తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ‘తెల్ల తువాలు కుర్చీ’ సంప్రదాయానికి ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ స్వస్తి పలికిన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార ప్రతీకగా మారిన తెల్లటి తువాలు వేసిన కుర్చీలను తొలగించాలని కోరుతూ 14 ఏళ్ల పర్యావరణ ఉద్యమకారిణి లిసిప్రియా కాంగుజమ్ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ సీఎం విజయ్ ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇటీవల జరిగిన సమావేశంలో ఆయన తువాలు లేని కుర్చీలో కూర్చోవడం ఈ నిర్ణయానికి సంకేతంగా మారింది.
భారత ప్రభుత్వ కార్యాలయాల్లో అల్మారాలు, ఫైళ్లు, అధికారుల ప్రత్యేక కుర్చీలు అనేవి సాధారణ దృశ్యాలే. అయితే తెల్లటి తువాలు వేసిన కుర్చీ మాత్రం అధికార హోదా, ప్రత్యేక గుర్తింపుకు చిహ్నంగా మారిపోయింది. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పుడు తమిళనాడులో ముగియడం ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
చిన్నారి.. చేసిన ఒక సోషల్ మీడియా విజ్ఞప్తికి స్పందించి ప్రభుత్వం సంప్రదాయాన్ని మార్చడం ప్రజాస్వామ్యానికి మంచి ఉదాహరణగా కొందరు అభిప్రాయపడుతుండగా, మరికొందరు దీనిని చిన్న విషయంగా చూస్తున్నారు. అయినప్పటికీ ఈ మార్పు వెనుక ఉన్న సామాజిక సందేశం ఇప్పుడు విస్తృత చర్చకు దారితీసింది.
బ్రిటీష్ కాలం నుంచి వస్తున్న సంస్కృతి
ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్లటి తువాలు వేయడం అనే పద్ధతి బ్రిటీష్ పాలన కాలంలో ప్రారంభమైంది. అప్పట్లో ఎయిర్ కండిషనింగ్ సౌకర్యాలు లేకపోవడంతో అధికారులు చెమట, దుమ్ము, జుట్టు నూనె మరకల నుంచి కుర్చీలను రక్షించేందుకు తువాలు ఉపయోగించేవారు.
తెల్లటి తువాలు అయితే సులభంగా ఉతకడం, మార్చేయడం సౌకర్యంగా ఉండటంతో అదే పద్ధతి విస్తరించింది. క్రమంగా అది కేవలం అవసరానికి పరిమితం కాకుండా అధికారానికి గుర్తుగా మారిపోయింది.
పెద్ద అధికారుల కుర్చీలకు మాత్రమే తెల్లటి తువాలు ఉండగా, మిగతా ఉద్యోగులకు సాధారణ కుర్చీలు ఉండేవి. ఏదైనా ముఖ్య అతిథి వస్తే వెంటనే మరో తువాలు వేసిన కుర్చీని తీసుకురావడం సాధారణంగా కనిపించేది. ఈ విధంగా ఒక సాధారణ వస్తువు ‘వీఐపీ కల్చర్’కు ప్రతీకగా మారిపోయింది. కొంతకాలంగా ఈ తువాలు సంప్రదాయంపై విమర్శలు కూడా వచ్చాయి. ఇది ప్రభుత్వ ఖర్చు వృథా అని, బ్రిటీష్ పాలన ఆనవాళ్లను ఇప్పటికీ కొనసాగిస్తున్నామనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
లిసిప్రియ విజ్ఞప్తితో మొదలైన మార్పు
తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయానికి కారణం 14 ఏళ్ల పర్యావరణ కార్యకర్త లిసిప్రియా కాంగుజమ్ చేసిన విజ్ఞప్తి. సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రభుత్వ కార్యాలయాల్లో కొనసాగుతున్న ‘వీఐపీ టవల్ కల్చర్’ను నిలిపివేయాలని కోరింది.
ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం విజయ్ ఇటీవల నిర్వహించిన అధికారిక సమావేశంలో తువాలు లేని కుర్చీలో కూర్చున్నారు. అనంతరం విడుదలైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన లిసిప్రియా సీఎం విజయ్‌కు ధన్యవాదాలు తెలిపింది. ప్రజలకు దగ్గరగా ఉండే పాలనకు ఇది మంచి సంకేతమని పేర్కొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన
ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీన్ని చిన్న విషయంగా తీసుకుంటూ, దేశంలో పెద్ద సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి అంశాలపై దృష్టి పెట్టడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.
అయితే మరికొందరు మాత్రం చిన్న మార్పులే పెద్ద సామాజిక మార్పులకు దారితీస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార ప్రతీకలను తగ్గించడం ప్రజాస్వామ్య భావనను బలపరుస్తుందని చెబుతున్నారు. “తెల్లవాళ్లు వెళ్లిపోయారు.. కానీ వాళ్ల తువాలు మాత్రం మిగిలిపోయాయి” అనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్నాయి. బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న పాత వ్యవస్థలను ఇప్పటికైనా మార్చాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
లిసిప్రియా కాంగుజమ్ ఎవరు?
లిసిప్రియా కాంగుజమ్ మణిపూర్‌కు చెందిన యువ పర్యావరణ ఉద్యమకారిణి. 2011 అక్టోబర్ 2న జన్మించిన ఆమె చిన్న వయసులోనే వాతావరణ మార్పులపై అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. తండ్రి ప్రేరణతో పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమాలు చేపట్టిన లిసిప్రియా 2019లో స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగిన COP25 సదస్సులో ప్రపంచ నాయకుల ముందు ప్రసంగించింది. అదే ఏడాది భారత పార్లమెంట్ ముందు వాతావరణ చట్టం కోసం వారంపాటు నిరసన కార్యక్రమం చేపట్టింది.
క్లైమేట్ చేంజ్ అంశాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆమె చేసిన ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గుజరాత్ ప్రభుత్వం కూడా ఈ అంశంపై చర్యలు తీసుకుంది. ప్రస్తుతం ఆమె ‘చైల్డ్ మూవ్‌మెంట్’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తోంది.
Thanks, @TVKVijayHQ Sir. Your action proves that you are listening to the voices of common people. Change is coming, whether we like it or not. 🙏
Before After pic.twitter.com/8Ep5etc03d— Licypriya Kangujam (@LicypriyaK) May 15, 2026
అయితే 2023-25 మధ్య మణిపూర్ హింస సమయంలో ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అరంబై తేంగోల్ గ్రూప్‌కు మద్దతు తెలిపిందన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్‌కు చేసిన విజ్ఞప్తితో మళ్లీ వార్తల్లో నిలిచింది.
ప్రజాస్వామ్యానికి దగ్గరగా పాలన?
తమిళనాడులో ‘టవల్ చెయిర్’ సంప్రదాయాన్ని తొలగించే ప్రయత్నం చిన్న మార్పుగానే కనిపించినా, ప్రభుత్వ వ్యవస్థలో అధికార ప్రతీకలను తగ్గించే దిశగా ఇది సంకేతంగా భావిస్తున్నారు.
ప్రజలతో సమానత్వ భావన పెంపొందించాలంటే ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా మార్పులు అవసరమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న పాత ఆచారాలను సమీక్షించాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. సీఎం విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్చలకు దారితీసే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also read: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

గిరిబాబు – నేను MarthaTelugu వెబ్‌సైట్‌లో డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో MA తెలుగు చేశారు. నాకు రైటర్‌గా మూడేళ్ల అనుభవం ఉంది. నాకు జాతీయ వార్తలు, బిజినెస్, ప్రత్యేక కథనాలు రాయడంలో ప్రావీణ్యం ఉంది. వార్తలు మాత్రమే కాకుండా పాటలు, కవితలు, షార్ట్ ఫిలిమ్స్ వంటివాటికి మాటలు రాసే అలవాటు ఉంది. సహజంగా జానపద, సినిమా పాటలు గాయకుణ్ణి.
