Tamil Nadu Government Formation: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఉత్కంఠగా మారిన రాజకీయ పరిణామాలకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. అత్యధిక స్థానాలు గెలిచిన విజయ్ నేతృత్వంలోని టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలపడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ రోజు (శనివారం) చెన్నైలో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి మద్దతు లేఖలు సమర్పించిన విజయ్, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. మెజార్టీ మార్క్‌ను దాటడంతో ఆదివారం ఉదయం 10 గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ఈ పరిణామం కీలక మలుపుగా మారింది. ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి నెలకొంది. అయితే.. టీవీకేకు ఇతర పార్టీల మద్దతు లభించడంతో.. గవర్నర్ కూడా సంఖ్యాబలం పరిశీలించిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు దిశగా సానుకూలంగా స్పందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన పరిస్థితులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సినీ నటుడిగా ప్రజాదరణ పొందిన విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టి.. తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా నిలవడం గొప్ప విషయం. ఇప్పుడు సీఎం పదవి చేపట్టి తమిళ దళపతిగా నిలువనున్నారు.
గవర్నర్‌ను కలిసి మద్దతు లేఖలు సమర్పించిన విజయ్
టీవీకే చీఫ్ విజయ్ తనకు మద్దతు తెలుపుతున్న పార్టీల నాయకులతో కలిసి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిశారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ ఇచ్చిన మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేశారు. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం సమకూరినట్లు స్పష్టమైంది.
తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీకి 118 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం విజయ్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 120కు చేరింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియకు రాజ్‌భవన్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆదివారం ఉదయం 10 గంటలకు విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
క్యాబినెట్‌లో చేరబోమన్న వీసీకే
ప్రభుత్వ ఏర్పాటులో కీలక మద్దతు అందిస్తున్న వీసీకే మాత్రం క్యాబినెట్‌లో చేరే ఆలోచన లేదని స్పష్టం చేసింది. పార్టీ చీఫ్ తిరుమావళవన్ మీడియాతో మాట్లాడుతూ.. తాము ప్రభుత్వంలో భాగం కాబోమని, బయట నుంచే మద్దతు ఇస్తామని ప్రకటించారు.
”ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ అస్థిరత తలెత్తకుండా చూడడం ముఖ్యం. ప్రజల తీర్పు వృథా కాకుండా ఉండేందుకు మద్దతు ఇస్తున్నాం. భవిష్యత్‌లో ప్రభుత్వంలో చేరుతామా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం” అని ఆయన పేర్కొన్నారు.
వీసీకేతో పాటు ఐయూఎంఎల్ కూడా తాము ఇప్పటికీ డీఎంకే నేతృత్వంలోని కూటమిలోనే ఉన్నామని స్పష్టం చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మరోవైపు వామపక్ష పార్టీలు కూడా క్యాబినెట్ పదవులు తీసుకోబోమని ఇప్పటికే ప్రకటించాయి. ఈ పరిణామాలు తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలపై చర్చకు కారణమవుతున్నాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పడినా, దానికి బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీల పాత్ర కీలకంగా ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
చెన్నైలో భద్రత కట్టుదిట్టం!
ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో చెన్నై పరిసరాల్లో భద్రతను భారీగా పెంచారు. టీవీకే ఎమ్మెల్యేలు ఉన్న రిసార్ట్ బయట పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎమ్మెల్యేల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ప్రభుత్వ ఏర్పాటు దశలో ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు వంటి అంశాలు తలెత్తే అవకాశం ఉండటంతో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా అత్యంత కీలక దశలో రాష్ట్రం ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. టీవీకే శ్రేణుల్లో మాత్రం ఉత్సాహం నెలకొంది. విజయ్ సీఎం అవుతారన్న వార్తలతో పార్టీ కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. చెన్నైతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పార్టీ జెండాలు, పోస్టర్లు కనిపిస్తున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానం!
సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్, రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కూడా అదే ప్రభావాన్ని కొనసాగించారు. ప్రజా సమస్యలపై తరచూ స్పందిస్తూ యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో టీవీకే అనూహ్య విజయాన్ని నమోదు చేయడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ప్రధాన పోటీ సాగిన తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు టీవీకే కొత్త శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా యువ ఓటర్లు, పట్టణ ప్రాంతాల్లో పార్టీకి మంచి మద్దతు లభించినట్లు ఎన్నికల విశ్లేషణలు సూచిస్తున్నాయి. విజయ్ సీఎం అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రాజకీయ అనుభవం తక్కువగా ఉండటం ప్రభుత్వ నిర్వహణలో సవాళ్లు తీసుకురావచ్చని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి.
సంఖ్యాబలం ఇలా ఉంది
- టీవీకే: 107
- కాంగ్రెస్: 5
- సీపీఐ: 2
- సీపీఎం: 2
- వీసీకే: 2
- ఐయూఎంఎల్: 2
భవిష్యత్ రాజకీయాలపై ఆసక్తి
టీవీకే ప్రభుత్వం ఏర్పడితే తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటమి సమీకరణాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. బయట నుంచి మద్దతు ఇస్తున్న పార్టీల వైఖరి భవిష్యత్‌లో ఎలా ఉంటుందన్నదానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ప్రస్తుతం విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుండగా, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు కూడా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా డీఎంకే, అన్నాడీఎంకే తదుపరి రాజకీయ కార్యాచరణపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న ఈ రాజకీయ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో కూడా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి విజయ్ ప్రమాణ స్వీకారంపై నిలిచింది.
Also Read: ఎన్నికల్లో హవా: విజయ్ కార్ల గురించి తెలుసా?

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, బిజినెస్, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
