ముందు భాగంలో క్లోస్డ్ గ్రిల్ ఉన్నాయి. దిగువ బంపర్‌లో స్కిడ్ ప్లేట్‌లతో పాటు చిన్న ఫాగ్ లాంప్ కూడా ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ ఏరోడైనమిక్ డిజైన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. వెనుక భాగంలో టెయిల్ లాంప్ కోసం స్పెషల్ డిజైన్ ఉండటం చూడవచ్చు. చూడటానికి చాలా వరకు సాధారణ విటారా మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని అప్డేట్స్ కనిపిస్తాయి.

క్యాబిన్ & ఫీచర్స్

అద్భుతమైన డిజైన్ కలిగిన క్యాబిన్ ఈవిటారా ఎలక్ట్రిక్ కారు సొంతం. ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ రెండింటికీ ప్లోటింగ్ డ్యూయల్ స్క్రీన్ ఉన్నాయి. గ్లోసీ బ్లాక్ ఫినిషింగ్‌తో ప్లోటింగ్ సెంటర్ కన్సోల్ ఉంది. గేర్ ఎంపికల కోసం కంట్రోల్స్, ఈ-బ్రేక్, డ్రైవ్ మోడ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా ఇందులో చూడవచ్చు. టూ స్పోక్ స్టీరింగ్ వీల్, బ్రష్డ్ సిల్వర్ యాక్సెంట్‌లతో దీర్ఘచతురస్రాకార ఏసీ వెంట్స్, రోటరీ డ్రైవ్ స్టేట్ సెలెక్టర్, లెథరెట్ అపోల్స్ట్రే కూడా లభిస్తాయి.

ఫీచర్స్ విషయానికి వస్తే.. 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు అనుకూలమైన 10.1 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, క్లౌడ్ బేస్డ్ న్యావిగేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, 12 కలర్ ఆప్షన్‌లతో యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా.. వైర్‌లెస్ ఛార్జింగ్, జేబీఎల్ సౌండ్ సిస్టం, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ యూఎస్బీ పోర్టులు, ఎయిర్ ప్యూరిఫైయర్ మొదలైనవి కూడా ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్

కారు కొనాలంటే.. చాలామంది ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లనే కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ.. తన విటారా కారులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లెవల్ 2 ఏడీఏఎస్ మొదలైనవి ఉన్నాయి.