25వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు: అర్హత, ఫీజు, జీతం వివరాలు

చదువు పూర్తి చేసినవారు ఎవరైనా ఉద్యోగం కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికి స్టాప్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) శుభవార్త చెప్పింది. ఏకంగా 25487 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగానికి కావలసిన క్వాలిఫికేషన్ ఏమిటి?, ఎలా అప్లై చేసుకోవాలి?, ఎంపిక విధానం ఏమిటి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎస్‌ఎస్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 25487 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఎస్ఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ మొదలైనవి విభాగాలు ఉన్నాయి.

అర్హతలు

  • ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పకుండా భారతీయ పౌరులై ఉండాలి.
  • గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.
  • ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి కొంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.
  • ఎస్‌ఎస్‌సీ నిర్ణయించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
  • 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలు ఉండాలి. (వయసు సడలింపు కూడా ఉంటుంది. అయితే ఇది కేటగిరి మీద ఆధారపడి ఉంటుంది.)

అప్లికేషన్ ఫీజు & ఎంపిక విధానం, జీతం వివరాలు

ఎస్‌ఎస్‌సీ విడుదల చేసిన ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు (జనరల్, ఈడబ్ల్యుఎస్, ఓబీసీ అభ్యర్థులు) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్స్, మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించకుండానే అప్లై చేసుకోవచ్చు. అంటే వీటికి ఉచితం అన్నమాట.

ఎంపిక విధానం విషయానికి వస్తే.. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఉంటాయి. చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే.. కఠినమైన రాత పరీక్షలు ఉండవని అర్థమవుతోంది.

ఇక జీతం విషయానికి వస్తే.. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు జీతం నెలకు రూ. 21700 నుంచి రూ. 69100 వరకు ఉంటుంది. జీతంతో పాటు హెచ్ఆర్ఏ, టీఏ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.

అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్

ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఆధార్ కార్డు, 10వ తరగతి మార్క్స్ కార్డు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, క్యాస్ట్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అవసరం అవుతాయి. ఈ ఉద్యోగానికి స్త్రీ, పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలంటే

  • ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసి, రిజిస్ట్రేషన్ నౌ మీద క్లిక్ చేసి.. రిజిస్టర్ చేసుకోవాలి.
  • రిజిస్టర్ చేసుకున్న తరువాత లాగిన్ అవ్వాలి. తరువాత ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్ 2026 లింక్ ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అయిన తరువాత, మీకు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయాలి. ఇవన్నీ పూర్తి చేసిన తరువాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తరువాత.. అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తరువాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.

అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్

ఇప్పటికే ఈ ఉద్యోగానికి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 1 (2025 డిసెంబర్ 1) నుంచే ప్రారంభమైంది. ఆఖరు తేదీ డిసెంబర్ 31 (2025 డిసెంబర్ 31)గా నిర్ణయించారు. అంటే అభ్యర్థులు ఈ గడువు లోపల అప్లై చేసుకోవాలి. కేంద్ర బలగాలలో ఉద్యోగం కోసం వేచి చూస్తున్నవారికి ఇది ఓ మంచి అవకాశం అనే చెప్పాలి.