బంగారం ధరలు పెరుగుతున్నాయా?, లేదా? అంటే.. ఏం చెప్పాలో ఎవరికీ అర్థం కావడం లేదు. కొందరు తులం ధర లక్ష రూపాయలకు చేరుతుంది అంటే.. రాబర్ట్ కియోసాకి వంటివారు గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. వెండి రేటు కూడా ఏ మాత్రం తగ్గకుండా.. రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఏడాది కాలంలో బంగారాన్ని మించిపోతుందా? అన్నట్లు.. రేటు ఎగబాకుతూనే ఉంది. ఇలాంటి సమయంలో కాలజ్ఞానం చెప్పిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాటలు గుర్తొస్తున్నాయి.
బ్రహ్మం గారు ఏం చెప్పారు
పసిడి కనుమరుగవుతుంది, ఇత్తడికి ఆధిక్యం వస్తుందని.. వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాల జ్ఞానంలో చెప్పినట్లు చాలామంది విశ్వసిస్తారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఆ మాటలు నిజమవుతాయేమో అనే అనుమానం కలుగుతోంది. ఎదుకంటే బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలాగే కొనసాగితే.. సాధారణ ప్రజలు పసిడిని కొనగలరా?, కాబట్టి ప్రత్యామ్నాయంగా ఇత్తడి కొనుగోలు చేసే అవకాశం ఉందని వీర బ్రహ్మయ్య భావన.
ఇప్పుడే చాలామంది బంగారం కంటే కూడా ఇత్తడి నగలనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. దీనికి కారణం బంగారం ధరలు పెరగడం మాత్రమే కాకుండా.. ఇత్తడి అయితే రేటు తక్కువ, రోజుకు ఒకటి ధరించవచ్చనే ఆలోచన కూడా. యువత ప్రస్తుతం ఇత్తడి నగలకు కొంత ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. బంగారం అంటే.. పెళ్లిళ్లకో, పేరంటానికో, పండగలకో మాత్రమే అన్నట్లు అయిపోయింది.
ప్రస్తుత బంగారం, వెండి ధరలు
2025 జనవరిలో ఉన్న గోల్డ్, సిల్వర్ రేటు.. 2026 జనవరికి పూర్తిగా మారిపోయాయి. 2025 ప్రారంభంలో సుమారు రూ.75 వేలు వద్ద ఉన్న తులం గోల్డ్ రేటు.. 2026 జనవరి నాటికి రూ. 1.60 లక్షలకు చేరింది. కేజీ వెండి రేటు రూ. 89 వేలు నుంచి రూ. 3.70 లక్షలకు చేరింది. ప్రస్తుతం (ఫిబ్రవరి 17) కేజీ సిల్వర్ రేటు రూ. 2.65 లక్షలు. తులం 24 క్యారెట్స్ తులం బంగారం రేటు రూ. 1.50 లక్షల వద్దకు చేరింది.
బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి
నిజానికి బంగారం ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైనది డిమాండ్. డిమాండుకు తగిన ఉత్పత్తి లేనప్పుడు సాధారణంగా రేటు పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా రాజకీయ, భౌగోళిక కారణాలు కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అవుతున్నాయి. అమెరికా డాలర్ విలువ తగ్గిపోవడం, బ్యాంకులు ఎక్కువగా గోల్డ్ కొనుగోలు చేయడం కూడా బంగారం ధరలను అమాంతం పెంచేస్తుంది. మొత్తం మీద గోల్డ్ ధర ఇంకా.. ఇంకా పెరిగే అవకాశం ఉందని మాత్రం ప్రస్తుత పరిస్థితులు చెప్పకనే చెబుతున్నాయి.
ఎవరీ వీరబ్రహ్మేంద్ర స్వామి?
పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గురించి దాదాపు అందరికి తెలుసు. ఈయన 17వ శతాబ్దంలోనే.. భవిష్యత్తులో జరగబోయే అనేక అంశాల గురించి అంచనా వేశారు. అందులో చాలా జరిగాయని కూడా ప్రజలు నమ్ముతున్నారు. ఈయన ఒక యోగి, బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాత్రమే కాదు, కుల వివక్షను ఖండించిన మహానుభావుడు. ఇప్పటికి కూడా కందిమల్లయ్య పల్లిలో ఆయన మఠం ఉంది. ఎందోమంది ప్రజలు ఇక్కడికి వస్తూ.. పోతుంటారు.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.