Skill Development for Youth: ప్రస్తుతం భారతదేశంలో విద్యావ్యవస్థపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడికల్ వంటి సంప్రదాయ కోర్సులపై యువత ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అయితే, ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత కూడా ఉద్యోగాలు అందరికీ లభించడం లేదు. దీంతో నైపుణ్యాభివృద్ధి (Skill Development) పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా యువతను స్కిల్ బేస్డ్ ట్రైనింగ్ వైపు మళ్లించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమాల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అవగాహన పెరగాలి
ప్రస్తుత కాలంలో కేవలం డిగ్రీలతో ఉద్యోగం పొందడం కష్టమవుతోంది. కంపెనీలు కూడా నైపుణ్యాలను (Skills) ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో యువతలో స్కిల్ డెవలప్మెంట్ మీద అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఈ దిశగా యువతను ప్రేరేపించేలా ఉన్నాయి. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఈ సందేశం మరింత ఉపయోగపడుతుంది.
నైపుణ్యాల ప్రాధాన్యంపై సూచనలు
సిద్దిపేటలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. డ్రైవింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, ఏసీ టెక్నీషియన్, బ్యూటీ పార్లర్ వంటి పనులు నేర్చుకుంటే మంచి ఆదాయం పొందవచ్చని చెప్పారు. ఈ పనులకు అధిక విద్య అవసరం లేదని, సరైన శిక్షణ ఉంటే సరిపోతుందని తెలిపారు. అంతే కాకుండా.. 12వ తరగతి వరకు చదివి కనీసం మూడు భాషలు నేర్చుకోవాలని సూచించారు. భాషా నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని అన్నారు.
ATC, పాలిటెక్నిక్ కోర్సుల ప్రాముఖ్యత
రేవంత్ రెడ్డి ATC (Apprenticeship Training Centers) మరియు పాలిటెక్నిక్ కోర్సులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని యువతకు సూచించారు. ఈ కోర్సులు పూర్తయ్యే సరికి పరిశ్రమల అవసరాలకు సరిపోయే నైపుణ్యాలు వస్తాయని, అందువల్ల ఉద్యోగం సులభంగా లభించే అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఇటీవల కాలంలో పరిశ్రమలు కూడా ప్రాక్టికల్ నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులను ఎక్కువగా ఎంపిక చేస్తున్నాయి. దీంతో పాలిటెక్నిక్, ఐటీఐ వంటి కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది.
యువతలో మార్పు అవసరం
డిగ్రీలు మాత్రమే భవిష్యత్తుకు గ్యారంటీ కాదని సీఎం స్పష్టం చేశారు. యువత తమ ఆసక్తులు, నైపుణ్యాలను గుర్తించి వాటిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. సంప్రదాయ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా, కొత్త అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కేవలం ఉద్యోగాల కోణంలో మాత్రమే కాకుండా, స్వయం ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. చిన్న వ్యాపారాలు, సేవా రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ముందుగా తెలుసుకోవాలి!
డిగ్రీవరకు చదవగలిగిన వాళ్లు చదివి మరింత మంచి ఉద్యోగాలు కూడా తెచ్చుకోవచ్చు. డిగ్రీ అనేది కేవలం ఒక అర్హత. ఆ తరువాత నువ్వు ఎలాంటి ఉద్యోగానికి సిద్దమవుతావు?, దానికి ఎలాంటి ప్రణాళిక రచించాలి? దాని కోసం ఏమి చేయాలనే విషయాలను కూడా యువత ముందుగా తెలుసుకోవాలి.
Also read:Telangana: విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్.. పబ్లిక్ స్కూళ్లపై ప్రభుత్వం ఫోకస్!
న్యూస్, మీడియా రంగంలో 12 సంవత్సరాల అనుభవం గల సీనియర్ ప్రొఫెషనల్. అనేక ప్రసిద్ధ తెలుగు టీవీ చానెల్స్‌లో పని చేశారు. ఇప్పటివరకు అనేక వ్యాసాలు, కథనాలు, అలాగే డిజిటల్ కంటెంట్ రచనలు చేయడంలో విశేష అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం ఉన్న మహేష్, క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగిన వ్యక్తి.