మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు.. 543 కిమీ రేంజ్!

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి.. తన ఈ-విటారా ఆవిష్కరణతో ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ కారు కోసం బుకింగ్స్ త్వరలోనే ప్రారంభమవుతాయి. కాగా 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనిని సంస్థ సబ్‌స్క్రిప్షన్ మరియు బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (బాస్) స్కీమ్ ద్వారా కూడా విక్రయించనుంది. ఈ సరికొత్త మారుతి ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

మౌలిక సదుపాయాల కోసం రూ.250 కోట్లు!

మారుతి సుజుకి.. ఈ-విటారా కారును ఆవిష్కరించడానికి ముందే, మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికోసం ఒక ముఖ్యమైన ప్రణాళికను రచిస్తూ.. ఏకంగా 250 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. నగరాల్లో ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయనుంది. 2030 నాటికి దేశవ్యాప్తంగా విస్తృతంగా ఛార్జింగ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యంగా అడుగులు వేస్తోంది.. కంపెనీ దీనినే లక్ష్యంగా పెట్టుకుంది.

కంపెనీ ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ స్టేషన్లను (మౌలిక సదుపాయాలను) సులభంగా గుర్తించడానికి.. సంస్థ ‘ఈ ఫర్ మీ’ అనే యాప్ పరిచయం చేస్తోంది. దీనిద్వారా సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్లను గుర్తించవచ్చు. డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు, సర్వీస్ అపాయింట్‌మెంట్‌ల సులభంగా షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా.. మారుతి సుజుకి ఇప్పటికే దేశం మొత్తం మీద 1500 ఈవీ రెడీ సర్వీస్ వర్క్‌షాప్‌లను సిద్ధం చేసింది. ఎలక్ట్రిక్ వాహనదారులకు ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ-విటారా బ్యాటరీ స్పెసిఫికేషన్స్

మారుతి సుజుకి లాంచ్ చేయనున్న కొత్త ఈ-విటారా ఎలక్ట్రిక్ కారు 49 కిలోవాట్ బ్యాటరీ (సింగిల్ మోటార్ సెటప్), 61 కిలోవాట్ బ్యాటరీ (ఆల్ వీల్ డ్రైవ్ అందించే డ్యూయెల్ మోటార్) అనే రెండు ఎంపికలతో అందుబాటులో ఉండనుంది. ఇవి రెండూ ఉత్తమ పర్ఫామెన్స్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది.

ఈ-విటారా ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్‌పై 543 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. అయినప్పటికీ రియల్ వరల్డ్ రేంజ్ కొంత తగ్గుతుందనేది వాస్తవం. ఖచ్చితమైన గణాంకాలు టెస్ట్ డ్రైవ్ చేసిన తరువాత తెలుస్తోంది. రేంజ్ ఉత్తమాంగానే ఉంటుందని భావిస్తున్నాము.

సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్

మారుతి సుజుకి ఈ-విటారా ఎలక్ట్రిక్ కారు భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించిందని పేర్కొంది. హార్ట్‌టెక్ ఈ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడిన ఈ ఎక్కారు లెవెల్ 2 ఏడీఏఎస్ (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం) వంటి అప్డేటెడ్ ఫీచర్లతో పాటు.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లను పొందుతుంది.

ఏడీఏఎస్ ఉండటం వల్ల.. సరికొత్త ఈ-విటారా ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హై-బీమ్ సిస్టం, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ ప్రయాణికులకు రక్షణ కల్పిస్తాయి.

వేరియంట్స్ & అంచనా ధర

ఈ-విటారా ధరలను మారుతి సుజుకి అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ధర రూ. 17 లక్షల నుంచి రూ. 22 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ధరలు లాంచ్ సమయంలో వెల్లడవుతాయి. కాగా ఇది డెల్టా, జీటా, ఆల్పా అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుందని సమాచారం. ఈ విషయంపై కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు.