భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. తమ ఎలక్ట్రిక్ వాహన విభాగాన్ని విస్తరించడంతో భాగంగా, మరో కొత్త కారును మార్కెట్లో లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కారు పేరు ‘ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ‘. ఈ లేటెస్ట్ మోడల్ ధర, ఫీచర్స్, రేంజ్ వంటి వివరాలను ఇక్కడ చూసేద్దాం.
వేరియంట్స్ & ధరలు
మహీంద్రా కంపెనీ లాంచ్ చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారు ఏఎక్స్5, ఏఎక్స్7ఎల్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.89 లక్షలు, రూ. 14.96 లక్షలు (ఎక్స్ షోరూమ్). అయితే కొనుగోలుదారులు 7.2 కిలోవాట్ ఏసీ ఛార్జర్ కోసం అదనంగా రూ. 50వేలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా దీని డెలివరీలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతాయి.
రేంజ్ (పరిధి) ఎంతంటే
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ 39.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో 150 హార్స్ పవర్, 310 ఎన్ఎమ్ టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. కంపెనీ ఈ కారు ఎంత దూరం ప్రయాణిస్తుందో (ఒక ఫుల్ ఛార్జితో) వెల్లడించలేదు. కానీ ఇది 285 కిమీ రేంజ్ అందిస్తుందని భావిస్తున్నారు.
8.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అయ్యే మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారు.. ఫన్, ఫాస్ట్, ఫియర్‌లెస్ అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది. ఇది 50కేడబ్ల్యు డీసీ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ కావడానికి పట్టే సమయం 50 నిముషాలు మాత్రమే.
డిజైన్ & ఫీచర్స్ విషయానికి వస్తే..
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారు.. చూడటానికి కొంత ఎక్స్‌యూవీ400 మాదిరిగా అనిపిస్తుంది. అయితే పరిమాణంలో దీనికంటే కొంత చిన్నదే. ఇది 4 మీటర్ల పొడవు ఉంటుంది, బూట్ స్పేస్ 378 లీటర్ల కంటే తక్కువ. ఎక్స్‌యూవీ400 కారు 4.2 మీటర్ల పొడవు ఉంటుంది.
ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారు.. ఫ్రంట్ బంపర్ కొంత భిన్నంగా ఉంటుంది. అల్లాయ్ వీల్స్, లైటింగ్ సిగ్నేచర్‌లతో సహా సాధారణ 3ఎక్స్ఓ కారును తలపిస్తుంది. లోపలి డిజైన్ కూడా దాదాపు అలాగే ఉంటుంది. సెంటర్ కన్సోల్, ఏసీ వెంట్స్ చుట్టూ బ్రాంజ్ కలర్ హైలెట్స్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ మీద ఇదే కలర్ లోగో చూడవచ్చు.
ఫీచర్స్ విషయానికి వస్తే.. 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారులో ఇన్ఫోటైన్‌మెంట్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం రెండు 10.25 అంగుళాల స్క్రీన్స్ ఉంటాయి. వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎల్ఈడీ లైటింగ్స్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి. టాప్ వేరియంట్ పనోరమిక్ సన్‌రూఫ్, 7 స్పీకర్ హర్మాన్ కార్టాన్ ఆడియో సిస్టంతో పాటు ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.
పోటీదారులు
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఎలక్ట్రిక్ కారు.. ఇండియన్ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. ఎందుకంటే దీని ధరలు రూ. 12.45 లక్షల నుంచి రూ. 17.29 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. అంతే కాకుండా అది రెండు బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. అయితే దీని రేంజ్ 465 కిమీ కావడం విశేషం. ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ కారు రేంజ్ అధికారికంగా తెలియల్సి ఉంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.