చెక్ రిపబ్లిక్ కార్ల తయారీ సంస్థ స్కోడా.. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థల్లో ఒకటి. ఒకప్పుడు గొప్ప అమ్మకాలతో.. ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇచ్చిన ఈ కంపెనీ ప్రస్తుతం కొంత డీలా పడినట్లు తెలుస్తోంది. అయితే స్కోడా.. ఇండియన్ మార్కెట్లో పూర్వ వైభవం పొందటానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ.. తన పర్ఫామెన్స్ ఐకాన్ ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్ చేయడానికి సన్నద్ధమైంది.
అక్టోబర్ 17న లాంచ్
స్కోడా పాపులర్ మోడల్.. ఆక్టావియా ఆర్ఎస్ మోడల్ అక్టోబర్ 17న అధికారికంగా మళ్ళీ లాంచ్ కానుంది. కాగా అంతకంటే ముందు.. అక్టోబర్ 6న కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం మొదలుపెట్టనుంది. దీనికి సంస్థ కంప్లీట్ బిల్డ్ యూనిట్ (సీబీయూ)గా దేశానికి పరిమిత సంఖ్యలో (100 యూనిట్లు) దిగుమతి చేసుకుంటుంది.
ధర రూ. 50 లక్షలు!
నిజానికి స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ కారు సుమారు 20ఏళ్లు భారతదేశంలో గొప్ప ఆదరణ పొందింది. 2004లో మొదటిసారి టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ప్యాసింజర్ కారుగా మార్కెట్లో అడుగుపెట్టింది. ఇప్పుడు మళ్ళీ 2025 మోడల్ రూపంలో అప్డేటెడ్ ఫీచర్స్, డిజైన్ పొందనున్నట్లు సమాచారం. దీని ధర రూ. 50 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుందని సమాచారం.
2025 స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 216 హార్స్ పవర్, 370 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ద్వారా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇది 6.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ 250 కిమీ/గం. ఇందులో స్టాండర్డ్ మోడల్‌కు భిన్నంగా ఉండే.. ఎగ్జాస్ట్ సిస్టం పొందుతుంది.
డిజైన్ & ఫీచర్స్
త్వరలో లాంచ్ కానున్న స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లైట్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్ప్ లైన్‌లతో కూడిన డిజైన్ పొందుతుంది. అద్భుతమైన ఇంటీరియర్ కలిగి ఉండనున్న ఈ కారు.. స్పోర్ట్స్ సీట్లు, 13 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం వంటివాటిని పొందుతుంది.
స్కోడా ఆక్టావియా ఆర్ఎస్ భారతదేశానికి తిరిగి రావడానికి సంబంధించి.. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సంవత్సరం ప్రారంభంలో.. మేము భారతదేశానికి ఒక ఐకానిక్ మోడల్ తీసుకువస్తామని హామీ ఇచ్చాము. అన్నట్టుగానే వచ్చే నెలలో ఆక్టావియా ఆర్ఎస్ లాంచ్ చేయడానికి సిద్దమయ్యాము. ప్రపంచ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన ఈ కారు.. మళ్ళీ భారతదేశంలో పూర్వ వైభవం పొందుతుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.
భారతదేశంలోని స్కోడా కార్లు
స్కోడా కంపెనీ భారతదేశంలో ప్రస్తుతం నాలుగు మోడల్స్ మాత్రమే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అవి స్కోడా కైలాక్ (రూ.7.55 లక్షల నుంచి రూ. 12.80 లక్షలు, ఎక్స్ షోరూమ్), స్కోడా స్లావియా (రూ. 10 లక్షల నుంచి రూ. 17.70 లక్షలు, ఎక్స్ షోరూమ్), స్కోడా కుషాక్ (రూ. 10.61 లక్షల నుంచి రూ. 18.43 లక్షలు, ఎక్స్ షోరూమ్), స్కోడా కొడియాక్ (రూ. 39.99 లక్షల నుంచి రూ. 45.96 లక్షలు, ఎక్స్ షోరూమ్). కాగా ఈ జాబితాలోకి త్వరలోనే స్కోడా ఆక్టావియా అడుగుపెట్టనుంది.