తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో యూరియా కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఈ సమస్య రాజకీయమైంపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. యూరియా కొరత ఏర్పడుతుందని మేము చెప్పామని బీఆర్ఎస్ చెబుతోంది. కేంద్రం సరఫరా చేయకపోవడం వల్లనే.. యూరియా సరఫరా చేయలేకపోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ సమస్యను పార్టీ పెద్దలు ఢిల్లీలో కూడా వినిపించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు.
ఎరువులు పక్కదారి పడితే
రాష్ట్రంలో వ్యవసాయేతర పనులకు యూరియా విక్రయించకూడదని ఏపీ సీఎం స్పష్టం చేశారు. అంతే కాకుండా ఎరువుల ధరలను పెంచి అమ్మినట్లయితే.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ డీలర్లకు ఎరువుల సరఫరాను తగ్గించాలని.. రైతులకు అందుబాటు ధరలో అందించడానికి మార్క్‌ఫెడ్ ద్వారానే ఎక్కువగా విక్రయించాలని ఆదేశించారు. ఎరువులు పక్కదారి పట్టకుండా చూడటమే కాకుండా.. రైతులకు అందేలా చూడాల్సిన బాధ్యత కూడా అధికారులకు ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఎరువుల లభ్యత, సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యతను తెలుసుకుంటూ ఉండాలని, ఎప్పటికప్పుడు అధికారులు తనిఖీలు చేస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అని పేర్కొన్నారు.
తెలంగాణాలో యూరియా సమస్యకు కారణం ఏంటి?
ఇటీవల కాలంలో తెలంగాణ రైతులు ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎరువుల కోసం వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోతోంది. అసలే వర్షాకాలం, ఈ సమయంలో దాదాపు రైతులందరూ.. వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. పంట ఏపుగా రావాలంటే తప్పకుండా ఎరువులు అవసరం. దీంతో రైతులకు ఎరువుల అవసరం ఏర్పడింది.
కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి అవసరమైన స్థాయిలో ఎరువులను పంపించకపోవడం వల్లనే రైతులకు అవసరమైనంత ఎరువులను అందించలేకపోయినట్లు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెల్లడించింది. 2025 ఏప్రిల్ నుంచి కూడా ఎరువుల సరఫరా అంతంత మాత్రంగానే ఉందని, దీనికి సంబంధించిన గణాంకాలను కూడా వారు విడుదల చేశారు. మొతం 8.30 లక్షల టన్నుల ఎరువులు అవసరం అయితే.. ఇందులో కేంద్రం 5.12 లక్షల టన్నుల యూరియాను మాత్రమే పంపించినట్లు తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
కేద్రం స్పందన
తెలంగాణాలో తలెత్తిన యూరియా సమస్యపై కేంద్రం స్పందించింది. కర్ణాటక నుంచి 10 వేల టన్నుల యూరియాను కొనుగోలు చేసి.. మొత్తం 50 వేల టన్నుల యూరియాను రాష్ట్రానికి పంపించే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మొత్తం మీద త్వరలోనే తెలంగాణ రైతన్నల సమస్య తీరనుంది.
రైతు దేశానికి వెన్నెముక.. వారు పంట పండిస్తేనే, అందరికీ ఆహారం సరఫరా అవుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సి ఉంది. వారి అవసరాలను ముందుగానే గ్రహించి, దానికి అవసరమైన ప్రణాళికలను ఏర్పాటు చేయాలి. లేకుంటే రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి.. ఒక రకంగా ప్రభుత్వమే కారణం అవుతుంది.
హిమాన్షు కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, సినీ రంగాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలను అందిస్తున్నారు. గతంలో ఆయన ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆసక్తికర వార్తలు, రాజకీయాలు, క్రికెట్ వార్తలు రాశారు. హైపర్ లోకల్ న్యూస్ రైటింగ్‌లో అనుభవం కలిగిన ఆయన వీడియో టీమ్‌తో కూడా పని చేసిన అనుభవం కలిగి ఉన్నారు. జర్నలిజం రంగంలో 14 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆయన ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయాలు, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించిన ఆర్టికల్స్ రాశారు.