Tuesday, January 27, 2026

దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చి, రికార్డులు బద్దలు కొట్టింది కానీ..?

జీవితంలో ప్రతి ఒక్కరికి సహజంగానే ఏదో ఒకదానిలో నైపుణ్యం ఉంటుంది. అయితే అతి తక్కువ మంది మాత్రమే ఆ విషయాన్ని గమనిస్తారు. తాము ఎంచుకున్న రంగం ఏదైనా గానీ అందులో గొప్పగా సాధించాలనే కలలు కంటారు. అందుకోసం కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఆ ఆశయ సాధన కోసం ఎన్నో ఆశలతో పని చేసుకుంటుపోతారు. ఈ లక్ష్యాలు, ఆశయాలు, కలలు, విజయాలను నెరవేర్చుకోవడం అనేది అంత తేలిక కాదు, దీనికోసం ఇక్కడ ఒక యుద్ధమే చేయాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేధించే క్రమంలో డబ్బు, కులము, రాజకీయం, పరపతి ఇవన్నీ గెలుపుని నిలువరించడానికి అడుగడుగునా ప్రయత్నిస్తూనే ఉంటాయి.

వారికే గుర్తింపు, నజరానాలు..

ఈ దేశంలో కొంతమందికి తమ కోరికలు చాలా తొందరగా, సులువుగా నెరవేరుతుంటాయి. వారికి అంతే గుర్తింపు, నజరానాలు, అన్ని వైపులు నుంచి మద్దతు పెద్ద ఎత్తున లభిస్తుంది. చాలామంది కష్టాలు, కన్నీళ్లు, బాధలు, అవమానాలు, అపనిందలు అన్నింటిని భరిస్తూ, గమ్యాన్ని ముద్దాడే తరుణంలో కులం, రాజకీయం, ధనం, కుటుంబ పరిస్థితులు మానసిక ఒత్తిడి అనే అడ్డంకులను ఎదుర్కొని నిలబడి, పడుతూ లేస్తూ పరిగెత్తుతూ చివరికి కలలుగన్న విజయతీరాలను కౌగిలించుకున్నప్పుడు సత్కారాలు, చప్పట్లు అందుకోవాల్సిన చోట కూడా తిరిగి అదే కన్నీరు, నిర్లిప్తత, అవమానం ఎదురైతే జీవితంలో దానికి మించిన శోకం మరొక్కటి ఉండదు. అచ్చం అలాంటి పరిస్థితినే చవిచూసిన క్రీడాకారిణి విశాఖ ఎక్స్‌ప్రెస్‌గా పేరుగాంచిన తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజీ.

ఆమె శ్రమకి, విజయానికి తగిన గుర్తింపుకి నోచుకోలేదు  ఇటు ప్రభుత్వం పరంగా, అటు ప్రజలు వైపుగా రెండు చోట్ల నిర్లక్ష్యం జరిగిందనే చెప్పాలి. జ్యోతి యర్రాజీ యొక్క ప్రతిభకు తగిన విధంగా అయితే అభినందనలు, సత్కారాలు దక్కలేదనే చెప్పాలి.

గెలిచింది కానీ.. చూసేందుకే ఒక్కరూ లేరు!

ఇప్పుడు అథ్లెట్ జ్యోతి యర్రాజీ గురించి ఎందుకు చర్చించుకోవాల్సి వచ్చిందంటే..  2025 మే 29న దక్షిణకొరియా జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో కేవలం 12. 96 సెకండ్ల సమయంలో గెలిచి బంగారు పతకం సాధించింది. గోల్డ్ మెడల్ అయితే వచ్చింది కానీ పోటీలు జరిగేటప్పుడు వర్షం పడటంతో ఆమె విజయాన్ని చూడటానికి ఆ స్టేడియంలో ప్రేక్షకులు ఒక్కరు కూడా లేరు. తను అలాగే నిరాడంబరంగా మెడల్ స్వీకరించింది. అప్పుడు ఎవరు లేని స్టేడియంలో ఒక్కతే బాధతో కన్నీళ్లు కారుస్తుంటే పంటి బిగవున వాటిని అదిమిపట్టుకుని ఉన్న జ్యోతి ముఖం చూస్తే ఎవరికైనా సరే కంటిలో నీరు ఆగదు. అప్పుడు గుర్తింపు దక్కలేదు ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఆ వీడియో ద్వారా ఇప్పుడు ప్రజల నుంచి లభిస్తోన్న స్పందన ఆనందాన్ని ఇస్తున్నట్టుగా ఆమె బావిస్తున్నారని తెలుస్తోంది.

దేశం తరపున సాధించిన విజయాలు

జ్యోతి 2021 ఏడాది 100 మీటర్ల హార్డిల్స్  బ్రాంజ్ మెడల్ సాధించింది. తరువాత  2022 సంవత్సరంలో అంతర్జాతీయ స్థాయిలో సిల్వర్ మెడల్ తీసుకొచ్చింది. చైనాలోని హంగోజ్ అనే నగరంలో జరిగిన 100 మీటర్ల హార్డిల్స్.. ఆసియా గేమ్‌లో ఈ విజయాన్ని అందుకుంది. అదే ఏట గుజరాత్, నెదర్లాండ్స్, యూకే.. నేషనల్ గేమ్స్, ఆసియా, కామన్వల్త్ గేమ్స్ ఇలా అన్నింటిలో గెలిచింది.

100 మీటర్ల హార్డిల్స్ 13 సెకండ్లలో పూర్తి చేసిన మొదటి ఇండియన్‌గా ఘనత సాధించింది. 2023లో బ్యాంకాక్ ఆసియా ఛాంపియన్‌షిప్‌ 12.78 సెకన్లలో  గోల్డ్, ఎఫ్ఐఎస్యూ వరల్డ్ యూనివర్సిటీ గేమ్‌లో జాతీయ రికార్డు సాధించింది. ఆసియా ఇండోర్‌లో 60 మీటర్ల హర్డిల్స్‌లో 8.13 సెకన్లలో సిల్వర్ గెలిచింది. 2024లో ఇరాన్ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో 60 మీటర్ల హర్డల్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచింది.

2025లో దక్షిణ కొరియా ఆసియా ఛాంపియన్‌షిప్‌(మే )లో, నేషనల్ గేమ్స్ డెహ్రాడూన్, ఉత్తరఖండ్ (ఫిబ్రవరి)లో, పెడరేషన్ కప్ అథ్లెటిక్స్ (ఏప్రిల్)లో,  తైవాన్నా అథ్లెటిక్స్ ఓపెన్ (జూన్)లో.. కూడా 100 మీటర్ల హర్డల్స్‌లోనే నాలుగు స్వర్ణాలు గెలిచింది. 2024లో  జ్యోతి ఎర్రాజీ చేసిన కృషికి గాను అర్జున అవార్డు లభించింది. ఈ విధంగా క్రీడా రంగానికి జ్యోతి ఎనలేని సేవలు చేసింది.

ఎవరీ జ్యోతి యర్రాజీ?

జ్యోతి యర్రాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో పుట్టి పెరిగింది. చదువు అక్కడే కొనసాగింది. తరువాత హైదరాబాద్ కోచ్ నాగపురి రమేష్ అనే ద్రోణచార్య అవార్డు గ్రహీత దగ్గర శిక్షణ పొందింది. 2019 నుంచి జేమ్స్ హిల్లియర్ అనే ఒక బ్రిటిష్ కోచ్ ఆమెకి ట్రైనింగ్ ఇచ్చారు. తన తల్లిదండ్రులు ఏమి లక్షల్లో జీతాలొచ్చే పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగులో.. లేక ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులో కాదు. కోట్లలో ఆదాయాలోచ్చే వ్యాపారాస్తులో, పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులో, ఫేమస్ అయిన సినీ తారలో, లేదా ముందునుంచి క్రీడా నేపథ్యం కలిగిన కుటుంబమో ఇవేవి అస్సలు కానేకాదు. చేసే పనిలో తక్కువ, ఎక్కువ అనేది ఎక్కడా ఉండదు. ప్రతి పని సమాజం ముందుకు నడవడానికి ఉపయోగపడేదే. ఏ ఒక్కరో దేనిని ఉద్దరించలేరు, సమిష్టి సహకారమే సంఘం యొక్క మనుగడకు మూలకారణం.

అయితే భారతదేశం హెచ్చుతగ్గుల మనస్తత్వాలు కలిగిన మనుషులున్న సమూహం కాబట్టి ఆ కోణంలో నుంచి చూస్తే జ్యోతి యర్రాజీ తల్లితండ్రులు అతి సాధారణ జీవితం, జీతంతో జీవించేవారు. తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు (భద్రతను పర్యవేక్షించే ఒక బాధ్యతగల ఉద్యోగి), తల్లి ఆయా (ఆసుపత్రి పరిశుభ్రతను చూసుకునే మానవత్వం ఉన్న ఉద్యోగి). అటువంటి ఇంటి నుంచి వచ్చి, అంతర్జాతీయంగా ఒకసారి కాదు ఏకంగా మూడుసార్లు 100 మీటర్లు హర్డల్స్‌లో దేశానికి బంగారు పతకాలు సాధించి పెట్టింది. అథ్లెట్‌గా జ్యోతి సాధించిన విజయాలు, ఆమె జీవిత ప్రయాణం దేశంలో ఎంతోమందికి ఆదర్శం.

Giribabu
Giribabu
డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. ప్రముఖ విశ్వ విద్యాలయం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. తాజా సినిమా, పాలిటిక్స్, నేషనల్, స్పోర్ట్స్‌కు సంబంధించిన వార్తలతో పాటు ప్రత్యేకమైన కథనాలు రాస్తారు. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా సంవత్సరం అనుభవం కలిగి ఉన్నారు. ఈయనకు పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుడు.

Related Articles