కొత్త ఏడాది సెల్టోస్ ధరలు వెల్లడించిన కియా ఇండియా: పూర్తి వివరాలు

2026 మొదలైన వెంటనే కియా ఇండియా.. భారతదేశంలో కొత్త సెల్టోస్ కారు ధరలను వెల్లడించింది. ఇప్పటికీ ఈ కారును మార్కెట్లో ఆవిష్కరించిన కంపెనీ.. డిసెంబర్ 11 నుంచి రూ. 25,000లతో బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టింది. కాబట్టి డెలివరీలు ఈ నెల మధ్య నుంచి ప్రారంభమవుతాయని సంస్థ వెల్లడించింది.

వేరియంట్స్.. ధరలు

కొత్త కియా సెల్టోస్ కారు 5 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి హెచ్‌టీఈ, హెచ్‌టీకే, హెచ్‌టీఎక్స్, జీటీఎక్స్, ఎక్స్-లైన్. ఇందులో హెచ్‌టీఈ (రూ. 10.99 లక్షలు) బేస్ మోడల్ కాగా.. ఎక్స్-లైన్ (రూ. 19.99 లక్షలు) టాప్ ఎండ్ మోడల్. ధరలు ఎంచుకునే వేరియంట్, ఇంజిన్ ఎంపికల మీద ఆధారపడి ఉంటాయి.

కియా సెల్టోన్ లేటెస్ట్ డిజైన్

మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కియా సెల్టోస్ కారు.. కొత్త డిజైన్ పొందుతుంది. కాబట్టి ఇది రిఫ్రెస్డ్ ఫ్రంట్ డిజైన్ కలిగి ఉంది. టైగర్ నోస్ గ్రిల్, నిలువుగా ఉన్న లైటింగ్ సెటప్ వంటి వాటితో పాటు.. ఇది 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుతుంది. రియర్ ప్రొఫైల్ కనెక్టెడ్ టెయిల్‌లైట్‌లతో.. టెయిల్‌గేట్ డిజైన్ కలిగి ఉంది. ముందు, వెనుక ఉన్న బంపర్లు.. గన్‌మెటల్ ఫినిష్డ్ స్కిడ్ ప్లేట్స్ పొందింది.

ఇంటీరియర్ డిజైన్ విషయానికి వస్తే.. క్యాబిన్ డ్యూయెల్ టోన్ కలిగి, లెదర్ అపోల్స్ట్రే పొందుతుంది. అప్డేటెడ్ డ్యాష్‌బోర్డ్, ప్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, సింగిల్ కర్వ్డ్ డిస్‌ప్లే, 30 ఇంచెస్ ఇంటిగ్రేటెడ్ డ్యూయెల్ స్క్రీన్ సెటప్ వంటివి ఉన్నాయి. వివిధ ఫంక్షన్స్ కోసం.. ఫిజికల్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి.

పరిమాణం (డైమెన్షన్)

కియా సెల్టోస్ కారు.. కే3 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడి ఉంది. కాబట్టి ఇది కొంత పొడవుగా ఉంది. దీని పొడవును 4460 మిమీ, వెడల్పు 1830 మిమీ, ఎత్తు 1635 మిమీ, వీల్‌బేస్ 2690 మిమీ వరకు ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. ఇది దాని విభాగంలో పెద్ద కారుగా ఉంది.

ఫీచర్స్ గురించి వివరంగా

కియా సెల్టోస్ డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, హెడ్స్ అప్ డిస్‌ప్లే వంటి వాటితో పాటు.. పవర్డ్ డ్రైవర్ సీటు, ఎనిమిది స్పీకర్లు, యాంబియంట్ లైటింగ్, రియర్ రిక్లైనింగ్ సీట్లు మొదలైన ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి.

సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే.. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, అన్ని చక్రాలకు డిస్క్ బ్రేక్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఓవర్ ది ఎయిర్ అప్‌డేట్‌లతో కూడిన రిమోట్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ వివరాలు

కొత్త కియా సెల్టోస్ కారు 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115 హార్స్ పవర్, 144 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ( ఇంజిన్ 160 హార్స్ పవర్, 253 ఎన్ఎమ్ టార్క్), 1.5 లీటర్ డీజిల్ (116 హార్స్ పవర్, 250 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్ ఎంపికలలో లభిస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్, డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ వంటివి ఉన్నాయి.