దేశ భవిష్యత్తు కోసం.. ఈ మూడు అవసరం: పీఎం మోదీ పిలుపు

మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్‌లో కీలక ప్రసంగం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు పెట్రోల్, బంగారం వాడకం తగ్గించాలని ప్రజలను కోరారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!

ప్రస్తుతం ప్రపంచం మరోసారి ఆర్థిక అనిశ్చితి వైపు అడుగులు వేస్తోంది. ముఖ్యంగా ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య రాజుకున్న నిప్పు, అంతర్జాతీయంగా సముద్ర వాణిజ్య మార్గాలను స్తంభింపజేసింది. ఈ పరిణామాల వల్ల భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా దేశ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేశారు.

“దేశం కోసం ప్రాణత్యాగం చేయడం మాత్రమే దేశభక్తి కాదు, బాధ్యతాయుతమైన పౌరుడిగా జీవించడం కూడా అత్యున్నతమైన దేశభక్తి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మోడీ మూడు సూచనలు చేశారు.

చమురు వాడకం తగ్గించండి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, చమురు వినియోగాన్ని తగ్గించడంపై ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారు. మెట్రో రైళ్లు, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించాలని, కార్-పూలింగ్‌ను ప్రోత్సహించాలని కోరారు. అలాగే వస్తు రవాణా కోసం సాధ్యమైనంత వరకు రైల్వే మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

కోవిడ్ సమయంలో మనం అనుసరించిన ‘వర్క్ ఫ్రమ్ హోమ్’, ‘వర్చువల్ మీటింగ్స్’ వంటి విధానాలను మళ్లీ అమలు చేయడం ద్వారా అనవసర ప్రయాణాలను తగ్గించవచ్చని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇది ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి కూడా మేలు చేస్తుందని పేర్కొన్నారు.

విదేశీ కరెన్సీ పొదుపు – బంగారం కొనుగోళ్లపై నియంత్రణ

భారతదేశ విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) హరించుకుపోకుండా ఉండాలంటే విదేశీ ఖర్చులను తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్, విదేశీ పర్యటనలను కనీసం ఏడాది పాటు వాయిదా వేసుకోవాలని కోరారు. ముఖ్యంగా బంగారం వినియోగంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కనీసం ఒక సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లు ఆపివేయాలని, అలాగే వంట నూనెల వాడకాన్ని తగ్గించడం ద్వారా అటు ఆరోగ్యాన్ని, ఇటు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన దేశంలో తయారైన వస్తువులకే (Make in India) ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక ఉత్పత్తుల వాడకం పెరిగితేనే రూపాయి విలువ నిలకడగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

ఇరాన్ యుద్ధం – స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సంక్షోభం

ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ దళాల మధ్య జరుగుతున్న పోరు. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) మార్గం గత రెండు నెలలుగా మూతపడి ఉంది. ఇరాన్ ఈ మార్గం గుండా వెళ్లే నౌకలపై భారీగా పన్నులు విధిస్తుండగా, అమెరికా ఆ పన్నులు చెల్లించవద్దని హెచ్చరిస్తోంది.

ఈ వివాదం కారణంగా సుమారు 1,500 వాణిజ్య నౌకలు గల్ఫ్ ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు అంతర్జాతీయ నౌకాయాన సంస్థ (IMO) వెల్లడించింది. దీనివల్ల సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని భారత్ వంటి దేశాల్లో దిగుమతి వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ మార్గాన్ని పునరుద్ధరించడానికి సైనిక చర్యలకు సిద్ధమవుతున్నా, ఇరాన్ మాత్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.

రైతులకు.. గ్రామీణ భారతావనికి విజ్ఞప్తి

వ్యవసాయ రంగంలో కూడా మార్పులు రావాలని ప్రధాని కోరారు. రసాయన ఎరువుల వాడకాన్ని 50 శాతం తగ్గించి, డీజిల్ పంపుల స్థానంలో సోలార్ పంపులను వినియోగించాలని రైతులకు సూచించారు. ప్రజలు పర్యాటక రంగంపై మొగ్గు చూపడం ద్వారా.. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఆయన చేసిన ఈ ప్రసంగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read: తమిళనాడులో TVK ప్రభుత్వం: విజయ్ ముందున్న 10 సవాళ్లు ఇవే!

Giribabu
Giribabu
గిరిబాబు - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, బిజినెస్, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles