ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు: స్విఫ్ట్ నుంచి సెలెరియో వరకు

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సీఎన్‌జీ కార్లకు కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ కారణంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థలు సీఎన్‌జీ కార్లను కూడా దేశీయ విఫణిలో లాంచ్ చేస్తున్నాయి. అయితే చాలామంది ఎక్కువ మైలేజ్ అందించే సీఎన్‌జీ కార్ల కోసం గూగుల్‌లో తెగ వెతికేస్తుంటారు. అలాంటి వారికోసం ఈ కథనంలో అధిక మైలేజ్ అందించే ఐదు సీఎన్‌జీ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

మారుతి సుజుకి స్విఫ్ట్

దశాబ్దాల చరిత్ర కలిగిన మారుతి స్విఫ్ట్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో సీఎన్‌జీ రూపంలో కూడా అందుబాటులో ఉంది. మల్టిపుల్ వేరియంట్లలో లభించే ఈ కారు ధరలు రూ. 8.20 లక్షల నుంచి రూ. 9.20 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. స్విఫ్ట్ సీఎన్‌జీలోని 1.2 లీటర్ 3 సిలిండర్ జెడ్12 పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇది 32.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది సాధారణ స్విఫ్ట్ మాదిరిగానే ఉంటుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

మారుతి డిజైర్

ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్ల జాబితాలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన డిజైర్ కూడా ఒకటి. దీని ధరలు రూ. 8.79 లక్షల నుంచి రూ. 9.89 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఈ కారులో కూడా 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుంది. అయితే దీని మైలేజ్ స్విఫ్ట్ సీఎన్‌జీ కంటే కొంత ఎక్కువే (33.73 కిమీ/కేజీ). నిజానికి మార్కెట్లో ఎక్కువ అమ్ముడవుతున్న కార్ల జాబితాలో డిజైర్ ఒకటిగా ఉంది.

మారుతి సుజుకి ఆల్టో కే10

ఆల్టో కే10 సీఎన్‌జీ.. కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్ల జాబితాలో ఒకటిగా ఉంది. ఈ కారులో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఇది 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 5.90 లక్షల నుంచి రూ. 6.21 లక్షల మధ్య ఉంది. ఇది కూడా మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. చూడటానికి పరిమాణంలో చిన్నదిగా ఉన్నప్పటికీ.. ఆల్టో కే10 మంచి పనితీరును అందిస్తుంది. కాబట్టి ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మారుతి వ్యాగన్ ఆర్

ఎక్కువ మైలేజ్ అందించే సీఎన్‌జీ కార్ల జాబితాలో.. మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కూడా ఒకటి. దీని ధర రూ. 6.69 లక్షల నుంచి రూ. 7.13 లక్షల మధ్య ఉంది. ఈ కారులోని 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి మంచి పనితీరును అందిస్తుంది. ఇది 34.05 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఇది కూడా మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందిన.. ఎక్కువ అమ్మకాలు పొందుతున్న కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.

మారుతి సెలెరియో

ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్ల జాబితాలో ముఖ్యంగా చెప్పగోదగ్గ కారు మారుతి సుజుకి కంపెనీకి చెందిన సెలెరియో. దీని ధర రూ. 6.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). సెలెరియో సీఎన్‌జీ కారులో 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 34.43 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే మన జాబితాలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా సెలెరియో నిలిచింది. డిజైన్, ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.

Leave a Comment