Royal Enfield Flying Flea C6 Electric Bike: బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ వంటి అనేక కంపెనీల దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లాంచ్ చేశాయి. అయితే దశాబ్దాల చరిత్ర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రం ఇన్ని రోజులూ నిమ్మకు నీరెత్తినట్లు.. ఉలుకు పలుకు లేకుండా నిశ్చలంగా ఉండిపోయింది. ఇప్పుడు తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్వి చక్ర వాహన విభాగంలో అడుగు పెట్టింది. ఓ అద్భుతమైన బైక్ లాంచ్ చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ప్లీ సీ6 (Royal Enfield Flying Flea C6)
ఎంతోమంది వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైక్ అధికారికంగా ప్రదర్శించబడింది. ఈ బైక్ 2026 నాటికి మార్కెట్లో లాంచ్ అవుతుందని సమాచారం. ఈ కొత్త బైక్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అభివృద్ధి చేసిన లైట్ వెయిట్ బైక్ నుంచి ప్రేరణ పొందింది. కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ పేరు ‘ప్లయింగ్ ఫ్లీ సీ6’ (Flying Flea C6).
డిజైన్
మార్కెట్లో అడుగుపెట్టనున్న మొట్ట మొదటి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ ప్లయింగ్ ఫ్లీ సీ6 సింపుల్ డిజైన్ కలిగి.. ఆకర్షణీయంగా ఉంది. ఇది గిర్డర్ స్టైల్ ఫోర్క్ (ఇది 1930 మరియు 1940లలో ప్రసిద్ధి చెందిన సస్పెన్షన్ ఫార్మాట్) కలిగి ఉంది. సన్నగా కనిపించే సీ6 అల్యూమినియం ఫ్రేమ్, రిబ్బెడ్ మెగ్నీషియం బ్యాటరీ ప్యాక్, సింగిల్ పీస్ సీట్ వంటివి పొందుతుంది.
సింగిల్ పీస్ సీటు కనిపిస్తున్నప్పటికీ.. పిలియన్ కోసం మరో సీటును కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ బైక్ టర్న్ ఇండికేటర్స్, టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ మరియు రౌండ్ హెడ్‌లైట్, టెయిల్ లైట్ వంటి వాటిని పొందుతుంది. 10 స్పోక్ అల్లాయ్ వీల్స్ కలిగిన ఈ బైక్ బెల్ట్ ఫైనల్ డ్రైవ్‌తో మిడ్ మౌంటెడ్ పర్మనెంట్ మాగ్నెట్ మోటారును పొందుతుంది.
ఫీచర్స్
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్.. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి వాటితో పాటు రివర్, సిటీ మరియు పర్ఫామెన్స్ వంటి ఐదు రైడింగ్ మోడ్స్ పొందుతుంది. కంపెనీ ఈ బైక్ రేంజ్ మరియు ధరలను గురించి అధికారికంగా వెల్లడించలేదు. ఇవన్నీ లాంచ్ సమయంలో వెల్లడవుతాయని భావిస్తున్నాము.
అంచనా ధర & రేంజ్
కంపెనీ లాంచ్ చేయనున్న ప్లయింగ్ ఫ్లీ సీ6 ఎలక్ట్రిక్ బైక్ ధర రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. రేంజ్ విషయానికి వస్తే.. సింగిల్ చార్జితో 150 కిమీ కంటే ఎక్కువ రేంజ్ అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ధర మరియు రేంజ్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. ఇవన్నీ కేవలం అంచనా మాత్రమే.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ మంచి ఆదరణ పొందుతుందా!
నిజానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్ బైకులకు ప్రపంచ మార్కెట్లో ఓ ప్రత్యేక డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు కంపెనీ లాంచ్ చేసిన అన్ని బైకులు అత్యుత్తమ అమ్మకాలను పొందుతూ అధిక ప్రజాదరణ పొందాయి. అయితే అవన్నీ పెట్రోల్ బైకులు. కానీ కంపెనీ ఇప్పుడు మొదటిసారి ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసింది. ఎలక్ట్రిక్ బైక్ అంటే సౌండ్ చేయకుండా వెళ్తుంది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది స్పష్టంగా చెప్పలేము.
Don’t Miss: అగ్రరాజ్యంలో ఎలక్షన్స్.. గెలిచినోళ్లకే ‘ది బీస్ట్’: దీని ప్రత్యేకతలేంటో తెలుసా?
డుగ్.. డుగ్ అనే సౌండ్ కోసమే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు కొనేవారు ఇప్పటికీ చాలామంది ఉన్నారంటే.. ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అలాంటిది సౌండ్ లేని రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే.. ఒహ్హ్యించుకోవడానికే కొంత వింతగా ఉంది. సౌండ్ వద్దనుకునే వాళ్ళు లేదా రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క కొత్త బైక్ కావాలనుకునే వాళ్ళు ఈ బైకును కొనుగోలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నాము.