యమహా ఎరోక్స్ 155 vs ఎరోక్స్ ఈ: డిజైన్, పవర్‌ట్రెయిన్, ధరలు ఇలా..

ఎరోక్స్ 155 మ్యాక్సీ స్కూటర్ పేరుతో లాంచ్ చేసి.. గొప్ప అమ్మకాలను పొందుతున్న యమహా కంపెనీ, దీనిని ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇటీవలే సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది ఎరోక్స్ ఈ, ఈసీ 06 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. ఇవి రెండూ 2026లో లాంచ్ అవుతాయి. ఆ సమయంలో కంపెనీ ధరలను కూడా అధికారికంగా వెల్లడిస్తుంది.

ఇంతకీ యమహా ఎరోక్స్ 155 మ్యాక్సీ స్కూటర్, లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఎరోక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య వ్యత్యసం ఏమిటి?, తెలుసుకోవాల్సిన అంశాలు ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

డిజైన్ ఎలా ఉందంటే?

యమహా ఎరోక్స్ 155, ఎరోక్స్ ఈ స్కూటర్లు చూడటానికి ఒకేవిధంగా ఉన్నప్పటికీ.. కొన్ని భిన్నమైన డిజైన్ అంశాలను చూడవచ్చు. షార్ప్ లైన్స్, బాడీ ప్యానెల్, సెంటర్ టన్నెల్ వంటివి దాదాపు ఒకే విధంగా ఉంటాయి. ఎలక్ట్రిక్ వెర్షన్ పూర్తి తెలుపు రంగులో ఆకట్టుకునేలా ఉంది. అయితే ఎరోక్స్ 155 స్కూటర్ గ్రాఫిక్స్ పొందుతుంది. ఇందులో ఎగ్జాస్ట్ ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఆ ఎగ్జాస్ట్ ఆప్షన్ పొందదు.

పవర్‌ట్రెయిన్ వివరాలు ఇలా

ఈ విషయంలో మాత్రం.. యమహా ఎరోక్స్ 155, ఎరోక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండూ కూడా భిన్నంగా ఉంటాయి. ఎరోక్స్ 155 మోడల్ 155 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ద్వారా 17.79 బీహెచ్పీ పవర్, 13.9 న్యూటన్ మీటర్ టార్క్ పొందుతుంది. అయితే.. ఎరోక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 9.4 కేడబ్ల్యు మోటార్ ద్వారా 48 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో రెండు 1.5 కిలోవాట్ రిమూవబుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి ఒక పూర్తి ఛార్జ్‌తో 106 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

యమహా ఎరోక్స్ 155 స్కూటర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్‌సీడీ డిస్‌ప్లే, కీలెస్ ఇగ్నిషన్, స్మార్ట్ కీ, ట్రాక్షన్ కంట్రోల్, సింగిల్ ఛానల్ ఏబీఎస్ వంటివి పొందుతుంది. కాగా ఎరోక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్.. సాధారణ స్కూటర్ కలిగి ఉన్న ఫీచర్స్ మాత్రమే కాకుండా, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్, కనెక్టెడ్ ఫీచర్స్, టీఎఫ్టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది.

స్టోరేజ్ వివరాలు ఇలా..

యమహా కంపెనీ ఎరోక్స్ 155, ఎరోక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకే విధమైన స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది. అయితే దీనిని ఉపయోగించే విధానం కొంత భిన్నంగా ఉంటుంది. సాధారణ ఏరోక్స్ స్కూటర్ స్టోరేజీ ప్రాంతంలో మనం వస్తువులను నిల్వ ఉంచుకోవచ్చు. కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. ఆ స్టోరేజ్ ప్రాంతంలో బ్యాటరీలను ఉంచుకోవాల్సి వస్తుంది. తద్వారా వస్తువులను ఉంచుకోవడానికి కొంత స్పేస్ తగ్గుతుంది.

ధరల విషయానికి వస్తే..

సాధారణంగా యమహా ఎరోక్స్ ధర.. ఇతర సాధారణ లేదా ఫ్యూయెల్ స్కూటర్ల కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది. ఎరోక్స్ 155 ధర రూ. 1.70 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువ. ఎలక్ట్రిక్ వెర్షన్ ధరలను సంస్థ వెల్లడించలేదు. అయితే దీని ధర బహుశా రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. ధరలు అధికారికంగా లాంచ్ సమయంలో వెల్లడిస్తారు.