Mumbai: బాధలు చెప్పుకోండి.. మీతోపాటు ఏడుస్తాను: ఫీజు ఇవ్వాలండోయ్!

Mumbai: మెట్రో నగరాల్లో పెరుగుతున్న ఒత్తిడి, ఒంటరితనం వంటి వాటికి పరిష్కారం అందించే దిశగా ఒక వ్యక్తికి ఒక ఐడియా వచ్చింది. ఈ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబైలో పృథ్విరాజ్ బోహ్రా అనే యువకుడు బీచ్ వద్ద కూర్చొని “మీ బాధలు వినడానికి నేను సిద్ధం” అంటూ ఒక బోర్డు పెట్టుకుని ప్రజలను ఆకర్షిస్తున్నాడు.

హిందీలో రాసిన బోర్డు ద్వారా “ఎవరైనా తమ బాధ చెప్పాలనుకుంటే నేను వినగలను” అని ప్రకటించిన అతను, దీనికి ఫీజు కూడా నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది. ఇది మానసిక ఆరోగ్యం, భావోద్వేగ మద్దతు వంటి అంశాలపై సమాజంలో ఉన్న అవసరాన్ని ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా నగరాల్లో ఒంటరితనం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశమైంది.

ఎంత ఛార్జ్ చేస్తున్నాడు?

పృథ్విరాజ్ బోహ్రా తన సేవలకు వేర్వేరు ధరలు నిర్ణయించాడు. చిన్న సమస్యలు వినడానికి రూ.250, పెద్ద సమస్యలకు రూ.500, అలాగే కలిసి కూర్చొని ఏడవాలనుకుంటే రూ.1000 వరకు ఛార్జ్ చేస్తున్నట్లు వీడియోలో వెల్లడించాడు. ఇక “నిజంగా ఎవరైనా వస్తారా?” అనే ప్రశ్నకు, అవును, వచ్చేవాళ్లు చాలామంది ఉన్నారని సమాధానం ఇచ్చాడు. ఇది ఈ సేవకు కొంత డిమాండ్ ఉన్నట్లు సూచిస్తోంది.

సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు అతని ఆలోచనను ప్రశంసిస్తూ, ఒత్తిడిలో ఉన్న వారికి ఇది ఉపయోగకరమని చెబుతున్నారు. మరికొందరు మాత్రం భావోద్వేగాలను వినడానికి డబ్బు తీసుకోవడం సరైంది కాదని విమర్శిస్తున్నారు. కొంతమంది దీనిని “కొత్త స్టార్టప్ ఐడియా”గా కూడా సరదాగా వ్యాఖ్యానించారు.

మానసిక ఆరోగ్యంపై చర్చ

నిపుణుల ప్రకారం.. ఈ ఘటన పెద్ద సమస్యను సూచిస్తోంది. ప్రస్తుతం నగరాల్లో ఒత్తిడి, ఒంటరితనం పెరుగుతుండటంతో ప్రజలు తమ భావాలను పంచుకోవడానికి అవకాశాలు తగ్గుతున్నాయి. చౌకగా అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య సేవలు లేకపోవడం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. దీంతో ఇలాంటి అనధికారిక మార్గాలు ప్రజలకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

విమర్శల ఇలా..

కొంతమంది ఈ సేవపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన నిపుణులు కాకుండా ఇలా సేవలు అందించడం వల్ల సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంకా కొన్ని వర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సహాయం ఉచితంగా అందుతుందని, నగరాల్లో మాత్రం బాధలకు కూడా ధర కట్టాల్సి వస్తోందని వ్యాఖ్యానిస్తున్నాయి.

పెరుగుతున్న మానసిక ఒత్తిడి

నిజానికి ఈ పోటీ ప్రపంచంలో మనిషి యంత్రంలా పనిచేస్తున్నాడు. ఓ వైపు ఆఫీస్ గోల, మరోవైపు కుటుంబం. ఇలా అన్ని బంధాల్లో చిక్కుకుని తన కష్టాన్ని, బాధను ఎవరితో చెప్పుకోవాలో తెలియక సతమతమైపోతున్నాడు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొందరు ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన అంశం ఏమిటంటే.. బాధలు వింటాను అని చెప్పడం మంచి విషయమే. దానికి డబ్బు వసూలు చేయడం అనేది కొత్తగా ఉంది. ఇది ఎంతవరకు సమంజసం అనేది పాఠకులే నిర్దారించాలి.