2026 మేడారం జాతర: తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన ‘మేడారం జాతర‘ వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరుగుతుంది. రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ సర్కార్ భారీ బడ్జెట్ కేటాయించినట్లు కీలక ప్రకటన చేసింది. ఈ ఏటా జాతరను మరింత గొప్పగా జరపాలని సంకల్పించింది.

మేడారం జాతరకు రూ.150 కోట్లు

తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 150 కోట్లు కేటాయించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, మంచినీటి వసతి, విద్యుత్ మరియు పారిశుధ్యం కోసం దీనిని కేటాయించనున్నట్లు సమాచారం. జాతరకు భారీ మొత్తంలో నిధులను కేటాయించడం పట్ల గిరిజన శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్.. సీఎం రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గిరిజనుల గౌరవానికి నిదర్శనం. మేడారం మహా జాతరకు ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయించడం అనేది.. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాల పట్ల నిబద్ధతను తెలియజేస్తుందని మంత్రి సీతక్క స్పష్టం చేసింది.

మేడారం జాతర

తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు సుమారు కోటి మంది కంటే ఎక్కువ జనాభా హాజరవుతారని అంచనా. భారతదేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే మహా కుంభమేళాకు లెక్కకు మించిన జనం హాజరవుతారు. కుంభమేళా తరువాత అత్యధిక జనాభా ఈ మేడారం జాతర లేదా తెలంగాణ కుంభమేళాకు హాజరవుతారు.

మేడారం జాతర విశేషాలు

తెలంగాణలోని ములుగు జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే గిరిజన జాతరను.. సమ్మక్క సారలమ్మ జాతర అని కూడా పిలుస్తారు. మొత్తం నాలుగు రోజులు నిర్వహించే ఈ జాతర మొదటి రోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండో రోజు చిలుకల గుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైన ప్రతిష్టిస్తారు. దేవతలను గద్దెలపై ప్రతిష్టించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు.

ఇక మూడోరోజు అమ్మవారిని గద్దెలపై నిలుపుతారు. నాలుగవ రోజు లేదా చివరి రోజు సాయంత్రం దేవతలను యుద్ధ స్నానానికి తీసుకెళ్లారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. పూజారులు కూడా గిరిజనులే. జాతర సమయంలో భక్తులు తమ కోరికలను తీర్చమని అమ్మవారికి (సమ్మక్క, సారలమ్మ) బంగారం (బెల్లం) నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ జాతరకు కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా.. ఇతర మతాలకు చెందినవారు కూడా పాల్గొంటారు.

1940 తరువాత

సాధారణంగా రెండేళ్లకు ఒకసారి జరిగే మేడారం జాతర.. 900 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. నిజానికి ఈ జాతరను 1940లలో చిలుకల గుట్టపైన గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు. ఆ తరువాత తెలంగాణ ప్రజలందరూ కలిసి జరుపుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏటా జనం సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో కొండా దిగి జాతరను జరుపుకోవాల్సి వచ్చింది. ఈ జాతరకు తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా మొదలైన రాష్ట్రాల నుంచి కూడా విచ్చేస్తారు.

Leave a Comment