US Iran war:ఇరాన్ సంచనల ప్రకటన!.. యుద్ధం ఆపాలంటే?

US Iran war: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై జరగాల్సిన దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే.. టెహ్రాన్ నుంచి ఘాటైన స్పందన వచ్చింది. అమెరికా తమపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసి, యుద్ధ నష్టానికి పరిహారం చెల్లిస్తేనే యుద్ధం ఆపుతామని ఇరాన్ స్పష్టం చేసింది.

గత కొన్ని రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఇంధన వనరులు, విద్యుత్ కేంద్రాలపై దాడులకు అమెరికా సిద్ధమవుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. అయితే శాంతి చర్చలకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రంప్ ఐదు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని నిర్ణయించారు.

ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం తీవ్రతరమైతే అంతర్జాతీయ చమురు ధరలు, గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి మూసివేతతో ఇప్పటికే ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి పెరిగింది.

ఇరాన్ సంచలన షరతులు

అమెరికా నిర్ణయానికి స్పందిస్తూ.. ఇరాన్ సుప్రీం లీడర్ సైనిక సలహాదారు మొహ్సెన్ రెజాయీ కీలక ప్రకటన చేశారు. కేవలం దాడులను వాయిదా వేయడం సరిపోదు. అమెరికా విధించిన అన్ని ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. అలాగే మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని హామీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇరాన్ ఈ విధంగా కఠిన షరతులు పెట్టడం ద్వారా అమెరికాపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ వ్యూహం ఏమిటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రకటనలో.. “గత రెండు రోజులుగా ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన మౌలిక సదుపాయాలపై జరగాల్సిన దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని రక్షణ శాఖకు ఆదేశించాను” అని తెలిపారు.

ఇది ఒక విధంగా శాంతి చర్చలకు మార్గం సుగమం చేయడమే కాకుండా, ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగించే వ్యూహంగా కూడా భావిస్తున్నారు. అయితే ఈ నిర్ణయానికి ఇరాన్ ఇచ్చిన ప్రతిస్పందనతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

ఇస్లామాబాద్‌లో శాంతి చర్చల చర్చ

ఇక అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వైట్ హౌస్ స్పష్టత ఇవ్వలేదు. ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ “ఈ సమావేశం ఇంకా ఖరారు కాలేదు. అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని నిర్ధారించలేం” అని తెలిపారు. అదేవిధంగా ఈ చర్చలు అత్యంత సున్నితమైనవని, మీడియా ద్వారా వివరాలు బయటకు రావడం సరైంది కాదని ఆమె పేర్కొన్నారు.

యుద్ధానికి దారి తీసిన ఘటనలు

ఫిబ్రవరి 28న జరిగిన దాడుల్లో.. ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారులు మరణించడం ఈ ఘర్షణకు కారణమైంది. దీనికి ప్రతిగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలు, ఇజ్రాయెల్ నగరాలపై దాడులు చేపట్టింది.

ఇంకా హార్మూజ్ జలసంధిని మూసివేయడం ద్వారా అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కల్పించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. దీంతో అమెరికా 48 గంటల్లోగా జలసంధిని తెరవాలని అల్టిమేటం జారీ చేసింది. ఇప్పటికే ఖార్గ్ ద్వీపంపై దాడి జరగవచ్చని వార్తలు వచ్చినప్పటికీ, ట్రంప్ అకస్మాత్తుగా దాడులకు విరామం ఇవ్వడం గమనార్హం.

Also read:Modi:25 ఏళ్ల నాయకత్వం.. ఇది కదా మోదీ రికార్డ్ అంటే!