బీహార్ ఎన్నికల ఫలితాల తరువాత.. కర్ణాటక రాజకీయాల్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ త్వరలోనే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ అధికారాలను వేరే వ్యక్తులకు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు!
నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు స్వీకరించాను, మార్చి నాటికి ఆరేళ్లు పూర్తవుతాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మనం తరువాత వాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలి. పదవిలో ఉన్నా.. లేకున్నా.. పార్టీకి సేవచేసే విషయంలో మాత్రం తాను ముందు వరుసలో ఉంటానని పేర్కొన్నారు.
పార్టీ కోసం ముందుంటాను!
నా పదవీ కాలంలో రాష్ట్రంలో 100 కాంగ్రెస్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆశించాను. అంతే కాకుండా నేను ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడే.. కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు వదులుకోవాలని అనుకున్నాను. కానీ రాహుల్ గాంధీ, మల్లికార్జున్ కర్గే.. నన్ను కొనసాగమని కోరారు. దీంతో పదవిలో కొనసాగాను. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం తాను ఎప్పుడూ కృషి చేస్తానని, ఈ విషయంలో తాను ముందు వరుసలో ఉంటానని పేర్కొన్నారు.
సీఎం విషయంలో మార్పు?
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్య.. తానే పూర్తికాలం (ఐదేళ్లు) సీఎంగా ఉండేందుకు అవకాశం ఇవ్వాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కర్గేలను కోరారు. తరువాత రాబోయే ఎన్నికల్లో గెలుపొందిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని సూచించారు.
2023లో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు సీఎం పదవికి డీకే శివకుమార్, సిద్దరామయ్య నువ్వా.. నేనా అంటూ పోటీపడ్డారు. ఆ తరువాత అధిష్టానం సూచన మేరకు సిద్దరామయ్య సీఎం బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ సమయంలోనే చెరో రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించండని అధిష్టానం చెప్పినట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఆ ఫార్ములాను పాటిస్తారా?, లేదా? అనెది తెలియాల్సి ఉంది.
విభేదాలకు చెక్!
డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య విభేదాలు ఉన్నాయని రాష్ట్రంలో గుసగుసలు చాన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. కానీ అదంతా ఒట్టిదే అనే మైసూరులో జరిగిన ఒక కార్యక్రమంలో తేల్చేశారు. ఈ కార్యక్రమంలో చేతులు పట్టుకుని ఒకరినొకరు ప్రశంసించుకున్నారు. మన ప్రభుత్వం ఇంకా చాలా సంవత్సరాలుగా ఇలాగే ముందుకు సాగుతుంది, రాబోయేది కూడా తమ ప్రభుత్వమే అని అన్నారు.
దేశంలో కాంగ్రెస్
ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ తన హవా చూపించింది. దీంతో కాంగ్రెస్ పరాభవం చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కొంత పటిష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు జరుగుతాయో మనం కచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలి. కాగా ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీహార్ ఎన్నికల్లో ఓటమి చూసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదొక చిన్న ఊరడింపు అని తెలుస్తోంది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.