క్యాప్ జెమినీ సీఈవోతో లోకేష్ భేటీ.. 20వేల ఉద్యోగాలపై చర్చ!

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నంలో.. క్యాప్ జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఎజత్‌తో కీలక భేటీ అయ్యారు. విశాఖ నగరంలో సంస్థ పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఇరువురూ చర్చించారు. ముఖ్యంగా 20 వేల ఉద్యోగాలు కల్పించేలా ఐటీ డెవలప్మెంట్ సెంటర్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ సంస్థను కోరినట్లు సమాచారం. ఈ సమావేశం విశాఖలో ఐటీ రంగ విస్తరణకు కొత్త దారులు తీసుకురావచ్చని భావిస్తున్నారు.

అభివృధ్ధి కోసం ప్రణాళికలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత కొంతకాలంగా విశాఖపట్నంను ఐటీ మరియు టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఆసక్తి చూపుతుండగా, ఇప్పుడు Capgemini వంటి గ్లోబల్ సంస్థతో జరిగిన ఈ చర్చలు కీలకంగా మారాయి.

విశాఖలో భారీ ఐటీ పెట్టుబడులు వస్తే స్థానిక యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో పనిచేయాలనుకునే విద్యార్థులు, యువతకు ఇది పెద్ద అవకాశంగా భావిస్తున్నారు. అదేవిధంగా నగర అభివృద్ధి, రియల్ ఎస్టేట్, సేవల రంగం వంటి అనుబంధ రంగాలపై కూడా ఈ పెట్టుబడుల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

విశాఖలో ఐటీ పెట్టుబడులు

విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఎజత్‌తో మంత్రి లోకేశ్ సంస్థ భవిష్యత్ పెట్టుబడులపై చర్చించారు. ముఖ్యంగా నగరంలో ఐటీ డెవలప్మెంట్ సెంటర్‌తో పాటు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టులు అమలు అయితే దాదాపు 20 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ కేంద్రాలు సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, క్లౌడ్ టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి రంగాల్లో పనిచేసే అవకాశం ఉంది.

మధురవాడ ఐటీ పార్క్‌లో భూముల పరిశీలన

ఈ పెట్టుబడుల కోసం భూకేటాయింపుల అంశంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే మధురవాడ ఐటీ పార్క్‌లో 20 ఎకరాల భూమిని సంస్థ ప్రతినిధులు పరిశీలించినట్లు సమాచారం. అదేవిధంగా అడవివరం మరియు ఆనందపురం ప్రాంతాల్లో కూడా భూములను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతాలు ఐటీ పార్క్‌ల అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. మౌలిక సదుపాయాలు, రోడ్డు కనెక్టివిటీ, నగరానికి దగ్గరగా ఉండటం వంటి అంశాలు పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.

ఐటీ హబ్‌గా విశాఖ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని భవిష్యత్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలు ఐటీ కంపెనీలతో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో క్యాప్ జెమినీ వంటి ప్రపంచస్థాయి సంస్థలు పెట్టుబడులు పెట్టితే నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగే అవకాశం ఉంది.

అదేవిధంగా పెద్ద కంపెనీలు వస్తే చిన్న స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలు కూడా విశాఖ వైపు మొగ్గు చూపే అవకాశముందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. దీంతో నగర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావచ్చు. ఇక ఈ సమావేశం తరువాత సంస్థ ప్రతినిధులు భూముల పరిశీలన పూర్తి చేసి, పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పెట్టుబడులు ఖరారైతే విశాఖలో ఐటీ రంగం కొత్త దశలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Also Read: ఐటీ కంపెనీలను తాకిన గ్యాస్ సిలిండర్ కొరత.. అమల్లోకి WFH