TGSRTC Employees DA Hike: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: 2.1 శాతం డీఏ పెంపు

TGSRTC Employees DA Hike: తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఆర్టీసీ ఉద్యోగుల డీఏను 2.1 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఉన్న 50.7 శాతం డీఏ 52.8 శాతానికి పెరిగింది.

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల డీఏ పెంపు అంశం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ సంఘాలు కూడా డీఏ పెంపు కోసం పలుమార్లు డిమాండ్ చేశాయి. చివరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగుల్లో సంతృప్తి వ్యక్తమవుతోంది.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యక్ష లాభం చేకూరనుంది. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో జీతాల్లో పెరుగుదల ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించనుంది. తెలంగాణలో పనిచేస్తున్న ఆర్టీసీ సిబ్బందికి ఇది కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.

డీఏ (TGSRTC Employees DA Hike)పెంపు.. సంస్థపై అదనపు భారం

ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు ఉన్న 50.7 శాతం డీఏను 52.8 శాతానికి పెంచడంతో సంస్థపై అదనపు ఆర్థిక భారం పడనుంది. అధికారుల ప్రకారం ప్రతి నెలా సుమారు రూ.2.82 కోట్ల అదనపు వ్యయం సంస్థకు వస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన పెరిగిన డీఏ మొత్తాన్ని సప్లిమెంటరీ బిల్లుల ద్వారా మూడు నెలల్లో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత సంవత్సరం జులైలో కూడా డీఏను 2.1 శాతం పెంచిన విషయం తెలిసిందే.

ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి

డీఏ పెంపు సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం ప్రభుత్వానికి ప్రాధాన్యత అని తెలిపారు. సంస్థలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

“కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ అభివృద్ధి అనే మూడు అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్, కొత్త నియామకాలు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం” అని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా దీర్ఘకాలంగా ఉద్యోగాల నుంచి తొలగించబడిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రక్రియను కూడా చేపడుతున్నట్లు తెలిపారు.

ఉద్యోగులకు బీమా..

తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సామాజిక భద్రత కోసం కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రూ.1 కోటి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా సహజ మరణం సంభవించిన సందర్భంలో రూ.10 లక్షల బీమా సాయం యూనియన్ బ్యాంక్ ద్వారా అందించనున్నారు. ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. సాలరీ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 38 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా లభించనుంది.

సమ్మె ముప్పు ఇంకా తొలగలేదు

ఇక మరోవైపు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈనెల 23 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు వెళ్లే అవకాశం ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు హెచ్చరించారు.

లేబర్ డిపార్ట్‌మెంట్‌తో జరిగిన సమావేశంలో అన్ని అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగలేదని వారు తెలిపారు. ఈనెల 13న మరోసారి చర్చలు జరగనున్నాయి. ఆ తర్వాత సమ్మెపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మరియు యాజమాన్యం కలిసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జేఏసీ నేతలు కోరుతున్నారు.

Also Read: Telangana Ration Card Audit: రెండు లక్షల మందికి రేషన్ కార్డు కట్.. ఎందుకంటే?