సాధారణంగా కొత్త వాహనాలు (కారు లేదా బైక్) కొనుగోలు చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. కానీ పాత వాహనం లేదా సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు చాగేసినప్పుడు లేదా అమ్మినప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఊహకందని ఇబ్బందుల్లో లేదా సమస్యల్లో పడతారు.
విక్రేత/కొనుగోలుదారుకు సూచనలు
ఉపయోగించిన కారును కొనుగోలు చేసినప్పుడు లేదా అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అందించాలి. దీనికోసం కొనుగోలుదారు, విక్రేత ఇద్దరూ కలిసి డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. అవసరమైన ఫారమ్‌లను సిద్ధం చేసుకోవాలి. విక్రయించే వ్యక్తి వాహనానికి కారుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, బీమా పత్రాలు, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి వాటితో పాటు విక్రేతకు సంబంధించిన చిరునామా వివరాలను అందించాలి. కొనుగోలుదారు కూడా తనకు సంబంధించిన వివరాలను విక్రేతకు ఇవ్వాలి. సంబంధిత డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించిన తరువాత.. కొత్త రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తుంది.
ఈ ఫారమ్స్ పూరించాలి
కారు కొనుగోలుదారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందటానికి.. ఆర్టీఓ లేదా పరివాహన్ వెబ్సైట్ నుంచి ఫారం 29, ఫారం 30 వంటివి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళా ఇతర రాష్ట్రాలకు బదిలీ అవ్వాలంటే.. ఆర్టీఓ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేదా ఎన్ఓసీ పొందాలి. దీనికోసం ఫారం 28 అవసరమవుతుంది. ఒకవేళా కారుపై లోన్ వంటివి ఉంటే.. విక్రేత వాటిని తీర్చేయాలి. లేకుంటే.. దాని ఎఫెక్ట్ కొనుగోలుదారుపై పడుతుంది.
అవసరమైన డాక్యుమెంట్స్
విక్రేత ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, చెల్లుబాటు అయ్యే బీమా, చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి డాక్యుమెంట్స్ విక్రేతకు అందించాలి. అదే సమయంలో విక్రేత తన చిరునామాతో పాటు.. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను అందించాలి. ఇద్దరు వ్యక్తులూ అవసరమైన డాక్యుమెంట్స్ ఫిల్ చేసి ఆర్టీఓకు సమర్పిస్తే.. ఓనర్షిప్ మారుస్తారు. ఆర్టీఓ ఆ సమయంలోనే ఆ కారుపై ఏమైనా చలాన్స్, కేసులు ఉన్నాయేమో అని చెక్ చేస్తుంది. ఇలా అన్నీ పగడ్బందీగా చూసి.. పాత కారును కొనుగోలు చేసినప్పటికీ.. ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదు.
ఇవి చేయకుంటే.. సమస్యలకు ఆహ్వానం!
రిజిస్ట్రేషన్ సరిఫికేట్ మార్చకుండానే.. విక్రేత నుంచి కొనుగోలుదారు కొనుగోలు చేసే సంఘటనలు కోకొల్లలు. దీనికి కారణం నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యమే అనుకోని సమస్యలోకి నెడుతుంది. విక్రేత తన కారును లేదా బైకును.. ఎవరికైనా విక్రయించాడు అనుకున్నారనుకోండి. ఆ వ్యక్తి ఏదైనా సంఘ విద్రోహ కార్యకలాపాలను ఆ వాహనాలను ఉపయోగిస్తే?, ఆ ప్రభావం అసలైన ఓనర్ మీద పడే అవకాశం తప్పకుండా ఉంది. నిజానికి జరిగిన సమస్యకు అసలైన యజమానికి.. విద్రోహ కార్యకలాపాల్లో ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఓనర్షిప్ మార్చకపోవడంతో.. సమస్యల్లో ఇరుక్కుంటాడు.
ఢిల్లీ ఘటన
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో హ్యుందాయ్ ఐ20 కారు పేలిపోయింది. నిజానికి ఆ కారును 2013లో సల్మాన్ అనే వ్యక్తి కొనుగోలు చేశారు. ఆ తరువాత కాలంలో దానిని అతడు వేరే వాళ్లకు అమ్మేశాడు. ఆ వ్యక్తి కూడా దానిని ఇంకొకరికి విక్రయించాడు. ఇలా చాలామంది చేతులు మారినప్పటికీ.. ఆ హ్యుందాయ్ ఐ20 కారు రిజిస్ట్రేషన్ అసలైన ఓనర్ పేరు మీదనే ఉంది. కాబట్టి ఢిల్లీ ఘటన కారణంగా సల్మాన్ కూడా ఇబ్బందుల్లో పడ్డాడు. కాబట్టి కార్లను విక్రయించే వాళ్లు దీనిని తప్పకుండా మనసులో ఉంచుకోవాలి. తప్పకుండా ఓనర్షిప్ బదిలీ చేసేయాలి.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.