చిన్న, పెద్ద, ముసలి, ముతక ఇలా అందరికి ఇష్టమైన దేవుడు ఎవరైనా ఉన్నారంటే.. అది తప్పకుండా రామదూత ‘హనుమాన్‘ అని చెబుతారు. యావత్ భారతదేశంలో దాదాపు అన్ని గ్రామాల్లోనూ ఆంజనేయస్వామి విగ్రహం లేదా గుడి తప్పకుండా ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మన దేశంలోనే ఒక గ్రామంలో హనుమంతుని ఆలయం గానీ.. మారుతి కార్లు గాని లేవు. వినడానికి ఇది వింతగా అనిపించినా.. ఇది నిజం. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడ ఉంది?, అక్కడి ప్రజలు హనుమంతుణ్ణి, మారుతి కార్లను వద్దనుకోవడానికి గల కారణం ఏమిటనే విషయాలు ఈ కథనంలో చూసేద్దాం..
హనుమంతుణ్ణి పూజించరు
ఉత్తరప్రదేశ్‌లోని బిస్రాఖ్ అనే గ్రామంలో స్థానికులు రావణుడిని.. తమ పూర్వీకునిగా భావించి పూజలు చేస్తారు. అదేవిధంగా.. మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉండే ”నండూర్ నింబా దైత్య లేదా దైత్య నండూర్” అనే గ్రామంలో హనుమంతుణ్ణి పూజించరు. హనుమాన్ ఆలయాలు అసలే లేవు. అక్కడ పుట్టే పిల్లలకు కూడా అలంటి పేర్లు పెట్టరు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. మారుతి కార్లను కూడా ఉపయోగించరు. మారుత్ అంటే గాలి, హనుమంతుడు వాయుదేవుని కుమారుడు కావడంతో.. మారుతి కార్లను కూడా ఇక్కడి ప్రజలు వాడటానికి ఇష్టపడరు.
అక్కడి ప్రజల నమ్మకం వెనుక ఉన్న పురాణం
స్థానిక పురాణాల ప్రకారం.. నింబ దైత్యునికి.. హనుమంతుని ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. నింబ దైత్యుడు రాక్షసుడు అయినప్పటికీ.. రామ భక్తుడని చెబుతారు. నింబ దైత్యుడు రాముణ్ణి వేడుకోవడం వల్ల.. ఆ గ్రామంలో ప్రధాన దేవతను రాముడే ఇచ్చాడని చెబుతారు. ఇక్కడి దేవుడు రాక్షసుడే అయినప్పటికీ.. ఎలాంటి జంతుబలులు ఉండవు. భయంకరమైన ఆచారాలను పాటించరు. గ్రామస్థుల ప్రతి ఇంట్లోనూ నింబ దైత్యుని విగ్రహం ఉంటుందని చెబుతారు.
మారుతి ప్రభావం
2000వ సంవత్సరంలో డాక్టర్ సుభాష్ దేశ్‌ముఖ్.. నండూర్ నింబ దైత్య గ్రామంలో వైద్యం చేస్తూ ఉండేవాడు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు రోజంతా ట్రీట్మెంట్ చేస్తుండే వాడు. ఇలా రోజూ తన క్లినిక్ ముందు పెద్ద క్యూ ఉండేది. ఒక రోజు క్లినిక్ ముందర హఠాత్తుగా క్యూ మాయమైంది. దీనికి కారణం అక్కడే ఉన్న మారుతి 800 కారు అని కనుక్కున్నాడు. ఈ కారును అమ్మేసి టాటా సుమో కొనుక్కున్న తరువాత యధావిధిగా పేషంట్స్ రావడం మొదలుపెట్టారు.
స్థానికుల నమ్మకాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నండూర్ నింబ దైత్య గ్రామంలో కార్మికుల బృందం మకాం వేసింది. ఒక రోజు రాత్రి అందులో ఒక కార్మికుడు అరవడం, ఇతరులను కొట్టడం ప్రారంభించాడు. అప్పుడు అక్కడికి స్థానికులు వెళ్లి దైత్య దేవాలయానికి తీసుకెళ్లి, ప్రార్థనలు చేసి నయం చేసారు. ఆ తరువాత అతని పేరు మారుతి అని ఉండటం వల్లనే ఇలా జరిగిందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా.. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో నియమించబడిన మారుతి అనే ఇద్దరు ఉపాధ్యాయుల కథ కూడా ఉంది. మొత్తం మీద వారి నమ్మకాల మీద విశ్వాసంతో.. అక్కడి ప్రజలు ఆచారాలను పాటిస్తున్నారు.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.






