డిగ్రీ అర్హతతో రూ.34 వేల జీతం: 123 పోస్టులు & వివరాలు

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు నెలకు దాదాపు రూ.34 వేల వరకు వేతనం అందించనున్న 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నెల్. మరిన్ని వివరాలు ఇక్కడ..

తెలంగాణలో ప్రభుత్వ రంగానికి.. అనుబంధంగా పనిచేసే సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో మంచి అవకాశం వచ్చింది. గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తున్న తెలంగాణ స్త్రీ నిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ తాజాగా భారీ స్థాయిలో ఉద్యోగ నియామక ప్రక్రియను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా సొంత జిల్లాలోనే పని చేసే అవకాశం ఉండటం వల్ల ఈ నోటిఫికేషన్‌పై యువత ఆసక్తి చూపుతోంది.

డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు అందుబాటులో ఉండటం విశేషం. నెలకు దాదాపు రూ.34 వేల వరకు వేతనం అందించనున్న ఈ పోస్టులు ప్రస్తుతం ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి మంచి అవకాశంగా మారాయి. మే 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

రిక్రూట్‌మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ (ఫీల్డ్ ఆపరేషన్స్) పోస్టులను భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా నియామకాలు జరగనున్నాయి. పోస్టుల కేటగిరీ వివరాలు కూడా ప్రకటించారు. ఓసీ అభ్యర్థులకు ఎక్కువ సంఖ్యలో అవకాశాలు ఉండగా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు కూడా రిజర్వేషన్లు కల్పించారు.

ఉద్యోగాలు పూర్తిగా ఫీల్డ్ వర్క్‌కు సంబంధించినవి కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో పని చేయడానికి ఆసక్తి ఉండాలి. స్వయం సహాయక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది. నెలలో కనీసం 20 రోజుల పాటు ఫీల్డ్ టూర్లు ఉండే అవకాశం ఉందని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అభ్యర్థులు తమ సొంత జిల్లాలో ఉన్న ఖాళీలకే దరఖాస్తు చేసుకోవాలి. దీంతో కుటుంబానికి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉద్యోగం చేసే అవకాశం లభిస్తోంది.

అర్హతలు, వయోపరిమితి

ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే వారు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓసీ అభ్యర్థులకు కనీసం 65 శాతం మార్కులు ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారై ఉండటం తప్పనిసరి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడటం, చదవడం, రాయడం రావాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం. ముఖ్యంగా MS Office వినియోగంపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ఫీల్డ్ స్థాయిలో పని చేయాల్సి ఉండటంతో బైక్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తరచూ ప్రయాణాలు చేయాల్సి రావడంతో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.

వయస్సు విషయానికి వస్తే.. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది.

పరీక్ష విధానం.. జీతం వివరాలు

అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. గంటన్నర వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లిష్, బ్యాంకింగ్‌తో కూడిన జనరల్ అవేర్‌నెస్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు ఇప్పటి నుంచే సీరియస్‌గా ప్రిపరేషన్ ప్రారంభించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ అవేర్‌నెస్, రీజనింగ్ సెక్షన్లపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెబుతున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత ఉండటంతో జాగ్రత్తగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.33,960 వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా ట్రావెల్ అలవెన్స్, పనితీరు ఆధారిత వేరియబుల్ పే కూడా ఉండొచ్చు. ఫీల్డ్ స్థాయిలో పని చేసే వారికి ఇది ఆకర్షణీయమైన వేతనంగా భావిస్తున్నారు. దరఖాస్తు ఫీజు కూడా కేటగిరీల వారీగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.770 చెల్లించాలి. ఇతర అభ్యర్థులకు రూ.885 ఫీజు ఉంటుంది.

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ వంటి పలు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 29, 2026 రాత్రి 12 గంటల వరకు మాత్రమే. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో ముందుగానే అప్లై చేయడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

ఈ ఉద్యోగాలు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కాకపోయినా, మంచి వేతనం, సొంత జిల్లాలో పని చేసే అవకాశం ఉండటం వల్ల నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఉపయోగకరమైన అవకాశంగా మారనుంది.

Also read:ప్రభుత్వం కీలక నిర్ణయం: వడ్డీ లేని రుణం రూ.10 లక్షల వరకు!

Mahesh
Maheshhttp://marthatelugu.com
మహేష్ - నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో రెండు సంవత్సరాలుగా సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నాను. నాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వార్తలు రాయడంలో అనుభవం ఉంది. జర్నలిజం రంగంలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. డిజిటల్ మార్కెటింగ్, తెలుగు కంటెంట్ సృష్టిలో నైపుణ్యం కలిగిన నేను.. క్రియేటివ్, ఆకర్షణీయ, సమాచారపరమైన కంటెంట్ రూపకల్పనలో ప్రత్యేకత కలిగి ఉన్నాను.

Related Articles

- Advertisement -spot_img

Latest Articles