Thursday, February 5, 2026

15 ఏళ్ల క్రితమే మహేశ్‌తో సినిమా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి

దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా తీసినా బ్లాక్ బస్టర్ ఖాయమే. ఈ విషయం సినీ ఇండస్ట్రీలోని అందరికి తెలుసు. ఇప్పటివరకు ఈయన తెరకెక్కించిన అన్ని సినిమాలు గొప్ప సక్సెస్ సాధించాయి. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

సినిమా ఒక భాగం మాత్రమే

ఇప్పటికే వారణాసి సినిమా టైటిల్ పరిచయం చేసినప్పుడు.. ఓ పెద్ద కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను రాజమౌళి వెల్లడించారు. బాహుబలి సినిమా మాదిరిగా.. మొదటి, రెండు భాగాలుగా సినిమా ఉంటుందని కొన్ని పుకార్లు తెరకెక్కాయి. కానీ వారణాసి సినిమా ఓకే పార్ట్ ఉంటుందని డైరెక్టర్ చెప్పారు. అయితే సినిమా నిడివి మూడు గంటల కంటే ఎక్కువ ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు.

15 ఏళ్లకు ముందే చెప్పాను

నిజానికి 15 సంవత్సరాలకు ముందే మహేష్ బాబుతో సినిమా తీయనున్నట్లు తాను చెప్పినట్లు రాజమౌళి చెప్పారు. అయితే ఆలస్యానికి కారణం కొన్ని సినిమాలు తెరకెక్కించే పనిలో బిజీ అయిపోవడమే అని కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా కొంతమేర జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాలకంటే కూడా వారణాసి చాలా భిన్నంగా ఉంటుందని అన్నారు. రామాయణ కాలం నాటి ఘట్టాలు ఇందులో చూపించనున్నట్లు వెల్లడించారు. సినిమాలు 25 నిమిషాల పాటు రామాయణ కాలం నాటి సన్నివేశాలు ఉంటాయని అన్నారు.

రిలీజ్ ఎప్పుడంటే?

సినిమా కథ, నేపథ్యం వంటి చాలా విషయాలను రాజమౌళి వెల్లడించలేదు. అయితే ఈ సినిమా 2027లో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఏ నెలలో రిలీజ్ చేయనున్నారు అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సినిమా రంగంలో మాత్రమే కాకుండా.. మహేష్ బాబు అభిమానుల్లో కూడా ఉత్కంఠ మొదలైంది.

మహేష్ బాబు ఏమన్నారంటే..

చాలా సంవత్సరాల క్రితమే రాజమౌళి తనతో సినిమా తీస్తానని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత నాకు చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కోసం నేను చాలా మారాల్సి వచ్చింది. పరుగెత్తే విధానంలో, నిలబడే విధానంలో కూడా చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఒక సన్నివేశంలో తాను రాముడిగా కనిపించనున్నట్లు మహేష్ బాబు చెప్పారు. పురాణాలు, సాహసం మొదలైనవన్నీ ఈ సినిమాలో కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాలో నేను నటించలేదని ఆయన పేర్కొన్నారు.

వారణాసి సినిమా షూటింగ్ తొలి షాట్ పూర్తయ్యే వరకు కొంచెం భయంగానే ఉన్నట్లు మహేష్ బాబు చెప్పారు. అయితే షూటింగ్ ప్రారంభమైన తరువాత ఎలాంటి భయం లేదని అన్నారు. సినిమాలోని ప్రతి చిన్న సన్నివేశంపైన రాజమౌళి ప్రత్యేక శ్రద్ద చూపిస్తారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

ప్రియాంక చోప్రా ఏమన్నారంటే..

వారణాసి సినిమాలో కథానాయకిగా నటిస్తున్న ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. తాను చాలా రోజుల తరువాత ఇండియన్ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు. చాలా సంవత్సరాల తరువాత భారతీయ సినిమాలో నటిస్తుండటం వల్ల.. మంచి పాట ఉండేలా చూడాలని రాజమౌళిని అడిగినట్లు పేర్కొన్నారు. రాజమౌళి కూడా వారణాసి సినిమాలో చాలా పాటలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక సాంగ్ పూర్తయింది. అది నాకు చాలా ఇష్టమైన పాట. ఇప్పటికీ నేను ఆ పాటను పాడుకుంటూనే ఉంటానని ప్రియాంక చోప్రా వెల్లడించారు. కాగా అంటార్కిటికాలో కూడా త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది. దీనికోసం చిత్ర బృందం సన్నద్ధమవుతోందని కూడా పేర్కొన్నారు.

Uma Siri
Uma Sirihttps://marthatelugu.com/
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.