ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈ మాట చిన్నప్పుడు సరిగ్గా అర్థమయ్యేది కాదు, కానీ పెరుగుతున్నకొద్దీ దీని అర్థం, దీనివెనుకున్న పరమార్థం కూడా బోధపడ్డాయి. ఆరోగ్యంగా ఉంటే.. ఏమైనా చేయొచ్చు. కానీ నేడు ఎక్కువమంచి జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నారు. అనారోగ్యానికి ఆహ్వానం పలుకుతున్నారు. చిన్న పిల్లల్లో కూడా ఊబకాయం ఇతరత్రా సమస్యలు నేడు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రధాన కారణం.. మనం తీసుకునే షుగర్ (చక్కెర) అంటున్నారు వైద్య నిపుణులు.
ఇలాంటి సమయంలో ఓ 14 రోజులు లేదా రెండు వారాలు చక్కెర తీసుకోవడం (అదనపు చక్కెర – స్వీట్స్, సాఫ్ట్ డ్రింక్స్ మొదలైనవి) ఆపేస్తే.. శరీరంలో ఎలాంటి మార్పు జరుగుతాయో, ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
మనం తీసుకునే ఆహారంలో దాదాపు చక్కెర (షుగర్) ఉంటుంది. ఇది సరిపోదు అన్నట్టు చాలామంది స్వీట్స్ తినడం, కూల్ డ్రింక్స్ వంటివి తాగడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివే.. ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయంటున్నారు డాక్టర్లు.
షుగర్ ఎక్కువ తీసుకుంటే..
అధిక మొత్తంలో చక్కెర పదార్థాలు తీసుకంటే ఊబకాయం, మధుమేహం, దంతక్షయం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దాదాపు చక్కెర పదార్థాలను తీసుకోవడం చాలామందికి రోజువారీ అలవాటుగా మారిపోయింది, కాబట్టి ఒక్కసారిగా వీటిని కంట్రోల్ చేయడం కష్టమే అయినప్పటికీ.. ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలానే ఉన్నాయి.
చక్కెర పదార్థాల వినియోగం ఎక్కువైనప్పుడు.. కేలరీలు విషయం పక్కన పెడితే.. కోరికలు, ఆకలి, ఇన్సులిన్, కాలేయంలో కొవ్వులు పెరిగిపోవడం వంటివి మీకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. చక్కెరలు శరీరంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని నిపుణులు సైతం సూచిస్తున్నారు.
ప్రయోజనాలు ఇవే..
చక్కెర పదార్థాలు తీసుకోవడం తగ్గించినప్పుడు.. మీ శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి. ప్రారంభంలో తలనొప్పి, నీరసం, చిరాకు వంటివి ఎక్కువగా వస్తాయి. మెదడులో జరుగుతున్న మార్పుకు ఇదొక సంకేతం అని తెలుసుకోవాలి. ఇలా చక్కెరలు తీసుకోవడం తగ్గిస్తూ వచ్చినప్పుడు.. మెదడు కూడా దీనికి అలవాటు పడుతుంది. క్రమంగా కోరికలు తగ్గుతాయి. తరువాత ఉబ్బరం తగ్గుతుంది. ఇన్సులిన్ స్థాయి కూడా మెరుగ్గా ఉంటుంది. అంతే కాకుండా మీ శరీరం చక్కెరను నిర్వహించడంలో సమర్థవంతంగా తయారవుతుంది.
ఇదే విధంగా.. రెండోవారం కూడా కొనసాగిస్తే, పొట్టకూడా కొంత తగ్గుతుంది, మంచి నిద్ర అలవాటవుతుంది. ఆకలికి స్పష్టమైన సంకేతాలు తెలుస్తాయి. జీవక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల మీ శరీరం శక్తిని సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతుంది. ఇది దీర్ఘకాలం ఆరోగ్య ప్రయోజనాలకు దారితీస్తుంది.
ఆరోగ్యం కోసం..
ఆధునిక కాలంలో ఇంట్లో చేసుకునే ఫుడ్ కంటే కూడా బయట తినేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. బయట హోటల్స్ లేదా రెస్టారెంట్ యాజమాన్యం రుచికోసం ఏవేవో ఉపయోగిస్తారు. అలాంటివి మనిషికి అంతమంచిది కాదు. కాబట్టి వీలైనంత వరకు బయట ఫుడ్ తినడం లేదా జంక్ ఫుడ్ తినడం మానుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పకుండా దీనిని ఫాలో అవ్వాలి. ఒక్క షుగర్ తగ్గిస్తేనే.. ఆరోగ్య ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉన్నప్పుడు.. కచ్చితంగా మనం కొన్ని నియమాలతో జీవించాలి. అప్పుడే ఆరోగ్యంగా బతకవచ్చు. లేకుంటే అనారోగ్యాలపాలై.. జీవితాన్ని ఆసుపత్రులలో గడపాల్సి వస్తుంది.
శౌర్య వర్ధన్ సబ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. సినిమా, రాజకీయం వంటి విభిన్న అంశాలపై సమగ్రమైన ఆర్టికల్స్ అందిస్తూ వస్తున్నాను. ఈ రంగంలో నాకు నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. రాయడంలో నైపుణ్యంతో, చదువరులకు స్పష్టమైన మరియు ఆసక్తికరమైన కంటెంట్ అందించడం నా లక్ష్యం.