Most Powerful Bikes Under Rs.20 Lakh in India: మన దేశంలో లక్ష రూపాయల కంటే తక్కువ ధరకు లభించే బైక్ ఉంది. రూ. 20 లక్షలకు లభించే బైకులు ఉన్నాయి. బహుశా వీటిని ఎక్కువమంది కొనుగోలు చేయలేకపోయినా? ఎక్కువ అమ్ముడుకాకపోయినా.. అసలు రూ. 20 లక్షల ఖరీదైన బైకులు ఎలా ఉంటాయి? వాటి వివరాలు ఏంటి అనే ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
డుకాటీ స్ట్రీట్‌ఫైటర్ వీ2
మార్కెట్లో అత్యంత ఖరీదైన బైకులను లాంచ్ చేసే డుకాటీ కంపెనీకి చెందిన స్ట్రీట్‌ఫైటర్ వీ2 మనం చెప్పుకుంటున్న రూ. 20 లక్షల విలువైన బైకుల జాబితాలో ఒకటిగా ఉంది. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 18.50 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ ధర నగరాన్ని బట్టి, ఎంచుకునే వేరియంట్‌ను బట్టి మారుతూ ఉంటుంది.
ఒక్క చూపుతోనే ఆకర్శించబడే డిజైన్ కలిగిన ఈ బైక్ 955 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 153 హార్స్ పవర్ మరియు 101 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు.
బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్
మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో బైక్.. బీఎండబ్ల్యూ మోటోరాడ్ యొక్క ఎస్ 1000 ఆర్. ఈ బైక్ ధర సుమారు రూ. 19 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ప్రో మరియు ఎమ్ స్పోర్ట్స్ అనే మరో రెండు వేరియంట్‌లలో కూడా లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 20.45 లక్షలు మరియు 23.30 లక్షలు (ధరలు ఎక్స్ షోరూమ్). ఈ బైక్ 999 సీసీ ఇంజిన్ కలిగి 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 11000 rpm వద్ద 162.26 Bhp పవర్ మరియు 9250 rpm వద్ద 114 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్
ఎక్కువమంది రైడర్లకు ఇష్టమైన బైకులలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ‘ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్’ కూడా మనం చెప్పుకుంటున్న కేటగిరికి చెందిన బైక్. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 17.95 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఇతర బైకుల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది.
ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 ఆర్ఎస్ బైక్ 1160 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 rpm వద్ద 177.5 Bhp పవర్ మరియు 9000 rpm వద్ద 125 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. నాలుకు కలర్ ఆప్షన్లలో లభించే ఈ బైక్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. తద్వారా ఇది అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది యూరోపియన్ సూపర్‌నేక్డ్ బైక్. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.
సుజుకి హయబుసా
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ యొక్క హయబుసా కూడా మన జాబితాలో చెప్పుకోదగ్గ బైక్. దీని ప్రారంభ ధర రూ. 16.90 లక్షలు, ఇదే మోడల్ యొక్క 25వ యానివెర్సరీ ఎడిషన్ ధర రూ. 17.70 లక్షలు (ఎక్స్ షోరూమ్). అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్.. 1340 సీసీ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి 9700 rpm వద్ద 190 Bhp పవర్ 7000 rpm వద్ద 142 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది.
కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్
జపనీస్ బ్రాండ్ అయిన కవాసకి యొక్క నింజా జెడ్ఎక్స్-10ఆర్ ప్రారంభ ధర భారతీయ మార్కెట్లో రూ. 16.79 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ బైకును కంపెనీ సీకేడీ మార్గం ద్వారా భారతదేశానికి తీసుకువచ్చింది. ఇది 998 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 220.21 Bhp పవర్ మరియు 11400 rpm వద్ద 114.9 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. 17 లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ కలిగిన ఈ బైక్ మంచి డిజైన్, రైడర్లకు కావలసిన ఫీచర్స్ అన్నీ పొందుతుంది. తద్వారా ఇది అత్యుత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.
Don’t Miss: అనంత్, రాధిక పెళ్లి: మనుషులే కాదు.. కార్లు కూడా అందంగా తయారయ్యాయ్!
ఖరీదైన బైకులకు మనదేశంలో ఎందుకు తక్కువ డిమాండ్
నిజానికి భారతదేశంలో చాలామంది రోజువారీ వినియోగానికి ఉపయోగించడానికి ఎక్కువ మైలేజ్ మరియు సరసమైన ధర వద్ద లభించే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా రూ. 20 లక్షలు అనేది భారీ బడ్జెట్. ఈ ధరలు ఓ ఫ్యామిలీ కారునే కొనుగోలు చేయవచ్చని చాలామంది భావిస్తారు. అయితే కొంతమంది సెలబ్రిటీలు, ధనవంతులు మాత్రమే ఈ రకమైన బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ బైకుల మైలేజ్ కూడా చాలా తక్కువ. కాబట్టి వీటి మైలేజ్ కూడా తక్కవే. ఇలాంటి పలు కారణాల వల్ల ఈ బైకులు మనదేశంలో తక్కువ సంఖ్యలో మాత్రమే అమ్ముడవుతున్నాయని తెలుస్తోంది.